న్యూఢిల్లీ నవంబర్ 22
ఈ నెల 24న కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో నూతన వ్యవసాయ చట్టాల ఉపసంహరణ ప్రతిపాదనను మంత్రి వర్గం ఆమోదించనుంది. ఇక నవంబర్ 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టనుంది.కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించారు. సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ జయంతి సందర్భంగా ఆయన శుక్రవారం దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనను ఇక విరమించాలని, ఇళ్లకు తిరిగి వెళ్లాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రారంభానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. సాగు చట్టాల రద్దుకు రాజ్యాంగబద్ధ ప్రక్రియను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు.