విజయవాడ, నవంబర్ 22,
నందమూరి కుటుంబంలో బాలకృష్ణ తర్వాత ఫైర్‌బ్రాండ్ ఎవరంటే జూనియర్ ఎన్టీఆరే. బాలయ్య తర్వాత ఆ ఫ్యామిలీలో అంతటి క్రేజ్ ఉన్నోడు. బుడ్డోడు.. స్వతహాగా ఆవేశపరుడు. ఫుల్ ఎమోషనల్. మాటంటే పడరు. మాటకు మాట గట్టిగా జవాబిచ్చే సత్తా ఆయన సొంతం. అలాంటి ఎన్టీఆర్.. తన నందమూరి కుటుంబ సభ్యురాలిని, స్వయానా మేనత్తను.. వైసీపీ మూకలు అంతేసి మాటలు అంటే.. చాలా సాదాసీదాగా స్పందించాడు. అది కూడా చాలా ఆలస్యంగా బయటికి వచ్చి. నందమూరి ఫ్యామిలీ అంతా మూకుమ్మడిగా ముందుకొచ్చి మీడియా సమావేశం పెట్టిన తర్వాత.. విమర్శలు వస్తాయని అనుకున్నాడో ఏమో ట్విట్టర్ వేదికగా ఓ వీడియో రీలిజ్ చేశాడు. ఏవో కొన్ని పదాలు చెప్పేశాడు. మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పాడు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి, వ్యక్తిగత దూషణలకు, అదీ ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడటం ఒక అరాచక పాలనకు నాంది అన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై ఎన్టీఆర్ ఇచ్చిన రియాక్షన్ పై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. జరిగిన పరిణామాలను ఖండించాడు తప్ప, సంఘటనకు కారణం అయిన వాళ్ళను విమర్శించలేదు ఎన్టీఆర్. జూనియర్ నోట ఎక్కడా నందమూరి మాట రాలేదు. వైసీపీ అన్న పదం కూడా లేదు. చంద్రబాబు కుటుంబంపై నీచంగా మాట్లాడిన ఎమ్మెల్యేల గురించి చెప్పలేదు. పైగా ఒక కుటుంబం అని మాట్లాడారు ఎన్టీఆర్. దీంతో ఆ కుటుంబం ఈయనది కాదా అన్న ప్రశ్న వస్తోంది. జూనియర్ వీడియో చూసిన వాళ్లంతా.. అసెంబ్లీలో జరిగిన సంఘటను జనరలైజ్ చేశాడు తప్ప.. తన కుటుంబ సభ్యురాలు మీద జరిగింది అరాచకంగా జూనియర్ ఫీల్ అవలేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా RRR సినిమా వారి వత్తిడి మీదే ఇచ్చారనే చర్చ సాగుతోంది. ఎన్టీఆర్ మాటలు వైసీపీని సమర్ధిస్తున్నట్లుగా ఉన్నాయనే ఆరోపణలు కూడా కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. జూనియర్ స్పందనపై టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. భువనేశ్వరిపై పిచ్చి వాగుడు వాగుతున్న కొడాలి నాని, వల్లభనేని వంశీలు తన మిత్రులు కాబట్టే జూనియర్ ఎన్టీఆర్ అలా స్సందించారా అన్న ఆరోపణలు వస్తున్నాయి. మేనత్తను అంతేసి మాటలు అంటే.. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే.. సీరియస్ గా స్పందించకుండా ఇలా సింపుల్ గా మాట్లాడటం ఏంటని కొందరు జూనియర్ అభిమానులు కూడా నిలదీస్తున్నారు. మిగితా కుటుంబ సభ్యులు ఆవేశంగా ఊగిపోతుంటే.. జూనియర్ మాత్రం సింపుల్ రియాక్షన్ ఇవ్వడాన్ని తమ్ముళ్లు తప్పు పడుతున్నారు. ఇంత దారుణం జరిగినా సీరియస్ గా తీసుకోని వ్యక్తి నందమూరి కుటుంబ సభ్యుడు ఎలా అవుతాడని కూడా కొందరు ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు.