అమరావతి నవంబర్ 19, సీఎం అయిన తర్వాతే సభలో అడుగు పెడతా
*అసెంబ్లీలో వైసీపీ నేతలు తన భార్యపట్ల అనుచిత వ్యాఖ్యలు
* ఆమె త్యాగాలు, నా పోరాటాలు ప్రజల కోసమే చేశారు తప్పా..
* అలాంటి వ్యక్తిపై బండబూతులు, ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు
* మీడియా సమావేశం లో బోరున విలపించిన చంద్రబాబు
* అందుకు నిరసనగా ఇక సభలో అడుగుపెట్టను
* ప్రకటించి శాసనసభ నుంచి వాకౌట్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బోరున విలపించారు. తను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని కన్నీరు పెట్టారు. కనీస గౌరవం లేకుండా సభలో మాట్లాడారని బాబు అవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అధికార వైసీపీ నేతలు తన భార్యపట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకు నిరసనగా ఇక సభలో అడుగుపెట్టనని ప్రకటించి శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. సీఎం అయిన తర్వాతే సభలో అడుగు పెడతానని చెప్పారు. సభనుంచి బయటకు వచ్చిన అనంతరం చంద్రబాబు పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దాదాపు రెండు నిమిషాల పాటు వెక్కివెక్కి ఏడ్చారు. విలేకరుల సమావేశంలో విలపిస్తూ గద్గద స్వరంతో మాట్లాడారు. తన రాజకీయ జీవితంలో తాను అనేక ఆటుపోట్లు చూసినప్పటికీ గడిచిన రెండేండ్లలో ఏపీలో రాక్షసపాలన కంటే మించి అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత దూషణలతో సభలో తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె నలుగురికి సహాయం చేయడమే తప్పా.. ఎవరిని ఏమి అనలేదు.. తనను రాజకీయంగా ప్రోత్సహించింది. ఆమె త్యాగాలు, నా పోరాటాలు ప్రజల కోసమే చేశారు తప్పా.. ఇతరులను ఇబ్బందులు పెట్టలేదు.అలాంటి వ్యక్తిపై బండబూతులు, ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు అని కంట తడి పెట్టారు. 2018లో జరిగిన ఎన్నికల్లో 151మంది వైఎస్సార్‌సీపీ, 23 మంది టీడీపీ సభ్యులు గెలుపొందారు. అప్పుడు కూడా తాను బాధపడలేదు. ప్రజల కోసం ప్రతిపక్షంలో కూర్చోవడానికి నిర్ణయించాను. కాని రెండున్నర సంవత్సరాలుగా తనతో పాటు తమ నాయకులను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అవమానించారు. తాను ఉమ్మడి రాష్ట్రంలో, ఏపీకి సీఎంగా పనిచేసిన సమయంలో ఏనాడు కూడా ప్రతిపక్షాలను అగౌరవ పరచలేదు అని చంద్రబాబు పేర్కొన్నారు.