తిరుపతి, నవంబర్ 24,
ఎప్పుడో తాతల కాలం నాటి ప్రణాళికలతోనే తిరుపతి ఉంది. పేరుకు స్మార్ట్‌సిటీ అయినా నగరాభివృద్ధికి తగినట్లుగా ప్రణాళికలు లేకపోవడం 'కొంప'ముంచింది. ఏడు కొండలు ఉన్నా వరద నీరు పోయేందుకు ఎప్పుడో సహజసిద్ధంగా ఏర్పడిన మాల్వాడిగుండమే గతి తప్ప, ఆధునిక, ప్రత్యేక కార్యాచరణ లేకుండా పోయింది. మాల్వాడిగుండం నాలుగు దశాబ్దాలుగా ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. చెరువులు, గెడ్డ స్థలాలు కూడా ఆక్రమణలకు గురయ్యాయి. వాటిలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు జరిగాయి. విస్తరించిన నగరానికి అనుగుణంగా భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ అభివృద్ధి చెందలేదు. నగరాభివృద్ధికి తగ్గట్లుగా వర్షపు నీరు మళ్లించే సరైన ప్రణాళిక లేకుండాపోయింది. ప్రస్తుతం తిరుపతిని వరద నీరు ముంచడానికి ప్రధాన కారణాలు ఇవేనని విశ్లేషకులు అంటున్నారు. మాల్వాడిగుండం కాలువ సహజ సిద్ధంగా ఏర్పడింది. తిరుమల కొండల్లో కురిసిన వర్షం నీరంతా కపిలతీర్థం నుంచి మాల్వానిగుండం కాలువకు వస్తుంది. ఈ కాలువ 40 ఏళ్లుగా కబ్జాలకు గురవుతూ వస్తోంది. బహుళ అంతస్తుల నిర్మాణాలు జరిగిపోయాయి. ఈ కాలువలో వర్షం నీరు మాత్రమే ప్రవహించేది. ప్రస్తుతం ఆక్రమణలకు గురికావడంతో మురుగునీటితో పాటు వర్షపు నీరు ప్రవహిస్తోంది. ఈ కాలువను 2002, 2003లో డిఎఫ్‌ఐడి బ్రిటన్ నిధులతో రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారు. మాల్వానిగుండం నుంచి వచ్చే వర్షపు నీరు శివజ్యోతి నగర్, ఎర్రమిట్ట మీదుగా రాజీవ్ నగర్ నుంచి వినాయక సాగర్‌కు వెళ్లేది. ఈ చెరువు నిండిన తరువాత అక్కడి నుంచి శెట్టిపల్లి చెరువు, వెంకటాపురం, కరకంబాడి చెరువులకు వర్షపు నీరు మళ్లేది. వినాయక సాగర్ సైతం ఆక్రమణకు గురైంది. దీంతో, వర్షపు నీరు చెరువులోకి వెళ్లేం దుకు మార్గం లేక రోడ్లపైకి వచ్చి మడుగును తలపిస్తోంది. యాభై ఏళ్ల క్రితం వరకూ తిరుపతి, తిరుపతి రూరల్ పరిధిలో 48 చెరువులు ఉండేవి. నగరం విస్తరణ క్రమంలో వీటిలో మూడొంతుల చెరువులు ఆక్రమణకు గురయ్యాయి.
గతంలో తిరుపతిలో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఉండేది. ఈ కమిటీకి టిటిడి ఇఒ చైర్మన్‌గా, జిల్లా కలెక్టర్ కన్వీనర్‌గా వ్యవహరించేవారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, తిరుపతి అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ (తుడా) వైస్‌చైర్మన్ మెంబర్లు ఉండేవారు. నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశమై తిరుపతి అభివృద్ధి, సమస్యలపై చర్చించాలి. 2014 నుంచి ఈ కమిటీ సమావేశం జరగడం లేదు. విభాగాల మధ్య సమన్వయం లోపించింది. అభివృద్ధి కుంటుపడింది. సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోతున్నాయి. ఇప్పుడు ఉన్న తిరుపతి నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం, తుడా కార్యాలయం, తుడా గ్రౌండ్, ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ ఒకప్పుడు తాతయ్యగుంట చెరువు. బమ్మగుంట, చిన్నగుంట, మంచినీళ్లగుంట, రామచంద్ర పుష్కరణి, ఐఎస్ మహల్, జ్యోతి టాకీస్ ప్రాంతాలు కూడా ఒకప్పుడు చెరువుల ప్రాంతాలే. ఇప్పుడు అక్కడ అపార్టుమెంట్లు నిర్మితమై వ్యాపార సముదాయాలు వెలిశాయి. కొరమేనుగుంట, చెన్నాయగుంట, లక్ష్మీనగర్, పార్వతీపురం ప్రాంతాలు కూడా చెరువు లోతట్టు ప్రాంతాలే. తిరుమల కొండల్లోనుంచి జాలువారి వచ్చే వర్షపు నీరంతా బాలాజీ, మల్లిమడుగు, కల్యాణి డ్యాం రిజర్వాయర్లకు మళ్లించేలా ప్రణాళికలు రూపొందించాలని, నగరం మరోసారి ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.