న్యూఢిల్లీ
కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ.. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ శీతాకాలంలోనే జరిగే లోక్సభ సమావేశాల్లో వాటికి సంబంధించిన బిల్లు పెడతామన్నారు. రైతులను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని అయన కోరారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలను రైతులు ఆమోదించలేదు. వారి నుంచి వ్యతిరేకత వచ్చింది. అందుకే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నామని అయన అన్నారు. ప్రధాని మోడీ ప్రకటనతో దేశ వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు వ్యతిరేకించారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తో పాటు ఉత్తర భారతంలో పలు రాష్ట్రాల్లో ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించారు. ఢిల్లీ శివార్లలో పంజాబ్ రైతులు ఏడాదికి పైగా నిరవధికంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం గురునానక్ జయంతి సందర్భంగా మోదీ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్,పంజాబ్ తోపాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయ చట్టాలపై ప్రధాని మోదీ ప్రకటన చేయడం విశేషం.