హైదరాబాద్ నవంబర్ 19
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించటాన్ని కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం అని సి.ఎల్.పి. నేత మల్లు భట్టి విక్రమార్క అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెబుతూనే వస్తోంది. సదరు వ్యవసాయ చట్టంలో రైతు ప్రయోజనాలకు విఘాతం కలిగించే అంశాలు ఉన్నాయని. ఈ చట్టాల రూపకల్పన, అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది అని అన్నారు. ఈ విషయమై ఏఐసిసి నాయకుడు రాహుల్ గాంధి దేశ రైతాంగాన్ని అప్రమత్తం చేయడమే కాకుండా వారు చేపట్టిన ఆందోళన కు మద్దతు పలికారు. రైతాంగం చేపట్టిన పలు ఆందోళన కార్యక్రమాలకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా వారికి అండగా నిలిచారన్నారు. దరిమిలా ఇప్పటికైనా కేంద్రంలోని బి.జె.పి. ప్రభుత్వం సదరు వ్యవసాయ చట్టాల విషయంలో వెనక్కి తగ్గడాన్ని రైతాంగ, మరియు కాంగ్రెస్ పార్టీ విజయమని పేర్కొనక తప్పదన్నారు.ఈ సందర్భంలో ప్రజావ్యతిరేకమైన, రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసే పరిపాలన విధానాల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజీపడని ధోరణిలోనే వ్యవహరిస్తూ ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేసారు.