YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీలో రైల్వే జోన్ రాజకీయం

టీడీపీలో రైల్వే జోన్ రాజకీయం

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుకోసం చేపట్టనున్న ఉద్యమం తెలుగుదేశం పార్టీలో వివాదానికి తెరతీసింది. ఇప్పటికే జిల్లాలో మంత్రుల మధ్య విభేదాలతో అధిష్ఠానం తల పట్టుకుంటుండగా...తాజాగా మంత్రి గంటా, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టిల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ప్రజారాజ్యం పార్టీలో చేరినప్పటి నుంచి ఇద్దరూ కలసిమెలసి తిరిగిన గంటా, ముత్తంశెట్టి గత ఎన్నికల సమయంలో ఒకేసారి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే వీరి మధ్య కొద్దిరోజులుగా దూరం పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రైల్వేజోన్‌ కోసం ఇరువురు వేర్వేరు కార్యక్రమాలు చేపట్టడం చర్చనీయాంశమైంది.

 

రైల్వేజోన్‌పై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇటీవల నగరంలోని ఒక హోటల్‌లో నాన్‌ పొలిటికల్‌ జేఏసీ నిర్వహించిన సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేశ్‌బాబు, పలువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశం నిర్వహణకు చొరవ చూపింది గంటా శ్రీనివాసరావే అన్నది బహిరంగ రహస్యం. రైల్వే జోన్‌ సాధన దిశగా పోరాడేందుకు గత ఆదివారం గంటా సారథ్యంలో జేఏసీ సమావేశం జరిగింది. ప్రజా, ఉద్యోగ సంఘాలతో కలిపి జేఏసీ ఏర్పాటు చేస్తామని ఆ రోజు మంత్రి ప్రకటించారు. దాని ప్రకారమే సమావేశం నిర్వహించి, జేఏసీ ఏర్పాటుచేశారు. అయితే గతవారం నిర్వహించిన సమావేశానికి తనకు రెండు గంటల ముందు ఆహ్వానం అందిందని అదేరోజు అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఐతే జేఏసీ సమావేశానికి హాజరు కావాలంటూ ఎంపీ ముత్తంశెట్టిని ఎన్జీవో అధ్యక్షుడు ఈశ్వరరావు ఆహ్వానించారు. ఇది ఆయనకు ఆగ్రహం తెప్పించింది.

దీంతో జోన్‌ సాధనకు సొంతంగా పోరాటం చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేశారు. పార్టీలో తనకు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు, నాయకులకు ముందుగా సమాచారం ఇచ్చి ఈనెల 6న తొమ్మిది గంటలకు రైల్వే స్టేషన్‌లో ఒక రోజు నిరాహార దీక్షకు కూర్చున్నారు. సాధారణంగా రైల్వేస్టేషన్‌ ఆవరణలో ఆందోళనలు, దీక్షలకు అనుమతి ఉండదు. ఆ విషయం తెలిసే ముత్తంశెట్టి అనుచరులతో వెళ్లి అకస్మాత్తుగా టిక్కెట్‌ కౌంటర్‌ వద్ద దీక్షలో కూర్చున్నారు. దశాబ్దాలుగా రైల్వేజోన్‌ కోసం ఉత్తరాంధ్రలో అనేక పోరాటాలు సాగాయి. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు పోరాటం శుభపరిణామమే. అయితే సమస్యంతా పార్టీని ఇరుకున పెట్టేలా వుందనే విమర్శలు కేడర్‌ నుంచి వినిపిస్తున్నాయి.

జిల్లాలో మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య ఇప్పటికే విభేదాలున్నాయి. అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా చెప్పినా ఎవరి దారి వారిదే. కలిసి పనిచేసిన దాఖలాలు లేవు. మంత్రుల మధ్య విభేదాలు పార్టీ, జిల్లా అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యే పార్టీకి పెద్ద తలనొప్పిలా పరిణమించగా...తాజాగా ఒకే వర్గంగా వుండే గంటా, ముత్తంశెట్టిల మధ్య పొరపొచ్ఛాలు వచ్చాయి. ఇటీవల గంటా వైఖరిపై ముత్తంశెట్టి అసంతృప్తితో వున్నారనే ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని ముత్తంశెట్టి ఆశపడుతున్నారు. గతంలో తాను గెలిచిన భీమిలి తనకు సురక్షితమైన నియోజకవర్గమని ఆయన భావించడం...కొందరు మద్దతుదారులు భీమిలిలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం జరిగింది. అయితే వీటిని గంటా అనుచరులు తొలగించడంతో ముత్తంశెట్టి మనస్తాపం చెందారని అప్పట్లో ప్రచారం సాగింది.

ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య విభేదాలు పొడసూపాయని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కేంద్రంపై పోరాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అండగానే విశాఖలో రైల్వేజోన్‌పై ఉద్యమం చేపట్టడం మంచిదే అయినా అధికారపార్టీ నేతలు వేర్వేరుగా పని చేయడం ఇబ్బందేనని సీనియర్‌ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. రైల్వేస్టేషన్‌లో ముత్తంశెట్టితో కలిసి అర్బన్‌ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్‌ కూడా నిరాహార దీక్షలో కూర్చున్నారు. సీనియర్‌ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు, తదితరులు ముత్తంశెట్టికి సంఘీభావం తెలిపారు. కాగా ముత్తంశెట్టి ఉద్యమానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు జేఏసీ సమావేశంలో ప్రకటించడం కొసమెరుపు.

Related Posts