విజయవాడ, నవంబర్ 20,
విజయవాడలోని డాక్టర్ ఎన్‌టిఆర్ హెల్త్ యూనివర్సిటీ మిగులు నిధులను ఎపి స్టేట్ ఫైనాన్స్ సర్వీసెస్ కార్పొరేషనల్ లిమిటెడ్‌లో (ఎపిఎస్‌ఎఫ్‌ఎస్‌సిఎల్) డిపాజిట్ చేయించేందుకు ఆసక్తి కనబరుస్తున్న ప్రభుత్వం యూనివర్సిటీకి అదనంగా బడ్జెట్‌ను కేటాయించే అంశాన్ని అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. నాలుగేళ్లలో రూ.223 కోట్లను పలు శాఖలకు బదలాయించిన ప్రభుత్వం, వాటిని తిరిగి జమ చేయలేదు. కొత్తగా నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థగా ఉన్న ఎపిఎస్‌ఎఫ్‌సిఎల్‌లో ఇన్వెస్ట్ చేయించేందుకు ఆరాటపడుతోంది. రాష్ట్ర విభజనతో ఆదాయ వనరులను కోల్పోయిన యూనివర్సిటీకి అదనపు నిధులను కేటాయిం చాల్సిందిపోయి ఉన్న నిధులను తుడిచిపెట్టేం దుకు ప్రయత్నించడం వివాదాస్పదంగా మారుతోంది. రాష్ట్రానికున్న ఏకైక హెల్త్ యూనివర్సిటీకి ప్రభుత్వం ఏటా రూ.5.03 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ను ఇస్తోంది. వాస్తవానికి అది మూడు నాలుగు నెలల్లోనే ఖర్చయిపోతోంది. దీంతో బడ్జెట్‌లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోసం బడ్జెట్‌లో రూ.25 కోట్లను కేటాయించాలన్న వర్సిటీ అధికారులు ఏటా ప్రతిపాదనలు పంపిస్తున్నా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. ఎన్‌టిఆర్ హెల్త్ వర్సిటీకి ప్రస్తుతం రూ.448.02 కోట్ల ఎఫ్‌డిలుం డగా, అందులోంచి రూ.250 కోట్లను ఎపిఎస్‌ఎఫ్‌ఎస్‌సిఎల్‌లో డిపాజిట్ చేయాలని వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ ఈ ఏడాది జులైలో మెమో జారీ చేశారు. మిగులు నిధులను ఎఫ్‌డిలు వేసేందుకు ఆరు బ్యాంకు లను గుర్తిం చగా, తాజాగా ఎపిఎస్‌ఎఫ్‌ఎస్‌సిఎల్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఇసి తీర్మానించింది.టిడిపి హయాంలో 2017 నుంచే యూనివర్సిటీ నిధులను పలు అవసరాల కోసం ప్రభుత్వం అనేక శాఖలకు బదలాయించడం ప్రారంభించింది. 2017 నుంచి 2019 ఫిబ్రవరి వరకు రూ.197.38 కోట్లను జిఓలిచ్చి బదలాయించగా, వైసిపి అధికారంలోకి వచ్చాక రూ.25.34 కోట్లను బదలాయించారు. ప్రభుత్వ టీచింగ్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.167.70 కోట్లు, విజయవాడ, విశాఖలో మెడికల్ విద్యార్థులకు అవసరమైన బస్సుల కొనుగోలుకు రూ.68.39 లక్షలు, ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం రూ.13 కోట్లను గుంటూరు జిజిహెచ్‌లో కేన్సర్ రోగుల చికిత్సకు అవసరమైన ఎక్విప్‌మెంట్ కొనుగోలుకు రూ.16 కోట్లను (రుణంగా) గత ప్రభుత్వం ఎపిఎంఐఎస్‌డిసి, ఆర్‌టిసి, డిఎంఇకి బదలాయించింది. కోవిడ్ నియంత్రణ చర్యలకు రూ.20 కోట్లను (రీయింబర్స్‌మెంట్ చేసేలా), ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల నిర్మాణం కోసం రూ.5.34 కోట్లను ప్రస్తుత ప్రభుత్వం బదలాయించింది. వీటికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్కపైసా కూడా వర్సిటీకి తిరిగి రాలేదు.రాష్ట్ర విభజన తర్వాత హెల్త్ యూనివర్సిటీ అనుబంధ కాలేజీలు తగ్గడంతో వచ్చే ఆదాయమూ తగ్గిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఫీజుల రూపంలో రూ.72.68 కోట్ల ఆదాయం లభించగా, రూ.68.28 కోట్లను జీతభత్యాలు, నిర్వహణకు ఖర్చు చేశారు. ప్రభుత్వం ఇస్తున్న రూ.5.03 కోట్లతోపాటు ఎఫ్‌డిలపై వచ్చే వడ్డీలపైనే వర్సిటీ ఆధారపడుతోంది. ప్రస్తుతం ఇచ్చే గ్రాంట్ సరిపోదని, కనీసం రూ.25 కోట్లను బడ్జెట్‌లో కేటాయించాలని 2017 నుంచి ప్రభుత్వానికి యూనివర్సిటీ ప్రతిపాదనలు వెళ్తూనే ఉన్నా... బడ్జెట్‌లో మాత్రం అదనపు కేటాయింపులు కనిపించడం లేదు.