YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చట్టం రద్దు తర్వాతే ఇంటికి

చట్టం రద్దు తర్వాతే ఇంటికి

న్యూఢిల్లీ నవంబర్ 19
నూత‌న వ్య‌వసాయ చ‌ట్టాల ర‌ద్దుపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసినా త‌మ‌కు ఆయ‌న‌పై విశ్వాసం లేద‌ని బీకేయూ జాతీయ ప్ర‌తినిధి, రైతు నేత రాకేష్ తికాయ‌త్ తేల్చిచెప్పారు. పాల్ఘ‌ర్‌లో ఓ వార్తా చానెల్‌తో మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. మూడు సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కితీసుకుంటున్నామ‌ని ప్ర‌ధాని ప్ర‌క‌టించినప్ప‌టికీ త‌మ ఆందోళ‌న కొన‌సాగుతుంద‌ని వెల్ల‌డించారు.ప్ర‌ధానిపై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని, ప్ర‌స్తుతం తాము ప్ర‌భుత్వంతో త‌దుప‌రి చ‌ర్చ‌ల‌కు వేచిచూస్తున్నామ‌ని తికాయ‌త్ పేర్కొన్నారు. కాగా సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్నామ‌ని, రైతుల‌కు ఇబ్బంది క‌లిగించినందుకు క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు నిర్ణ‌యాన్ని స్వాగ‌తించిన విప‌క్షాలు యూపీ స‌హా ప‌లు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల కోస‌మే ప్ర‌ధాని ఈ నిర్ణ‌యం తీసుకున్నాయ‌ని విమ‌ర్శించాయి.

చట్టం రద్దు తర్వాతే ఇంటికి

మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయంపై ప్రతిపక్షాలతో పాటు రైతులు హర్షం వ్యక్తం చేశారు. కానీ, ఇప్పటికిప్పుడే ఆందోళనలను విరమించబోమని రైతులు స్పష్టం చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేస్తామని, సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతులు తిరిగి ఇళ్లకు వెళ్లాలని ప్రధాని మోదీ కోరారు. అయితే, రైతులు మాత్రం దీనిపై చట్టం చేశాకే తిరిగి ఇళ్లకు వెళతామని పేర్కొన్నారు.
పార్లమెంటులో చట్టాలను రద్దు చేసే ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మాత్రమే తాము నిరసన స్థలం నుంచి బయలుదేరుతామని రైతులు ముక్తకంఠంతో నినదించారు. ‘‘సాగు చట్టాలపై ప్రధాని ప్రకటనను సంయుక్తం కిసాన్ మోర్చా స్వాగతిస్తోంది... పార్లమెంట్‌లో ప్రక్రియ ప్రారంభం వరకూ వేచిచూస్తాం’ అని ఎస్కేఎం ఓ ప్రకటనలో తెలిపింది.‘చట్టాల రద్దు జరిగితే భారతదేశంలో ఒక ఏడాది పాటు సాగిన రైతుల పోరాటానికి ఇది చారిత్రాత్మక విజయం అవుతుంది.. అయితే ఈ పోరాటంలో దాదాపు 700 మంది రైతులు అమరులయ్యారు.. లఖింపూర్ ఖేరీలో జరిగిన హత్యలతో సహా ఈ నివారించదగిన మరణాలకు కేంద్ర ప్రభుత్వ మొండివైఖరి కారణం.. తమ ఆందోళన కేవలం సాగు చట్టాలకే పరిమితం కాదు.. రైతులు పండించిన అన్ని ఉత్పత్తులకు తగిన మద్దతు ధర కల్పించాలి.. అలాగే, విద్యుత్ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలి.. త్వరలోనే దీనిపై ఎస్కేఎం సమావేశమై భవిష్యత్తు నిర్ణయాన్ని ప్రకటిస్తుంది’ అని పేర్కొంది.భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ స్పందిస్తూ.. ‘రైతులు ఆందోళనలు విరమించరని, నిరసనలు కొనసాగిస్తారు.. పార్లమెంట్‌లో చట్టం రద్దయిన రోజు వరకూ కొనసాగుతుంది.. మద్దతు ధర సహా రైతులకు చెందిన ఇతర అంశాలపై ప్రభుత్వం మాట్లాడాలి’అని స్పష్టం చేశారు.సాగు చట్టాల విషయంలో మోదీ ప్రకటనపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ప్రజాస్వామ్య నిరసనలతో సాధించలేనిది రాబోయే ఎన్నికల భయంతో సాధించవచ్చు!. మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణపై ప్రధానమంత్రి చేసిన ప్రకటన విధాన మార్పు లేదా హృదయంలో మార్పు ద్వారా ప్రేరణ పొందలేదు.. ఇది ఎన్నికల భయంతో పురికొల్పింది!’ అని ట్వీట్ చేశారు.సాగు చట్టాల విషయంలో సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన కమిటీలోని సభ్యుడు అనిల్ ఘన్‌వత్ మాట్లాడుతూ.. మూడు సాగు చట్టాలను రద్దుచేయాలనే నిర్ణయం తిరోగమన చర్యగా అభివర్ణించారు. ‘ప్రధాని మోదీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు... రైతుల అభ్యున్నతికి రాజకీయాలు పక్కనబెట్టి ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం అత్యంత తిరోగమన చర్య’ అన్నారు.కేంద్రం గత ఏడాది సెప్టెంబరులో తీసుకువచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఏడాది కాలంగా ఆందోళనలు చేశారు. దీంతో దిగివచ్చిన కేంద్రం మూడు వివాదాస్పద చట్టాలను ఎట్టకేలకు రద్దు చేయనుంది.

Related Posts