విశాఖపట్టణం, నవంబర్ 22,
ఎన్నికల సమయంలో కొన్ని సీన్లు రక్తి కట్టిస్తాయి. రాజకీయంగా అనుకూలంగా మారతాయి. సెంటిమెంట్ ను ప్రజల్లో పంప్ చేయడానికి పార్టీ అగ్రనేతలు వీటిని ఉపయోగించుకుంటారు. అనేకసార్లు ఆ సీన్లు సానుభూతిగా మారి ఓట్ల వర్షం కురిపించిన సంఘటనలు కూడా లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ లో రానున్న కాలంలో ఇలా రక్తి కట్టే దృశ్యాలు అనేకం చూడాల్సి ఉంటుంది. ఎన్నికలకు మూడేళ్ల ముందే ప్రారంభం కావడంతో ఇంకా ఎలాంటి రకాల సీన్లు చూడాలో? గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో కత్తి దాడి జరిగింది. కోడి కత్తి అంటూ అప్పటి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ నేతలు వెటకారం చేసినా జగన్ హైదరాబాద్ వెళ్లి ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. కోడికత్తి డ్రామాగా టీడీపీ కొట్టి పారేసినా గత ఎన్నికల్లో జగన్ కు ఎంతో కొంత ఉపయోగపడిందన్నది వాస్తవం. ఎన్ని దీక్షలు చేసినా రాని సానుభూతి కత్తి దాడి, పాదయాత్రలో జగన్ సంపాదించుకోగలిగారు. ఇప్పుడు చంద్రబాబు సయితం అదే బాటలో ఉన్నారు. తన భార్యను కించపర్చారంటూ ఆయన వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యాలు సానుభూతిని తెచ్చి పెట్టాయనే చెప్పాలి. ఎంతవరకూ సానుభూతి వచ్చిందంటే చెప్పలేం కాని, ఈ వయసులో పెద్దాయనకు ఇంత కష్టమా? అన్న కామెంట్స్ మాత్రం విన్పించాయి. ప్రధానంగా ఉన్నత, మధ్య తరగతి వర్గాలతో పాటు జగన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్న వారు పాపం చంద్రబాబు అని అనేశారు. ఈ సానుభూతిని మరో మూడేళ్ల వరకూ చంద్రబాబు కాపాడుకోవాల్సి ఉంటుంది. జగన్ దీనిపై ఎలాంటి వివరణ ఇచ్చుకున్నా పెద్దగా ఫలితం ఉండదు. సభలో జరిగిన ఘటనకు వారు తప్ప ఎవరూ సాక్షులు కాదు. బాధితుడి మాటలను నమ్మాల్సి ఉంటుంది. అందుకే చంద్రబాబుకు రాష్ట్రంలో కొంత సానుభూతి వచ్చిందనే చెప్పాలి. మరి ఈ సానుభూతి 2024 వరకూ ఉంటుందా? అంటే చెప్పలేం. చాలా సమయం ఉంది. జగన్ కు మాత్రం బాబు ఏడుపు రాజకీయంగా ఇబ్బంది కలిగించేదే అని చెప్పక తప్పదు.