తిరుపతి, నవంబర్ 23,
ఏపీలో ఏ ఎన్నిక జరిగినా టీడీపీకి పరాభవం మాములు విషయంగా మారిపోయింది. రాజకీయాలు అన్న తర్వాత గెలుపోటములు మాములే. అయితే ఓ ఎన్నికలో పరాభవం ఎదురైతే.. తరువాత జరిగే ఎన్నికల్లో పుంజుకోవాలని ఏ రాజకీయ పార్టీ అయినా భావిస్తుంది. ఈ మేరకు వ్యూహాలకు పదును పెట్టి ప్రత్యర్థిపై పోటీకి సై అంటుంది. కానీ ఏపీలో ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఓటములను సీరియస్‌గా తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికలు మొదలు.. ఇప్పటి లోకల్ బాడీ ఎన్నికల వరకు గత రెండున్నరేళ్లలో జరిగిన ఏ ఎన్నికలోనూ టీడీపీ ‘ఇది నా గెలుపు’ అనుకునే విధంగా విజయం సాధించలేదు.అయితే కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు టీడీపీ ఓటమికి కూడా సవాలక్ష కారణాలు ఉండొచ్చు. ఇందులో ముఖ్యమైనది చంద్రబాబు వ్యూహం. సాధారణంగా వ్యూహాలు రచించడంలో బాబు దిట్ట అంటూ టీడీపీ నేతలు గొప్పలు చెప్తుంటారు. పైగా ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ కూడా కావడంతో బాబు వ్యూహాల విషయంలో కొందరికి అపార నమ్మకం ఉంది. కానీ గత రెండున్నరేళ్లలో టీడీపీ ఓటములను పరిశీలిస్తే.. చంద్రబాబు వ్యూహాలు పారడం లేదు అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. ఏపీలో అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని భ్రమల్లో బతుకుతుండటమే దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అన్ని ఓటములు ఓ లెక్క.. సొంత నియోజకవర్గం కుప్పంలో ఓటమి మరో లెక్క అన్నట్లు టీడీపీ పరిస్థితి దయనీయంగా తయారైంది. కుప్పంలో ఓటమి చూసైనా చంద్రబాబు మారాలని టీడీపీ నేతలే చెప్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కుప్పంలో గతంలో పంచాయతీలు, పరిషత్‌లలో ఓడినప్పుడే చంద్రబాబు జాగ్రత్త పడాల్సింది. ఇప్పుడు మున్సిపాలిటీ కూడా పోయిన తర్వాత ఆయన చేయగలిగిందేమీ లేదు. అసలు కుప్పం మున్సిపాలిటీని దాని మానాన దాన్ని వదిలేసి ఉంటే బాగుండేది. అంతగా ప్రచారం చేయాల్సి వస్తే తనయుడు లోకేష్‌ను పంపి ఊరుకుంటే సరిపోయేది. కానీ 25 వార్డులు ఉండే మున్సిపాలిటీ కోసం స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి హైప్ క్రియేట్ చేశారు.చంద్రబాబే రంగంలోకి దిగాక అధికార పార్టీ ఊరికే ఊరుకుంటుందా.. తమ మంత్రులను అక్కడకు పంపి ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగింది. కుప్పం మున్సిపాలిటీ గెలవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఫలితం సాధించింది. దీంతో టీడీపీకి దిమ్మతిరిగే ఫలితం వచ్చింది. గత రెండున్నరేళ్లలో ఎన్నో ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ.. అసలు కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలలో పాల్గొనకుండా బహిష్కరించి ఉంటే కొంచెమన్నా పరువు నిలబడేది. ఇప్పుడు కుప్పంలో ఓటమిపాలు కావడంతో టీడీపీ క్యాడర్‌లో నైతిక స్థైర్యం దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. కుప్పం ఫలితంతో ఇకపై వైసీపీ నేతల మాటల తూటాలు టీడీపీకి కష్టమే కావొచ్చు.ఇప్పటికైనా టీడీపీ అధినేత చంద్రబాబు తన వ్యూహాలకు పదునుపెట్టి.. కేవలం వైసీపీపై మాటల దాడి కాకుండా ప్రజలకు పనికొచ్చే పనులపై పోరాటం చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి మళ్లీ పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతసేపూ జగన్‌ను తిడుతూ.. తిట్టిస్తూ.. జూమ్ మీటింగులు పెడుతూ.. రాష్ట్రంలో కాకుండా హైదరాబాద్‌లో కూర్చుని రాజకీయ విన్యాసాలు చేస్తే తెలంగాణ తరహాలో ఏపీలోనూ పార్టీ చేయిజారిపోవడం ఖాయంగా కనిపిస్తుందనేది రాజకీయ విశ్లేషకుల వాదన. మొత్తానికి 2019 అసెంబ్లీ ఎన్నికల షాక్ నుంచి తేరుకోని టీడీపీకి.. కుప్పంలో ఓటమి తీరని ఆవేదనగానే పరిగణించాలి.