హైదరాబాద్, నవంబర్ 20
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు కన్నీటిపర్యం కావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు శుక్రవారం ప్రెస్మీట్‌లో వెక్కి వెక్కి ఏడవడం హాట్ టాపిక్‌గా మారిపోయింది. చంద్రబాబు ఏడుపుకు కారణమైన వైసీపీ నాయకుల తీరును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. అలాగే రాజకీయ పార్టీలకు అతీతంగా చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తున్నారు.ఈ క్రమంలోనే చంద్రబాబుకు జరిగిన అవమానంపై జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్‌లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ఇది రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే దుర్ధినమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తలచుకుని బాధపడాలో లేక భయపడాలో తెలియని సందిగ్ధ దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌ను, తన కుటుంబాన్ని ఇలాగే అనుచితంగా విమర్శించినప్పుడు ఎంతో క్షోభకు గురైన.. ఆ బాధను అనుభవించిన వ్యక్తిగా చెప్తున్నానని నాగబాబు తెలిపారు. తోటివారి పట్ల కనీస గౌరవాన్ని పాటించి ఇకనైనా మనుషులుగా మారుతారని ఆశిస్తున్నానని నాగబాబు పేర్కొన్నారు