కర్నూలు, నవంబర్ 18,
ఆంధ్ర ప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా ఉల్లిపాయ, టమాటా ధరలకు సామాన్యుల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో పంటలు నీట మునిగాయి. దీంతో నాన్ వెజ్ ధరలతో టమాటా , ఉల్లిపాయ ధరలు పోటీ పడుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా ప్రతి ఇంట్లోనూ ఉండే టమాటా వైపు చూడాలంటే భయమేస్తుందని వాపోతున్నారు. గత నెల రోజులక్రితం రూ. 30 లు ఉండగా… తాజాగా రూ. 100 లకు చేరుకుంది. రిటైల్ మార్కెట్లోనే కాదు.. వ్యవసాయ మార్కెట్ లో కూడా ఎన్నడూ లేనంతగా టమాటా ధర ఆకాశాన్ని తాకుతుండడంతో ఏమి కొనాలి ఏమి తినాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో టమాటాకు పుట్టినిల్లుగా భావించే చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా కిలో టమాటా ఏకంగా రూ. 100 పలికింది. దీనికి కారణం ఏపీలో కురుస్తున్న వర్షాలు అని వ్యాపారాలు చెబుతున్నారు.మదనపల్లె వ్యవసాయ మార్కెట్ నుంచి తూర్పు, ఉత్తరాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు టమాటాలు ఎగుమతి అవుతున్నాయి. నాణ్యమైన టమాటా ధరలు కిలో రూ.6 నుంచి రూ.14 వరకు హోల్‌సేల్‌లో విక్రయించేవారు. సెప్టెంబర్ చివరిలో మార్కెట్, గత వారంలో రూ. 50-70కి చేరుకుంది. అయితే ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా కిలో టమాటా ఏకంగా రూ. 100 పలికింది. మరోవైపు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కూరగాయల మార్కెట్‌లోనూ టమాటా ధర భారీగా ఉంది. రెండు రోజుల క్రితం ఇక్కడ కిలో టమాటా ధర రూ. 50-60 మధ్య ఉండగా.. ఇప్పుడు రూ. 100కు చేరింది. 28 కిలోలు ఉండే క్రేట్ ధర మార్కెట్‌లో గరిష్ఠంగా రూ. 2,800 పలికింది.నిన్నమొన్నటివరకూ కిలో రూ. 20 నుంచి రూ. 30 వరకూ ఉన్న కిలో కూరగాయలు వర్షాలతో ఒక్కసారిగా పెరిగిపోయాయి. కొన్ని కూరగాయల ధరలు కిలోకు వంద రూపాయలకు చేరువలో ఉన్నాయి. మరికొన్ని 50 రూపాయాలకు తక్కువ కాకుండా ఉన్నాయి. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఓ వైపు కరోనాతో అంతంత మాత్రంగా ఉన్న ఆర్ధిక పరిస్థితిలో సామాన్యులు, మధ్య తరగతివారు ఇప్పుడు పెరుగుతున్న కూరగాయల ధరలకు విలవిలలాడుతున్నారు. ఏమి కొనాలి, ఏమి తినాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల ధరలు తగ్గేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఈ ఏడాది మేం తీవ్రంగా నష్టపోయాం. ఇప్పుడు పెరిగిన ధరలు మాకు కొంత ఊరటనిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇతర రాష్ట్రాల్లో పంట తక్కువగా ఉండడంతో.. మదనపల్లె మార్కెట్‌లో టమాటాకు డిమాండ్ పెరిగింది. గత వారంలో కిలో ధర రూ.74కి చేరింది. ఇప్పుడు వందకు చేరుకుంది. తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన టమాటా వ్యాపారులు స్థానిక వ్యాపారులకు ఆర్డర్లు ఇస్తున్నారు’’ అని మదనపల్లెకు చెందిన రైతు తెలిపారు.