ఎండలు మండుతున్నాయి. బయటికి వచ్చేందుకు జనాలే జంకుతున్నారు. మరి నల్గొండ జిల్లాలోని నలమల అడవుల్లో ఉంటున్న వన్యప్రాణుల పరిస్థితి ఏమిటి? వేసవిలో వాటి దాహార్తి తీర్చేందుకు ఏర్పాటుచేసిన తొట్లు ఎండిపోతున్నాయి. ఫలితంగా అటవీ జంతువులు దాహార్తిని తీర్చుకునేందుకు పరిసరాల్లోని గ్రామాలు, కృష్ణా నదీ వెనుక జలాల వైపు వచ్చి ప్రాణాలను బలవుతున్నాయి. దీనికితోడు అటవీ సమీపంలోని కొందరు అక్రమార్కులు అటవీ భూమిని వ్యవసాయ భూమిగా మార్చుకొని సాగులోకి తీసుకువస్తున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. సాగులోని పంటలను కాపాడుకునేందుకు భూమి చుట్టూ అక్రమంగా విద్యుత్తు తీగలను అమర్చుతున్నారు. ఫలితంగా వన్యప్రాణులు ప్రాణాలను పోగొట్టుకుంటున్నాయి. దేవరకొండ డివిజన్ పరిధిలో చందంపేట, నేరడుగొమ్ము, డిండి మండలాల పరిధిలో 26,785 హెక్టార్లలో నలమల అటవీ విస్తరించి ఉంది.
చందంపేట, నేరడుగొమ్ము మండలాల్లోని కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో ఎలాంటి అనుమతి లేకుండా రహదారులను నిర్మిస్తున్నారు. ఎండలను ఆసరా చేసుకొని ఎండున్న చెట్లను అక్రమార్కులు నరుకుతున్నారు. అటవీ ప్రాంత సమీపంలో ఉన్న కొందరు నాయకులు, అధికార పార్టీ నాయకుల అండదండలతో వృక్షాలను నరికి సాధారణ భూములను.. వ్యవసాయ భూములు మార్చి సాగులోకి తేవడం, విక్రయాలకు సంబంధిత అధికారులు వత్తాసు పలకడంతో విస్తీర్ణం తగ్గుముఖం పడుతోంది. అడవుల విస్తీర్ణం 33 శాతం ఉండాలి. జిల్లాలో కేవలం 5 శాతమే ఉంది. ఉన్న విస్తీర్ణం ఏటికేడు తగ్గుముఖం పట్టడంతో వన్యప్రాణులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. అటవీ భూములు ఆక్రమాణకు గురవుతున్నట్లు పలువురు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. చందంపేట మండల పరిధిలో సర్కిల్‌తండా, కంబాలపల్లి, పొగిళ్ల, బొల్లారం, రేకులవలయం, కాచరాజుపల్లి, రేకులగడ్డ, పెద్దమూల, చిత్రియాల గ్రామాల సమీపంలో అటవీశాఖ భూములు భారీగా ఆక్రమణకు గురయ్యాయి.
వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు నలమల అటవీ ప్రాంతంలో 40 నీటి తొట్లను ఏర్పాటు చేయగా.. నూతనంగా మరో 20 ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వరుస కరవు, ఎండల కారణంగా అవి ఖాళీ అవుతున్నాయి. అటవీ ప్రాంతంలో రహదారి మార్గంలేని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడంతో నీటిని సరఫరా చేసే ట్యాంకర్లు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీనికితోడు ప్రభుత్వం ఇచ్చే రూ.400కు నీటి ట్యాంకర్ల యాజమానులు ముందుకు రావడం లేదు. వారానికోసారి తొట్లను శుభ్రంచేసి నీటి నింపాల్సి ఉంది. ఎక్కడా ఈ విధానం అమలుకావడంలేదు. రెండు, మూడు వారాలకోసారి నీటిని నింపి మిగిలిన నిధులను స్వాహా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.