విజయవాడ, నవంబర్ 20,
ఏపీలో గత రెండు రోజులు వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండటంతో ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తినష్టం కూడా సంభవించింది. ఈ భారీ వర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఆర్థిక సాయం ప్రకటించగా, జరిగిన నష్టం పై ఏరియల్ సర్వే నిర్వహించారు. అలాగే పునరావాస కేంద్రాలకు తరలించిన కుటుంబాలకు రెండు వేల రూపాయల చొప్పున సాయం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితులపై ఆయా జిల్లా కలెక్టర్లతో వీడియో కార్ఫరెన్స్ నిర్వహించిన సీఎం జగన్.. ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితులను తెలుసుకున్నారు.కాగా, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎడతెరిపిలేని వానలతో ఎక్కడికక్కడ నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నెల్లూరు, కడప, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు గ్రామాలూ జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వరద బాధిత ప్రాంతాల్లోని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. పశువులు, కోళ్లు వరదతాకిడికి కొట్టుకుని పోయాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. జాతీయరహదారులపై వరద నీరు ప్రవహించింది. మూడు జిల్లాల్లో భారీ వర్షాలు, వరద పరిపరిస్థితులకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వెంటనే చర్యలు తీసుకునేందుకుగాను ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది