YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మూడు రాజధానుల ఉపసంహరణ కోర్టులో క్లారిటీ ఇచ్చిన ఏపీ

మూడు రాజధానుల ఉపసంహరణ కోర్టులో క్లారిటీ ఇచ్చిన ఏపీ

విజయవాడ, నవంబర్ 22,
ఓ వైపు వరదలతో లక్షలాది మంది అల్లాడుతూంటే ఏపీ ప్రభుత్వం… మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుఅంశాల్లో ఏం చేయాలో తల బాదుకుంటోంది. హైకోర్టు ఆ బిల్లులను కొట్టి వేస్తుందని న్యాయనిపుణులు తేల్చేయడంతో ఇప్పుడు ఆ నిర్ణయాలను ఎలాగైనా లైవ్‌లో ఉంచాలన్న వ్యూహంతో అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకున్నట్లుగా హైకోర్టుకు తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభం అయిన తర్వాత ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఆ తర్వాత మంత్రులతో సమావేశమైన సీఎం జగన్ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా నిర్ణయం ప్రకటించారు. మంత్రులు ఆమోదించారు. ఈ విషయాన్ని హైకోర్టులో మూడు రాధానులపై విచారణ జరుగుతున్న సందర్భంలో ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్ వివరించారు. మూడు రాజధానుల బిల్లులు, సీఆర్డీఏ రద్దు వంటి అంశాలపై హైకోర్టులో రోజువారి విచారణ జరుగుతోంది. ఈ సమయంలో ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. నిజానికి బిల్లులు ఎప్పుడో పాసైపోయాయి. గవర్నర్ ఆమోదం కూడా తెలిపారు. ఆ సమయంలో కోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఆచరణ ఆగిపోయింది. ఇప్పుడు వాటి చట్టబద్ధతపైనే విచారణ జరుపుతున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ రెండు బిల్లుల్ని వెనక్కి తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించడం రాజకీయవర్గాల్లో సంచలనానికి కారణం అవుతోంది. మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్నంత మాత్రాన ప్రభుత్వం మూడు రాజధానులపై వెనక్కి తగ్గినట్లుగా కాదని.. మరో రూపంలో తెర మందుకు తెస్తారని భావిస్తున్నారు. కోర్టుల్లో ఆ బిల్లులు నిలబడవన్న కారణంగానే ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఏ రూపంలో మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం మరోసారి తెరపైకి తెస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో సీఎం జగన్ చేయనున్న ప్రకటన ఆధారంగా ప్రభుత్వ వ్యూహం ఏమిటో తెలిసే అవకాశం ఉంది.
అమరావతి రాజధాని – కీలక ఘట్టాలు, కోర్టు కేసులు…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండుగా విభజన జరిగిన అనంతరం అప్పటి సీఎం చంద్రబాబు 2014, సెప్టెంబర్ 4వ తేదీన ఏపీ నూతన రాజధానిని విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటు చేయబోతున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. ఆ తర్వాత 2014, అక్టోబర్‌‌లో రాజధాని కోసం తుళ్లూరు, మంగళగిరి మండలాలలో ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలో భూమి సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. 2015, జనవరి 2న రాజధాని భూసమీకరణ కార్యక్రమానికి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడు గ్రామంలో అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఇక 2015, ఏప్రిల్‌‌లో నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధానికి అమరావతి పేరును ఖరారు చేస్తూ ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2015, జూన్‌ 6వ తేదీన తుళ్లూరు మండలం మందడం గ్రామంలో అమరావతి నిర్మాణానికి చంద్రబాబు భూమి పూజ చేశారు. రాజధాని కోసం 29 గ్రామాల పరిధిలో 33,000 ఎకరాలు సమీకరించాలని నిర్ణయించారు. దాదాపు 30,000 ఎకరాలు సమీకరణ పూర్తి కాగా.. అమరావతికి 2015 అక్టోబరు 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మరోవైపు ఏపీ పరిపాలనా భవనాలకు 2016 అక్టోబర్‌ 28న వెంకయ్యనాయుడు శంఖుస్థాపన చేశారు. 2016 జనవరిలో సచివాలయ భవనాలకు చంద్రబాబు శంకుస్థాపన చేయగా.. 2016 ఏప్రిల్‌ 25న నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాలను ఆయన ప్రారంభించారు. 2017 మార్చి 2న ఏపీ శాసనసభ నూతన భవనం ప్రారంభమైంది.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత…
