రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కాలం చెల్లింది. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఇక కాంగ్రెస్ ఇక్కడ పోటీ చేయాల్సిన అవసరం రాదు. కాంగ్రెస్ విభజన రాజకీయాలతో కర్ణాటక ప్రజలు విసిగి పోయారని, ఐదేళ్లలో కర్ణాటకను భ్రష్టు పట్టించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోదీ బుధవారం బంగారపేట ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ...‘. భారతీయులందరూ నా సంరక్షణలో ఉన్నారు. కానీ అందులో కర్ణాటక ప్రజలు మాత్రం ప్రమాదం అంచుల్లో ఉన్నారు. కర్ణాటక రాష్ట్ర గౌరవాన్ని కాంగ్రెస్ మంటగలిపింది. మాటలు చెప్పి కాలం గడిపే వారిని సాగనంపండి. రాష్ట్రానికి పనిమంతులను తీసుకురండి. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశిస్తాయి. మంచి పాలకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. ‘కాబోయే ప్రధానిని నేనే’ అని తనకు తానుగా రాహుల్ గాంధీ ప్రకటించుకున్నారు. దీన్ని బట్టి ఆయన ఎంతటి గర్విష్టో అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారందరూ అహంకారులే. వారిది అహంకారీ పార్టీ. గర్వంగానే మాట్లాడతారు. వాళ్లకు ప్రజల సమస్యలను పట్టించుకునే మనసు లేదు. మన్మోహన్ సింగ్ పేరుకు మాత్రమే ప్రధాని. కానీ ఆయన తన పార్టీ నేతల కనుసన్నల్లో పనిచేసేవారు. వీళ్లందరికీ సోనియాగాంధీ సారథిగా వ్యవహరించేవారు. కాంగ్రెస్ రిమోట్ కంట్రోల్ సోనియా దగ్గర ఉంది. కానీ భాజపా రిమోట్ 125కోట్ల భారత ప్రజల చేతిలో ఉంది. ప్రజలే నాకు హైకమాండ్. వారు చెప్పిందే నేను వింటాను. కాంగ్రెస్ ఆరు ‘సీ’లను అనుసరించి పాలన సాగిస్తోంది. కాంగ్రెస్ కల్చర్, కమ్యునలిజం, కార్టెలిజం, క్రైమ్, కరప్షన్, కాంట్రాక్ట్. ఇవి లేకపోతే కాంగ్రెస్ లేదు’ అని కాంగ్రెస్‌పై విమర్శలకు దిగారు.మరో మూడురోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రేపటితో ప్రచార గడువు ముగియనుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి.