YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అప్పుల కోసం మరిన్ని అప్పులు

అప్పుల కోసం మరిన్ని అప్పులు

విజయవాడ, నవంబర్ 20,
అప్పుడెప్పుడో అప్పుల అప్పారావు లేదా అలాంటి ఇంకో పేరుతో ఒక సినిమా వచ్చింది.. సినిమా పేరు ఏదైనా ఆ సినిమా కథ మాత్రం అప్పుల చుట్టూనే తిరుగుతుంది. అందులో  ఆప్పారావు అనే క్యారెక్టర్’ ఒక అప్పు తీర్చడం కోసం ఇంకొక అప్పు... అ ఆప్పు తీర్చడం కోసం మరొక అప్పు చేస్తూ... ఇలా అప్పుల  చక్ర బంధం బాటలో ముందుకు సాగుతుంటాడు. ఇప్పుదు ఈ సినిమా ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందో వేరే చెప్పనక్కర లేదు. అవును... ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇదే పంధాలో అప్పుల చుట్టూ ప్రదక్షిణ చేస్తోందనే మాట చాలా కాలంగా అంతటా వినవస్తోంది. ఇప్పుడు కొత్తగా, కేంద్ర విద్యుత్ సంస్థలకు బకాయిలు చెల్లించేందుకు,రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఇండియా (ఎస్బీఐ) అప్పుకోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక విషయంలోకి వెళితే, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్‌ఈసీ), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎ్‌ఫసీ) లకు చాలా కాలంగా, చెల్లించ వలసిన సొమ్ములు చెల్లిచలేదు. బకాయిలు పేరుకు పోయాయి. కేంద్ర సంస్థలు ఎప్పటికప్పుడు, మర్యాద గీత దాటకుండానే  రాష్ట్ర ప్రభుత్వానికి బకాయిల సంగతి గుర్తు చేస్తూ వచ్చాయి, అయినా రాష్ట్రం ప్రభుత్వం స్పందించలేదు.ఇక చేసేది లేక, అప్పు వసులు కోసం ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీ సీఎండీలు సంజయ్‌ మల్హోత్రా, ఆర్‌ఎస్‌ థిల్లాన్‌ మంగళవారం రాత్రి రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా, ఏపీ ప్రభుత్వం నుంచి అప్పులు వసూలు కోసం కేంద్ర విద్యుత్ సంస్థల అధికారులు, రాష్ట్రానికి రావడం, అంటే ప్రభుత్వానికి మాత్రమే కాదు, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు కూడా అవమానమే, మర్యాద తెలిసిన ముఖ్య నేతలకు  అయితే మరింత అవమానం.   అదెలా ఉన్నా, కేంద్ర విద్యుత్ సంస్థ అధికారులు నిన్న (బుధవారం) విజయవాడ విధ్యత్ సౌధలో సుమారు మూడు గంటల పాటు  రాష్ట్ర  ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్‌, ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ జనార్దనరెడ్డిలతో పాటుగా సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఇంధన సంస్థలు చెల్లించాల్సిన రూ.2,600 కోట్ల బకాయిల గురించి కేంద్ర ప్రతినిధులు గుర్తు చేశారు. ఇవి చెల్లించకుంటే ఏపీ జెన్కోను నిరర్ధక సంస్థగా ప్రకటించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇందుకు రాష్ట్ర అధికారులు తాము కొత్త రుణం తీసుకుంటున్నామని.. అది మంజూరైన వెంటనే  అప్పు తీర్చేస్తామని చెప్పిన వివరణతో ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీల అధికారులు సంతృప్తి చెందలేదు.  అక్కడి నుంచి వారు  నేరుగా  సచివాలయానికి చేరుకుని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మతో అనంతరం నేరుగా ముఖ్యమంత్రి జగన్‌తో సమావేసమయ్యారు. చివరకు, కేంద్ర విద్యుత్‌ సంస్థల అధికారులు, చివరి అవకాశంగా రాష్ట్ర ప్రభుత్వానికి మరో అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ఆర్‌ఈసీకి తక్షణం చెల్లించవలసిన అప్పు రూ.2500 కోట్లలో రూ.1500 కోట్లు రెండు మూడ్రోజుల్లో చెల్లించేలా ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. మిగిలిన బాకీ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్‌ఈసీ కొంత సమయం ఇచ్చింది. ప్రస్తుతానికి అవసరమైన రూ.1500 కోట్లను ఎస్‌బీఐ నుంచి అప్పు తెచ్చేందుకు రాష్ట్రం ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు.కాగా, రూ.1,500 కోట్లు అప్పుగా ఇచ్చేందుకు ఎస్‌బీఐ అంగీకరించినట్లు చెబుతున్నారు. అలా ఎస్‌బీఐ అప్పు ఇవ్వగానే...ఇలా ఆమొత్తాన్ని ఆర్‌ఈసీకి పాత అప్పు కింద చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆర్‌ఈసీ అప్పు తీర్చేందుకు ఎస్‌బీఐ వద్ద అప్పు చేసిన ప్రభుత్వం ఎస్‌బీఐ అప్పు తీర్చేందుకు ఇంకెవరి వద్ద చేయి చాస్తుందో ... ఏమో .. మొత్తానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అప్పుల అప్పారావు, అడుగు జాడల్లో నడుస్తున్నారా .. అనే అనుమానాలు నిజమవుతున్నట్లే ఉన్నాయి.

Related Posts