ముంబై, నవంబర్ 19,
క్రిస్మస్ క్రిస్టియన్లకే కాదు దేశంలోని చిన్న, మధ్యతరహా ఎగుమతిదారులకు అతిపెద్ద పండగ. ఎందుకంటే ఆ టైమ్‌లో ప్రపంచంలోని చాలా దేశాల నుంచి ఈ కంపెనీలకు భారీగా ఆర్డర్స్ వస్తాయి. కరోనా సంక్షోభంతో నష్టపోయిన కంపెనీలు ఈ క్రిస్మస్ టైమ్‌లో రికవరీ అయ్యేందుకు ప్లాన్స్ వేసుకుంటున్నాయి. ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నప్పటికీ, ఈ ఆర్డర్లను ఫుల్‌ఫిల్ చేయడంలో ఎక్స్‌పోర్టర్లకు ఇబ్బందులు కలుగుతున్నాయి. కంటైనర్లు కొరతతో పాటు, ఆర్డర్లను ఫుల్‌ఫిల్ చేయడానికి అనుకున్న దానికంటే ఎక్కువ టైమ్ పడుతోందని ఎక్స్‌పోర్టర్లు చెబుతున్నారు. క్రిస్మస్ టైమ్‌లో స్పోర్ట్స్ వేర్, కాస్మోటిక్స్, సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్స్, క్లాత్స్ వంటి ప్రొడక్ట్‌ల కోసం ఎగుమతిదారులకు ఎక్కువగా ఆర్డర్స్ వస్తుంటాయి. వీటిని సరియైన టైమ్‌లో కంపెనీలు ఎగుమతి చేయలేకపోతున్నాయి. కనీసం 20 రోజుల ఆలస్యంగా డెస్టినేషన్లకు షిప్‌మెంట్లు చేరుకుంటున్నాయని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. దీంతో ఆర్డర్లు క్యాన్సిల్ అవ్వడం లేదా వాల్యూమ్స్ తగ్గిపోవడం జరుగుతోందని పేర్కొన్నాయి. షిప్‌లు, కంటైనర్ల కొరత ఏర్పడడానికి అనేక కారణాలున్నాయి. కరోనా సంక్షోభం ఏర్పడినప్పుడు మాస్కులు, కరోనా రిలేటెడ్ ప్రొడక్ట్‌లను వివిధ దేశాలకు, ఈ ప్రొడక్ట్‌లను తయారు చేసిన దేశాలు ట్రాన్స్‌పోర్ట్ చేశాయి. ఈ కంటైనర్లు ఇంకా వెనక్కి రాలేదని ఎక్స్‌పోర్టర్లు చెబుతున్నారు. కరోనా టైమ్‌లో వివిధ దేశాల్లో ఎకనామిక్ యాక్టివిటీ ఆగిపోవడం చూశాం. రా మెటీరియల్స్ ప్రొడక్షన్, ఫినిష్ట్ గూడ్స్ (తయారైన ప్రొడక్ట్‌లు) తయారీ కూడా ఆగిపోయింది. దేశాల ఆర్థిక వ్యవస్థలు తిరిగి ఓపెన్ అయ్యాక ఒక్కసారిగా పెంటప్ డిమాండ్ క్రియేట్ అయ్యింది. కరోనా నష్టాలను తగ్గించుకునేందుకు కంపెనీలు తమ ఎక్స్‌పోర్ట్‌లను పెంచాయి. దీంతో షిప్పింగ్ లైన్స్ (దారులు) బిజీగా మారిపోయాయి. ఇంకా చాలా దేశాల్లో ప్రజల కదలికలపై రిస్ట్రిక్షన్లు కొనసాగుతుండడంతో పోర్టుల దగ్గర మ్యాన్ పవర్ తగ్గింది. షిప్‌లలో గూడ్స్‌ను నింపేవారు, దించేవారు తగ్గారని ఎక్స్‌పోర్టర్లు చెబుతున్నారు. ఫలితంగా పోర్టుల దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతోందని తెలిపారు. కొత్తగా చేరుతున్న షిప్‌లు అన్‌లోడింగ్ కోసం ఎక్కువ టైమ్ వెయిట్ చేయాల్సి వస్తోందని అన్నారు. ముందుగానే కాంట్రాక్ట్‌లు కుదుర్చుకున్న ఎక్స్‌పోర్టర్లు పెరుగుతున్న రవాణా ఛార్జీల భారాన్ని కూడా భరించాల్సి వస్తోంది. ప్రస్తుతం రవాణా ఛార్జీలు 400% పెరిగాయని, కంటైనర్ల ఫీజులు నాలుగు రెట్లు ఎగిశాయని ఎక్స్‌పోర్టర్లన్నారు.క్రిస్మస్ టైమ్ (నవంబర్-జనవరి) లో ఒక్క యూఎస్‌లోనే 1.28-1.3 లక్షల కోట్ల డాలర్ల సేల్స్ జరుగుతాయని అంచనా. యూకేలో అయితే ప్రజల కొనుగోళ్లు సగటున 29 శాతం ఎక్కువగా ఉంటాయని గెర్సన్ లెహ్రమన్ గ్రూప్ ఓ సర్వేలో పేర్కొంది. దేశంలోని ఎక్స్‌పోర్టర్లకు క్రిస్మస్ బాగా కలిసొచ్చే టైమ్ అయినప్పటికీ, సప్లయ్ చెయిన్‌లో అంతరాయం వలన ఈ సారి నష్టపోవాల్సి వస్తోంది. ప్రస్తుతం కేవలం మూడో వంతు కంటైనర్లు మాత్రమే సరియైన టైమ్‌కు డెస్టినేషన్లను చేరుకుంటున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. కంటైనర్‌ను బుక్ చేయడానికి, గూడ్స్‌తో నింపడానికి, షిప్‌లో డెస్టినేషన్లకు పంపడానికి, ఈ షిప్‌మెంట్లు రీచ్ అవ్వడానికి 70 రోజుల టైమ్ పడుతోందని లాయిడ్స్ లిస్ట్ ఎడిటర్ ఎరిక్ వాట్కిన్స్ పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాసెస్‌కు 40 రోజులు మాత్రమే పట్టేదని గుర్తు చేశారు.