2019, డిసెంబర్‌ 17న దక్షిణాఫ్రికా మాదిరిగా మనం కూడా మూడు రాజధానులు పెట్టుకోవచ్చంటూ అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ కీలక ప్రకటన చేశారు. పాలనా రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు, లెజిస్లేటివ్‌ రాజధానిగా అమరావతి ఉండవచ్చని చెప్పిన జగన్‌. దీనితో ఒక్కసారి 29 రాజధాని గ్రామాల్లో కలకలం రేగింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అనేక రాజధాని గ్రామాల్లో రిలే నిరాహారదీక్ష శిబిరాలు ప్రారంభమయ్యాయి. 2020, జనవరి 20న శాసనసభలో ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి బిల్లు, ఆమోదముద్ర పడింది. విశాఖ, కర్నూలు, అమరావతి మూడు చోట్ల రాజధానులను వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2020, జనవరి 22న అసెంబ్లీ ఆమోదించిన బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపుతూ శాసనమండలి ఛైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారు. 2020, జూన్‌ 16న పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు రెండవసారి శాసనసభలో ఆమోదం పడింది. అలాగే 2020 జులై 31న పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్‌ ఆమోదముద్ర వేశారు.
కోర్టు కేసులు ఇలా…
రాజధాని వివాదాలపై 93 పిటిషన్లు దాఖలు అయ్యాయి. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలు, నోటిఫికేషన్లు చెల్లవంటూ కోర్టులో పిటిషన్లు దాఖలు కాగా.. ప్రభుత్వ నిర్ణయాలు, కమిటీల నివేదికలు రాజ్యాంగ విరుద్దమంటూ హైకోర్టులో రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు బృందం పిటిషన్‌ దాఖలు చేశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మన్నవ సుబ్బారావు, లంకా దినకర్‌, మరికొంతమంది వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్‌ విచారణకు స్వీకరించిన చీఫ్‌ జస్టిస్‌ జేకే మహేశ్వరి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం.. 2020, అగస్టు 4 అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు చేపట్టవద్దంటూ ఏపీ హైకోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులు విధించింది. ఇక హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అప్పీలు చేయగా.. 2020, అగస్టు 26న ఏపీ ప్రభుత్వ పిటిషన్‌‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. హైకోర్టు విధించిన స్టేటస్‌కో ఉత్తర్వులలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
2020, అగస్టు 27… స్టేటస్‌కో ఉత్తర్వులను నిరవధికంగా పొడిగించిన ఏపీ హైకోర్టు, మూడు రాజధానులలో భాగంగా ఎక్కడైనా ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా, వాటికి కూడా స్టేటస్‌కో ఉత్తర్వులు వర్తిస్తాయని చెప్పింది. విచారణ సెప్టెంబరు 21వ తేదీకి, తరువాత అక్టోబర్‌ 5కి వాయిదా వేసింది. 2020, అక్టోబర్‌ 5 నుంచి 12 వరకూ ఏపీ హైకోర్టులో జరిగిన విచారణ, తర్వాత నవంబర్‌ 2కు వాయిదా పడింది. 2020, నవంబర్‌ 4… మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు హైకోర్టులో సీపీఎం పార్టీ అఫిడవిట్‌ దాఖలు చేసింది. 2020, డిసెంబర్‌… పిటిషన్‌ విచారిస్తున్న చీఫ్‌ జస్టిస్‌ జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టుకి బదిలీ అయ్యారు. ఏపీ హైకోర్టు కొత్త చీఫ్‌ జస్టిస్‌ అరూప్‌ గోస్వామి ముందుకి రాజధాని పిటిషన్లు విచారణకు వచ్చాయి. 2021, మార్చి 26… పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ మే 3కి వాయిదా పడింది. 2021, మే 3… కొవిడ్‌ కారణాలతో విచారణ వాయిదా వేయాలని కోరిన పిటిషనర్లు, ఏజీ. విచారణ అగస్టు 23కి ధర్మాసనం వాయిదా వేసింది.2021, ఆగష్టు 23… కొవిడ్‌ కారణాలతో ఏజీ విజ్ఞప్తి మేరకు రాజధాని కేసుల విచారణ హైకోర్టు నవంబర్‌ 15కు వాయిదా వేసింది. 2021, అక్టోబర్‌ 14… ఏపీ హైకోర్టు కొత్త చీఫ్‌ జస్టిస్‌గా ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ప్రమాణం స్వీకారం చేశారు. 2021, నవంబర్‌ 15… ఏపీ రాజధాని వికేంద్రీకరణ కేసులపై హైకోర్టులో రోజూవారి విచారణలు ప్రారంభమయ్యాయి. అమరావతి రైతుల, పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ వాదనలు వినిపించారు.. అమరావతిలో భూములున్న కారణంతో త్రిసభ్య ధర్మాసనం నుంచి జస్టిస్‌ సోమయాజులు, సత్యనారాయణమూర్తిలను తప్పించాలని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్‌ దవే కోరారు. దానికి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మిశ్రా తిరస్కరించారు.

Related Posts