YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భలే మంచి చౌక బేరము

భలే మంచి చౌక బేరము

చంద్రన్న సంక్రాంతి, క్రిస్మస్‌ కానుకులను ఆయా పండుగల్లో తెల్లరేషన్‌ కార్డుదారులకు రూ.240 విలువ చేసే సరుకులను ప్రభుత్వం పూర్తి ఉచితంగా అందజేస్తోంది. అయితే, లబ్ధిదారులకు పంపిణీ చేయగా మిగిలిన సరుకులను పౌరసరఫరాల సంస్థ వేలం వేయంగా అందులో సగం ధర కూడా రాలేదు. ప్రతినెలా 86 శాతం మాత్రమే రేషన్‌ సరుకులు తీసుకుంటుండగా... 100 శాతం కార్డులకు చంద్రన్న కానుకలను అధికారులు ఇండెంట్‌ పెట్టి తెప్పించడం గమనార్హం! మిగిలిపోయిన సరుకులకు వేలంలో పలికిన ధరలు తక్కువగా ఉండడం వల్ల ఖజానాకు పాతిక లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్లు అంచనా.

చంద్రన్న సంక్రాంతి, క్రిస్మస్‌ కానుకలు పంపిణీచేసే సమయంలో ఇంచుమించు రూ.240 విలువ చేసే సరుకులు పూర్తి ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం ఘనంగా చెప్పింది. అయితే ప్రజలకు పంపిణీ చేయగా మిగిలిన సరు కులను నాలుగు నెలలు నిల్వ ఉంచిన అనంతరం పౌరసరఫరాల సంస్థ వేలం వేసింది. వివిధ సంస్థల నుంచి సమకూర్చుకొన్న సరుకులకు చెల్లించిన ధరలో కనీసం 50 శాతం ధర కూడా రాలేదు. ఇందు కు సరుకుల నాణ్యత పూర్తిగా క్షీణించిపోయి పురుగు పట్టిందని అధికారులు సమాధానం చెబుతున్నారు. కేజీ బెల్లం రూ. 10, గోధుమపిండి ప్యాకెట్‌ రూ. 11, నెయ్యి ప్యాకెట్‌ని రూ.12కి వేలంలో విక్రయించేశారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు పెద్దమొత్తంలోనే నష్టం వాటిల్లినట్లు స్పష్టమైంది. రేపటి రోజున కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఈ లెక్కలు బయటకుతీస్తే భారీమొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు నివేదికలు బహిర్గతం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

గత ఏడాది క్రిస్మస్‌, ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంలో చంద్రన్న క్రిస్మస్‌, సంక్రాంతి కానుకలను జిల్లాలోని తెల్లకార్డు కలిగిన కుటుంబాలన్నింటికీ ప్రభుత్వం పంపించింది. వాస్తవానికి జిల్లాలో 14 లక్షల 51వేల 843 తెల్లకార్డు కలిగిన కుటుంబాలు ఉండగా వీరిలో ప్రతీ నెల సగటున 86 శాతం మంది మాత్రమే రేషన్‌ సరుకులు తీసుకెళుతున్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా 100 శాతం కార్డులకు చంద్రన్న కానుకలను అధికారులు ఇం డెంట్‌ పెట్టి తెప్పించారు. సరుకుల నాణ్యతని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్‌ శశిధర్‌, అప్పటి జేసీ కృతిక శుక్ల పరిశీలించారు. స్వయంగా ఎంఎల్‌ఎస్‌ పాయింట్లను సందర్శించి సరుకుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత సరుకుల పంపిణీని ప్రారంభించారు. ప్రతీనెలా రేషన్‌ పంపిణీలానే చంద్రన్న సంక్రాంతి కానుకలు కూడా పంపిణీ జరిగాయి. దాంతో జిల్లాకు వచ్చిన బెల్లం, గోధుమపిండి 10 టన్నుల వంతున మిగిలిపోయాయి. నెయ్యి ప్యాకెట్లు కూడా 2 లక్షలకు పైగా మిగిలాయి.

ఇలా మిగిలిన సరుకులను గతంలో సంక్షేమ హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేశారు. ఈ దఫా సరుకులు భారీగా మిగలడంతో ఏమిచేయాలో దిక్కుతోచక అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. ఒకదశలో ఆయా సరుకులను సగం ధరకే రేషన్‌ డీలర్లకు పంపిణీ చేసి ప్రజలకు విక్రయించాలని ఆలోచన కూడా చేశారు. అయితే ప్రభుత్వ ఆస్తికి టెండరు నిర్వహించకుండా విక్రయించడానికి వీల్లేదని ఉన్నతాధికారులు చెప్పడంతో మిగిలిపోయిన సరుకులకు వేలం నోటీసు ఇచ్చారు. ప్రభుత్వం బెల్లంని కేజీ రూ.45కి పైగా ధర పెట్టి కొనుగోలు చేసింది. అలానే గోధుమపిండిని కేజీ రూ.30 వరకు వెచ్చింది. నెయ్యి 100ఎంఎల్‌ ప్యాకెట్‌ కోసం కూడా రూ. 40 ధర పెట్టింది. అయితే వేలంలో వీటికి వచ్చిన ధరలు చూస్తే ఎవ్వరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. బెల్లం కేజీకి రూ.10, గోధుమపిండి కేజీకి రూ. 11. నెయ్యి 100 ఎంఎల్‌ ప్యాకెట్‌కి రూ. 12 ధర మాత్రమే వచ్చింది. అధికారులు ఇక మరో ఆలోచన చేయకుండా వాటిని వేలంలో పాల్గొన్న గుత్తేదారులకు విక్రయించేశారు.

బెల్లం నాలుగు నెలలకు పైగా నిల్వ ఉన్నందున జిగటగా మారిపోయిందని, గోధుమ పిండికి బాగా పురుగు పట్టిందని, నెయ్యి కూడా పాడై పోయిందంటున్నారు. ఇతర జిల్లాల్లో ఆయా సరుకులు మరీ తక్కువ ధరకు విక్రయించారని, గుం టూరులోనే కేజీకి రూ.రెండు, మూడు అదనంగా వచ్చిందం టున్నారు. ఏది ఏమైనా మిగిలిపోయిన సరుకుల వేలం రూపంలో ప్రభుత్వ ఖజానాకు ఇంచుమించు రూ. 25లక్షలకు పైగా నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత రెండేళ్లలో మిగిలిపోయిన సరుకులు చాలా తక్కువ. అలాంటిది ఈ సంవత్సరం ఇంత పెద్ద మోతాదులో సరుకులు పంపిణీ కాకుండా ఉండటానికి కారణం పంపిణీ శాతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సరుకులు తెప్పించడమే.

Related Posts