అనంతపురం, నవంబర్ 19,
మూడు దశాబ్ధాలుగా పెనుకొండ కోటపై ఎగురుతున్న పసుపు జెండా ఎందుకు నేలకొరిగింది..? వైసీపీ జెండా తిరుగులేని ఆధిక్యంతో ఎగరడానికి కారణాలేంటి..? 33 ఏళ్ల క్రితం కాంగ్రెస్ హస్తం నుంచి పెనుకొండని తన చేతుల్లోకి తీసుకున్న పరిటాల రవి.. తన కోటపై పసుపుజెండాను బలంగా నాటారు. అయితే ఆ జెండాను కూకటి వేళ్లతో వైసీపీ లేపటానికి కారణాలేంటి..? అది కూడా కనివినీ ఎరుగని రీతిలో వరుస పరాజయాలకు కారణాలేంటి..? లోపం ఎక్కడ ఉంది..? నాయకత్వానిదా..? లేక జనమే ఆ మార్పు కోరుకున్నారా.. పెనుకొండలో టీడీపీ పరాజయ యాత్రపై ప్రత్యేక కథనం మీకోసం..తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తుల మీదనే విజయాలు ఉంటాయి. ఉదాహరణకు పులివెందుల, కుప్పం, తాడిపత్రి, పెనుకొండ, హిందూపురం లాంటి ప్రాంతాలుగా చెప్పొచ్చు. కానీ 2019 ఎన్నికలు మాత్రం ఇలాంటి నమ్మకాలను, బలాన్ని పూర్తిగా చంపేశాయి. తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌కు తగిలిన దెబ్బ మాములుగా లేదు. అలాగే రాష్ట్రంలో టీడీపీకీ బలమైన కంచుకోట లాంటి పెనుకొండలో కూడా వైసీపీ జెండా ఎగురవేసింది. వాస్తవంగా గత మూడున్నర దశాబ్ధాలుగా చూస్తే.. పెనుకొండ టీడీపీకి కొండంత అండగా ఉండేది. దీనికి కారణం ఒన్ అండ్ ఓన్లీ పర్సన్ పరిటాల రవి. ఆయన ప్రజా ఉద్యమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత పెనుకొండ నుంచి పోటీ చేశారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న పెనుకొండలో టీడీపీ జెండా పాతారు. ఆ తరువాత రవి బ్రతికనన్నీ రోజులు ప్రత్యర్థి అభ్యర్థి నిలబడేందుకు కూడా భయపడే పరిస్థితి.రవి మరణం తరువాత ఆయన సతీమణి పరిటాల సునీత వచ్చాక ఆ కోటను అలాగే పదిలంగా నిలిపారు. అయితే నియోజకవర్గ మార్పుల్లో భాగంగా రాప్తాడు వెళ్లినా.. పెనుకొండలో పార్థసారధి వచ్చి పోటీచేసినా పరిస్థితిలో ఏ మార్పు లేదు. ఎందుకంటే రవి వేసిన పునాది అలాంటిది. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం మంత్రి శంకర్ నారాయణ టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టారు. అది కూడా రికార్డ్ స్థాయి మెజార్టీతో గెలిచారు. అక్కడి నుంచి పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ పతనం ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికల తరువాత తరువాత వచ్చిన పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా వైసీపీదే తిరుగులేని విజయమైంది. ఇవన్నీ ఒక ఎత్తైతే.. పెనుకొండలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలు మరో ఎత్తని చెప్పాలి. మేజర్ పంచాయతీగా ఉన్న పెనుకొండ 2020లో నగరపాలక పంచాయతీ గా అప్ గ్రేడ్ అయింది. అప్పట్లో వార్డుల విభజన కానందున ఎన్నిక వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా ఎన్నికలు జరగ్గా.. ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ కనివినీ ఎరుగని రీతిలో విజయం సాధించింది.పెనుకొండ పట్టణం టీడీపీకి బలమైన ప్రాంతం. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అందరి దృష్టి ఇటు వైపు మళ్లింది. రాష్ట్రంలో కుప్పం తరువాత అంత హైప్ క్రియేట్ చేసింది ఈ ఎన్నిక. టీడీపీ ఎలాగైనా ఇక్కడ గెలవాన్న ఉద్దేశ్యంతో హేమాహేమీలను రంగంలోకి దించింది. ప్రతి వార్డుకు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులను ఇన్ ఛార్జిలుగా నియమించింది. ఇందులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు ఇలా అందరూ ఇక్కడ ఇన్ ఛార్జిలుగా ఉన్నారు. పరిటాల సునీత, శ్రీరామ్, కాల్వ శ్రీనివాసులు, రఘునాథ్ రెడ్డితో పాటు కీలకమైన నేతలంతా ప్రచారం చేసినా పెనుకొండలో టీడీపీ ఓటమిని ఆపలేకపోయారు. ఇక్కడ 20వార్డులు ఉంటే ఏకంగా 18 వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. కేవలం రెండంటే రెండు వార్డుల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. ఈ ఓటమితో పెనుకొండ ప్రాంతం పూర్తిగా వైసీపీ చేతుల్లోకి వెళ్లిపోయింది.వైసీపీకి అధికారం ఉంది కాబట్టి గెలిచిందని ఎన్ని కారణాలు చెప్పినా.. తెలుగుదేశం పార్టీ దారుణ పరాభవం పై మాత్రం ఆత్మ విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం మాత్రం తప్పనిసరిగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కంచుకోటల్లాంటి ప్రాంతాల్లో స్వల్ప తేడాతో ఓటమిని కార్యకర్తలు జీర్ణించుకోగలరు కానీ.. మరి ఇంతలా పరాభవాలను మాత్రం అస్సలు ఒప్పుకోలేకపోతున్నారు. ఏదేమైనా దీనిపై పోస్టుమార్టం మాత్రం తప్పనిసరి అని విశ్లేషకులతో పాటు.. పార్టీ దిగువశ్రేణి నాయకులు అభిప్రాయపడుతున్నారు.