టెక్సాస్ నవంబర్ 23
గ్రహశకలాలు భూమిని ఢీకొట్టితే. అప్పుడు మనుషుల సంగతేంటి. వారిని రక్షించుకోవడం ఎలా. అయితే అంతరిక్షం నుంచి వచ్చే ఆపదలను దృష్టిలో పెట్టుకుని అమెరికాకు చెందిన నాసా ఓ కొత్త ప్రయోగానికి తెరలేపింది. దీని కోసం డార్ట్ మిషన్‌ను చేపట్టింది. డార్ట్ అంటే డబుల్ ఆస్ట్రాయిడ్ రిడైరెక్షన్ టెస్ట్(డీఏఆర్‌టీ) అన్నమాట. దీనిలో భాగంగా ఓ వ్యోమనౌకను నాసా ప్రయోగించనున్నది. ఆ వ్యోమనౌక అంతరిక్షంలో ఉన్న ఓ గ్రహశకలాన్ని ఢీకొట్టనున్నది. దాని గతిని మార్చేందుకు వ్యూహాత్మకంగా ఈ పరీక్షను నాసా చేపట్టింది. ఆరు మిలియన్ల మైళ్ల దూరంలో ఉన్న డిమార్ఫస్ ఆస్ట్రాయిడ్‌ను ముక్కలు చేసేందుకు నాసా డార్ట్ మిషన్ ద్వారా వ్యోమనౌకను ప్రయోగిస్తుంది. గోల్ఫ్ కార్ట్ సైజులో ఉన్న ఆ నౌక.. డిమార్ఫస్ శకలాన్ని తుక్కు చేయనున్నది. ఫాల్కన్ 9 రాకెట్‌ను డార్ట్ మిషన్‌లో భాగంగా కాలిఫోర్నియాలో ఉన్న వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ప్రయోగించనున్నారు. నిజానికి ప్రస్తుతం భూమి సమీపంలో పెద్ద పెద్ద గ్రహశకలాలు ఏమీ లేవు. చిన్న చిన్నవి ఉన్నా.. వాటితో పెనుముప్పు ఏమీలేదు. నాసా పేల్చాలనుకుంటున్న డిమార్ఫస్ ఆస్ట్రాయిడ్ సైజు 160మీటర్ల వెడల్పు ఉన్నది. ఈ సైజులో ఉన్న గ్రహశకలం పేలితే న్యూక్లియర్ బాంబు తరహాలో ఎనర్జీ రిలీజవుతుంది. 300 మీటర్ల వెడల్పు ఉన్న ఆస్ట్రాయిడ్లతో ఒక ఖండానికే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇక కిలోమీటర్ వెడల్పు ఉన్న గ్రహశకలాలతో భూగోళానికే విపత్తు సంభవించే అవకాశం ఉంటుంది. బుధవారం రోజున నాసా డార్ట్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించనున్నది. 6.7 మిలియన్ల మైళ్లు ప్రయాణించి తర్వాత అది వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో తన కక్ష్యకు చేరుకుంటుంది. సుమారు గంటకు 15000 మైళ్ల వేగంతో నాసా ప్రయోగించిన వ్యోమనౌక .. డిమార్ఫస్ శకలాన్ని ఢీకొననున్నది.