ముంబై, నవంబర్ 17,
వివాదాలు లేకపోతే కొందరికి నిద్ర పట్టదేమో. ఒకపక్క విమర్శలు వస్తున్నా సరే నోటికి పని చెప్పకుండా ఉండరు కొందరు. అటువంటి వారిలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఒకరు. ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన 2014లోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని వ్యాఖ్యానించి అటు ప్రతిపక్షాలతోనే కాకుండా బీజేపీ పక్షం నుంచి కూడా విమర్శలు ఎదుర్కున్నారు కంగనా రనౌత్. అయినా ఎక్కడా ఆమె వెనక్కి తగ్గడం లేదు. మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నేనింతే అంటున్నారు కంగనా రనౌత్.ఒక చెంప చూపితే స్వాతంత్య్రం రాదని, భిక్ష మాత్రమే వస్తుందని” అంటూ తాజాగా ఆమె పరోక్షంగా మహాత్మా గాంధీని ఆమె విమర్శించారు. అంతేకాదు.. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్‌కు గాంధీ మద్దతు ఇవ్వలేదని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. బోస్.. దేశంలో అడుగుపెడితే ఆయనను అప్పగించేందుకు జవహర్‌లాల్ నెహ్రూ, మొహమ్మద్ అలీ జిన్నాతో కలిసి గాంధీ ఓ బ్రిటిష్ జడ్జితో ఒప్పందం కుదుర్చుకున్నారు. మనం నేతాజీ లేదా గాంధీ ఇద్దరిలో ఒకరికి మాత్రమే అభిమానులుగా ఉండగలం. ఇద్దరినీ అభిమానించలేమని ఆమె తన పోస్ట్ లో వ్యాఖ్యానించారు. అంతేకాదు.. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని కొందరు పిరికిపందలు బ్రిటిష్ వారికి అప్పగించారు. స్వాతంత్య్ర కోసం పోరాడాలన్న కాంక్ష, ధైర్యం ఆ పిరికివారిలో లేవు. వారెప్పుడూ అధికారం కోసం పాకులాడిన గుంటనక్కలు అంటూ తీవ్రమైన పదాలు వాడారు తన పోస్ట్ లో. దీనితో పాటు భగత్ సింగ్‌ను ఉరితీయాలని గాంధీ కోరుకున్నట్లు సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి అంటూ కంగనా వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. నిజమైన వీరులెవరో ప్రజలు గుర్తించాలని ఆమె కోరారు. ఏటా నిజమైన యోధుల జయంతి, వర్ధంతి రోజు మాత్రమే వారిని స్మరించుకోరాదని, ఏడాదిలో రెండు రోజులు వారిని స్మరించుకొని మిగతా రోజులు పట్టించుకోకపోవడం బాధ్యతారహితమని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.ఇప్పటికే కంగనా అంటే మండి పడుతున్న విపక్షాలు ఇప్పుడు ఈమె చేసిన వ్యాఖ్యలకు ఏవిధంగా రియాక్ట్ అవుతారనేది తేలాల్సి ఉంది. కంగనా రనౌత్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపే అవకాశాలున్నాయి. కంగనాకు పద్మ అవార్డు ఇవ్వడంపై గుర్రుగా ఉన్న విపక్షాలు ఇప్పుడు మరోసారి ఆమెను టార్గెట్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎదిఎమైనా ఎంత వివాదం రేగినా.. తన పంథా మార్చుకోవడం లేదు కంగనా రనౌత్.