హైదరాబాద్, నవంబర్ 20,
అన్న కేటీఆర్‌కు రాఖీ కట్టలేదు. ప్రగతి భవన్‌లో బతుకమ్మ ఆడలేదు. టీఆర్ఎస్ ప్లీనరీకి కూడా రాలేదు. కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు బాగా ముదిరిపోయాయన్నారు. కేటీఆర్‌ను సీఎం చేయడం కవితకు ఇష్టం లేదని ప్రచారం జరిగింది. ఆస్థి గొడవలు కూడా ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో కవిత ఎమ్మెల్సీ టర్మ్ కూడా ముగిసింది. ఆమెకు మరోసారి ఆ రెన్యూవల్ దక్కదనే ప్రచారం జరిగింది. ఇక కవిత పని ఖతం అన్నారంతా..అయితే, అనూహ్యంగా కవితను రాజ్యసభకు పంపిస్తారంటూ లీకులు వచ్చాయి. బిడ్డను ఎంపీ చేసి, పార్లమెంట్‌కు పంపించి, కుదిరితే కేంద్ర మంత్రిని కూడా చేస్తానని కేసీఆర్ తన కూతురిని బుజ్జగించారని అంటున్నారు. ఇలా కవితమ్మ అలకను కేసీఆర్ తీర్చారని చెబుతున్నారు. నిజమే కాబోలు.. అందుకే కాబోలు.. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనిది.. ధర్నాచౌక్‌లో ప్రభుత్వం తరఫున నిర్వహించిన మహాధర్నాలో కవిత హాజరయ్యారు. టీఆర్ఎస్ మహిళా నేతలతో కలిసి ధర్నాలో కూర్చున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ధర్నాలో కవిత కనిపించడంతో.. మీడియా కెమెరాలన్నీ అటువైపు ఫోకస్ చేశాయి. కవితను జూమ్ చేసి మరీ చూపించాయి. ఫోటోలు క్లిక్ మనిపించాయి. మహాధర్నాలో కవితనే ఇంట్రెస్టింగ్ పాయింట్ అయ్యారు. మరోవైపు, కేటీఆర్ మాత్రం వేదికపై కాకుండా.. కింద పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నాలో కూర్చున్నారు. కేసీఆర్ దగ్గరకు కవితకు ఎంట్రీ లేకున్నా.. కేటీఆర్‌ను కలవకున్నా.. కల్వకుంట్ల కుటుంబంలో ఫ్యామిలీ వార్ ముగిసిపోయిందని అంటున్నారు. కవిత రాకనే అందుకు నిదర్శనమని చూపిస్తున్నారు. మరి, కేసీఆర్‌తో, కేటీఆర్‌తో మాట్లాడలేదుగా? అంటే.. ధర్నా కదా.. అందుకే మాట్లాడలేదని చెబుతున్నారు. కవితకు రాజ్యసభ సీటు ఇస్తానని కేసీఆర్ బుజ్జగించారని.. ఆమె అలక వీడారని.. అందుకే మళ్లీ యాక్టివ్ అయ్యారని.. అంటున్నారు. అలకైతే వీడారు కావొచ్చు కానీ, కుటుంబ కలహాలు మాత్రం సమసిపోలేదని.. ఇది కేవలం టెంపరరీ అడ్జస్ట్‌మెంట్ మాత్రమేననేది కొందరి మాట. అసలు సంగతి మాత్రం ఆ ముగ్గురికే తెలియాలి.