జమ్మూ కశ్మీర్ నవంబర్ 18
జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నలుగురు మాజీ మంత్రులు, మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో తమ పదవులకి రాజీనామా చేశారు. పార్టీ వ్యవహారాల్లో తమ అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం కల్పించడం లేదని, అందుకే పదవుల్ని వీడుతున్నట్టుగా వారు చెప్పారు. రాజీనామా చేసిన వారంతా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌కి అత్యంత సన్నిహితులు. మాజీ మంత్రులు జి. ఎం.సరూరి, జుగల్ కిశోర్, వికార్ రసూల్, డాక్టర్ మనోహర్‌లాల్‌లు పార్టీ పదవుల నుంచి తప్పుకున్న వారిలో ఉన్నారు. వారు తమ రాజీనామా లేఖల్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు జమ్ము కశ్మీర్ ఇన్‌చార్జ్ కార్యదర్శి రజిని పాటిల్‌కు పంపారు. పార్టీలో తమ గోడు వినిపించుకునే నాథుడే లేడంటూ కశ్మీర్ పీసీసీ చీఫ్ మిర్‌పై ధ్వజమెత్తారు. మిర్ తమపై తీవ్ర వ్యతిరేక భావంతో ఉన్నారని, పార్టీ వ్యవహారాల్లో తమకు ఎందులోనూ అవకాశం కల్పించడం లేదని నిందించారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు తమ సమస్యల్ని తీసుకువెళ్లడానికి ప్రయత్నించినా తమకు సమయం ఇవ్వలేదని ఆ నేతలు చెప్పారు.