హైదరాబాద్, నవంబర్ 20
బీజేపీ, ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ మధ్య గ్యాప్ మరింత పెరుగుతోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. గత కొన్ని మాసాలుగానే పలు కీలక అంశాలపై సొంత పార్టీ(బీజేపీ)ని ఇబ్బందిపెడుతూ వరుణ్ గాంధీ బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వరుణ్ గాంధీ.. బీజేపీని మరింత ఇబ్బందిపెడుతూ.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలో వరుణ్ గాంధీ నాలుగు కీలక డిమాండ్లు చేశారు. సాగు చట్టాలను ప్రధాని మోడీ ముందుగానే ఉపసంహరించుకుని ఉంటే 700 మంది రైతులు ఇప్పుడు ప్రాణాలతో ఉండేవారని వరుణ్ గాంధీ పేర్కొన్నారు. ఏడాదిపాటు సాగిన రైతుల ఆందోళనలో ప్రాణాలు విడిచిన అన్నదాతల కుటుంబీలకు తలా రూ.1 కోటి పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు.ఆందోళన చేస్తున్న రైతులపై రాజకీయ ప్రేరేపిత ఫేక్ కేసులు నమోదు చేశారని వరుణ్ గాంధీ ఆరోపించారు. ఈ కేసులన్నిటినీ తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రైతుల పంటలకు కన్నీస మద్ధతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే లఖింపూర్ ఖేరి ఘటనను కూడా వరుణ్ గాంధీ తన లేఖలో మరోసారి లేవనెత్తారు. అక్టోబర్ 3న జరిగిన ఈ ఘటనలో ఐదుగురు రైతులను కార్లు ఎక్కించి హతమార్చారని.. మన ప్రజాస్వామ్యంలో ఇదే హృదయవిదారక ఘటనగా పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రిపై చర్యలు తీసుకుని, ఈ కేసు దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరిగేలా చూడాలని వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు.బీజేపీకి దూరమవుతున్న వరుణ్ గాంధీ.. క్రమంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోవచ్చని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది