హైదరాబాద్, నవంబర్ 18,
తెలంగాణ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు అవసరమైతే ఢిల్లీ వరకు యాత్ర చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ప్రకటించారు. సీఎం, మంత్రులు ధర్నా చేసే పరిస్థితిని కేంద్రమే తీసుకొచ్చిందన్నారు. అద్భుతమైన పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నట్టే.. అంతకుమించిన పోరాటాలతో రైతాంగం ప్రయోజనాలు కాపాడుతామని రైతులకి భరోసానిచ్చారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ 51 గంటల దీక్ష చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. కేంద్రం కళ్లు తెరిపించడానికే ఈ యుద్ధం చేస్తున్నామన్నారు. ఇందిరాపార్క్ దగ్గర జరుగుతున్న దీక్షలో వరి కంకులతోపాటు నాగలిని పట్టుకున్నారు ముఖ్యమంత్రి. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద చేపట్టిన రైతు మహాధర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందన్న సీఎం.. కేంద్రం విధానాల వల్ల మన రైతాంగం దెబ్బతినే పరిస్థితి నెలకొందన్నారు. రైతాంగం, వ్యవసాయం పట్ల కేంద్ర వైఖరి మార్చుకోవాలన్న సీఎం.. రైతు నిరంకుశ చట్టాలను విరమించుకోవాలన్నారు. కేంద్ర తీసుకువచ్చిన కొత్త విద్యుత్ విధానాన్ని మార్చుకోవాలని అనేకసార్లు చెప్పామని.. ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం చుట్టామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ యుద్ధం ఈరోజుతో ఆగిపోదని.. ఇది ఆరంభం మాత్రమే. అంతం కాదు.. మన హక్కులు సాధించే వరకు, రైతుల ప్రయోజనాలు పరిరక్షించేంత వరకు, ఉత్తర భారతదేశంలోని రైతుల పోరాటలను కలుపుకొని భవిష్యత్‌లో ఉధృతం చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.వ్యవసాయ రంగాన్ని కేంద్రం విస్మరిస్తోందన్న కేసీఆర్.. పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేసినట్టే తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని వేడుకున్నమని, ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ రాసినా.. ఉలుకు పలుకు లేదన్నారు. తెలంగాణ రైతాంగం బాధలు ప్రపంచానికి, దేశానికి తెలియజేసేందుకే ఈ మహా ధర్నాకు శ్రీకారం చుట్టామన్నారు. తెలంగాణ గ్రామాల్లో కూడా వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తామని, కేంద్రం దిగివచ్చి మన రైతాంగానికి న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఈ ఉద్యమాన్ని ఉప్పెనలా కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగం ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, రైతుల ప్రయోజనాలను రక్షించుకోవాలని ఈ యుద్ధాన్ని ప్రారంభించామని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరంతో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. అవసరమైతే ఈ లొల్లి ఢిల్లీ దాకా వెళ్తుందన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం ఎక్కడికైనా ఎందాకైనా తగ్గేదే లే అని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రైతాంగానికి అశనిపాతంలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు దాపురించాయని మండిపడ్డారు. కేంద్రం కళ్లు తెరిపించేందుకే ఈ యుద్ధానికి శ్రీకారం చుట్టామన్నారురైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకటే మాట.. ఏం జరుగుతోంది. ఏంది గడబిడి ఇది. లొల్లి ఏంది అసలు. ఒకటే ఒక మాట. సాఫ్ సీదా ముచ్చట. తెలంగాణలో పండించే వడ్లు కొంటరా..? కొనరా..? అది చెప్పమంటే.. మేం మరాఠీలో అడిగామా? ఉర్దూలో అడిగామా? అర్థం కాని భాషలో అడిగామా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ చేపట్టిన రైతు మహాధర్నాలో కేసీఆర్ ప్రసంగించారు.బీజేపీ నాయకులు వంకర టింకర మాటలు మాట్లాడుతున్నారు. ఈ గోస ఒక తెలంగాణలోనే లేదు. భారతదేశం మొత్తంలో ఉంది. ఒక ఏడాది కాలం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో వేల లక్షల మంది రైతులు వరుస నిరాహార ధీక్షలు చేస్తున్నారు. పంటలు పండించే శక్తి లేక కాదు. కేంద్రం తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం తన విధానాలు మార్చుకోకుండా అడ్డగోలుగా మాట్లాడుతోంది. ఈ దేశాన్ని నడపడంలో అన్ని పార్టీల ప్రభుత్వాలు దారుణంగా విఫలం చెందాయి. పంటలు కొనడానికి మీకు భయం అవుతుంది. బాధ అవుతుంది. అడ్డగోలుగా మాట్లాడటం కాదు.. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ 101వ స్థానంలో ఉంది. ఇంతకన్న సిగ్గుచేటు ఏమైనా ఉంటదా? దేశంలో 12 కోట్ల మంది రైతుల ఉన్నారు. 40 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అద్భుతమైన నదులున్నాయి. బంగారు పంటలు పండే అవకాశాలు ఉన్నాయి. దాదాపు సగం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి బతుకుతున్నారు అని సీఎం కేసీఆర్ తెలిపారు.మేం రాష్ట్రం తెచ్చుకుని, చెరువులను బాగు చేసుకుని, చెక్‌డ్యాంలు కట్టి, కరెంట్ ఇచ్చి రైతులను బాగు చేసుకున్నాం. పంటలు పండించుకున్నాం. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదే. కానీ నిర్లక్ష్యం వహిస్తోంది. రైతాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. హంగర్ ఇండెక్స్‌లో భారత్ ఆకలి రాజ్యం అని తెలుస్తోంది. దేశంలో ఏ మూలలో ఆహార కొరత ఉందో సమన్వయం చేయాలి. అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టి ఆహారం అందించాలి. సమస్య ఉన్నదంతా కేంద్రం వద్దే. కేంద్రం మీద యుద్ధం ప్రారంభమైంది. ఉత్తర భారత రైతాంగం కేంద్రానికి నిరసన వ్యక్తం చేస్తోంది. రైతుల జీవితాలపై చెలగాటమాడుతోంది. కార్లతో తొక్కి చంపుతోంది. ఇవాళ తెలంగాణ రైతులపై బీజేపీ నేతలు కన్నేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద విధ్వంసం సృష్టిస్తున్నారు. రైతులను బతకనిస్తారా? బతకనివ్వారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. దిక్కు మాలిన కేంద్ర ప్రభుత్వం విధానాల వల్లే రైతులు నష్టపోతున్నారు. వడ్లు వేయాలి.. మెడలు వంచి కొనిపిస్తాం అని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ దేశాన్ని పాలించే బీజేపీ అడ్డగోలు అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్‌లలో వితండవాదాలు సృష్టిస్తున్నారు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
బీజేపీ నాటకాలు ఆడుతోంది
తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఎక్కడున్నాడని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం దిగివచ్చే దాకా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన మహాధర్నాలో ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనాలని కేంద్రాన్ని అనేక రూపాల్లో కోరామని, అన్ని ప్రక్రియలు ముగిసిన తర్వాతే పోరాటానికి దిగామని చెప్పారు. నెలరోజులుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నాయకులు నాటకాలాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడైనా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నారో చూపించాలని డిమాండ్ చేశారు.ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని చెప్పారు. అప్పులతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేకుండా చేశామన్నారు. రైతు బీమా ద్వారా 65 వేల మంది రైతులు చనిపోతే రూ.3250 కోట్లు ఇచ్చామని తెలిపారు. కరోనా సమయంలో కూడా రైతుకు నష్టంకలగొద్దని రైతు బంధు ఇచ్చామని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి అమ్మామన్నారు. రెండు పంటలు పండించే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. పంజాబ్‌కు ఒక నీతి, ఉత్తరప్రదేశ్‌కు, బీహార్‌కో నీతి, తెలంగాణకు ఓ నీతి అంటే నడవదని చెప్పారు.కల్లాల గురించి, ధాన్యం గురించి అవగాహన లేని బీజేపీ నాయకులు అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ ఎక్కడున్నాడని బండి సంజయ్ అడుగుతున్నాడు.. మరి అదే ఉద్యమంలో బండి సంజయ్ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. 14 ఏండ్లపాటు సాగిన రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ గురించి మాట్లాడనివారు లేరన్నారు. నిండిన చెరువుల్లో, పారుతున్న కాలువల్లో, పండిన కల్లాల్లో, తెలంగాణ అభివృద్ధిలో సీఎం కేసీఆర్ ఉన్నాడని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, ఉద్యమం చేసి తెలంగాణ సాధించారని చెప్పారు. ఎవరు అడ్డుపడ్డా ధాన్యం కొని తీరాల్సిందేనని, యాసంగిలే ఏం పండించాలో చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు.
స్టేజ్ కింద కూర్చున్న కేటీఆర్
ధాన్యం కొనుగోలు అంశం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. వరి కొనుగోలుపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో వరి కొనుగోలుపై కేంద్రం అవలంభిస్తున్న ద్వంద వైఖరిని నిరసిస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం గురువారం మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఇందిరా పార్క్ వద్ద కొనసాగుతున్న ఈ ధర్నాలో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చదవండి: కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం చుట్టాం: సీఎం కేసీఆర్ అయితే కేసీఆర్‌తో సహా మంత్రులంతా స్టేజి పైన కూర్చొని ఉండగా కేవలం కేటీఆర్ ఒక్కరే స్టేజి కింద కార్యకర్తలు ముందు కూర్చున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మహాధర్నాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన శరీరంపై వడ్ల కంకులను అంకరించుకొని.. భుజంపై నాగలి పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ చేపడుతున్న ఆందోళనల్లో ఇది నాలుగోది. అయితే సీఎం కేసీఆర్ స్వయంగా నిరసనలో పాల్గొనడం మాత్రం ఇదే తొలిసారి. గతంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలపవడంపై టీఆర్ఎస్ రాష్ట్ర బంద్‌ను నిర్వహించింది. అనంతరం కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన భారత్ బంద్‌లో పాల్గొంది. ధాన్యం సేకరణ సమస్యను తీవ్రంగా పరిగణిస్తూ ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టింది. తాజాగా ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్ ఈ నిరసనలో ఆయన కూడా పాల్గొన్నారు.