నిజామాబాద్ నవంబర్ 23
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఏకగ్రీవం కానుంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 824 ఓటర్లకు గాను 84 శాతం మేర బలంతో టీఆర్ఎస్ పార్టీ గెలుపు సునాయాసంగా మారింది. స్థానిక సంస్థల పోరులో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బలం లేకపోవడంతో పోటీకి వెనుకడుగు వేసినట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎవరు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో బీజేపీ నుంచి నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ సైతం ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు నిజామాబాద్‌లో కాంగ్రెస్ నేతలు కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. ఇక టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవిత.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవం కావడం ఖాయంగా కనిపిస్తోంది.-ఎమ్మెల్సీ కవిత తరపున మొదటి సెట్ నామినేషన్లు దాఖలుస్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి కవిత తరపున మొదటి సెట్ నామినేషన్‌ను ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, జడ్పీ చైర్మన్ విఠల్ రావు కలిసి దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను నిజామాబాద్ కలెక్టర్, ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నారాయణ రెడ్డికి అందించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెండో సెట్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.