హైదరాబాద్, నవంబర్ 19,
నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఏడాది నుంచి రైతులు చేసిన పోరాటానికి కేంద్రం దిగొచ్చింది. శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయాన్ని తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ స్వాగతించింది. అయితే తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకుంటూ వ్యాఖ్యలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.గురువారం టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన మహాధర్నాతోనే కేంద్రం రైతు చట్టాలను రద్దు చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అదే స్పూర్తితో తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటాలు చేసిన రైతులకు అభినందనలు తెలిపారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నామన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను అమలు చేయాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి చేసినా కేసీఆర్ తలొగ్గలేదన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ధర్నాలు చేసిందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.సీఎం కేసీఆర్ చేపట్టిన మహాధర్నా రైతులకు నాయకత్వం వహిస్తుందని భయపడే ప్రధాని మోదీ రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని మంత్రి జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. మోడీ ప్రభుత్వం చేసిన ప్రకటన రైతుల విజయమని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రైతుల ఉద్యమం కొత్తపుంతలు తొక్కుతుందన్న భయంతోనే కేంద్రం చట్టాలను రద్దు చేసిందన్నారు. చట్టాలు ఉపసంహరించినంత మాత్రాన టీఆర్‌ఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతులకు పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు కేసీఆర్ ఉద్యమం ఆపరని పేర్కొన్నారు.మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. రాత్రింబవళ్లు రోడ్లపై నిలిచి నిరసనలతో కేంద్రానికి రైతుల శక్తిని పోరాటాన్ని చూపారని అన్నారు. కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు చేసిన ప్రకటనపై హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. వ్యవసాయ చట్టాల రద్దు రైతు విజయమని, ఇది దేశ ప్రజలందరి విజయమని పేర్కొన్నారు. రైతు ఉద్యమంలో పట్టుదలతో పాల్గొన్న త్యాగశీలులందరికీ ఉద్యమ అభినందనలు తెలిపారు. ఏడాది కాలంగా బుల్లెట్లకు, లాఠీలకు, వాటర్ కానన్‌లు, పోలీసు కంచెలు, నిషేధాలను ఎదుర్కొని విజయం సాధించిన తీరు అద్భుతమని పేర్కొన్నారు.
రైతుల సత్యాగ్రహానికి దిగొచ్చారు
మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. రైతుల సత్యాగ్రహానికి కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదని వ్యాఖ్యానించారు. రైతుల ఆందోళనతో కేంద్రం తన ఈగోను పక్కనబెట్టి మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుందంటూ రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో పాల్గొన్నారు. అలాగే ఈ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి నెలకొంటుందంటూ తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో జత చేర్చారు.ఉదయం 9 గం.లకు జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ.. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఆ మేరకు ఈ చట్టాలను రద్దు చేస్తామని స్పష్టంచేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతోనే దీన్ని తీసుకొచ్చినట్లు స్పష్టంచేసిన ప్రధాని మోడీ.. అయితే రైతుల ఆందోళనల నేపథ్యంలో వాటిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. కొత్త చట్టాల విషయంలో కొందరు రైతులను ఒప్పించడంలో విఫలం చెందినట్లు చెప్పారు. కొత్త చట్టాల కారణంగా రైతులకు కలిగిన ఇబ్బందులకు తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు.