పశ్చిమ్‌బంగలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు నదియా జిల్లాలో భాజపా, సీపీఎం పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా చాలా గ్రామాల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు భాజపాతో కలిసి సీట్ల సర్దుబాటు చేసినట్లు సీపీఎం నాయకుడు ఒకరు తెలిపారు. సాధారణంగా భాజపా, సీపీఎం పార్టీల సిద్ధాంతాలు విరుద్ధంగా ఉంటాయి. భాజపాది వేర్పాటువాద రాజకీయం అంటూ సీపీఎం తరచూ విమర్శిస్తూ ఉంటుంది. అలాంటిది ఈ రెండు పార్టీలు కలవడం ఆసక్తికరంగా మారింది. ఇది సాధారణంగా సీట్ల సర్దుబాటులో భాగంగా జరిగిందని జిల్లా స్థాయిలో సీట్ల సర్దుబాటు చేసినట్లు తెలిపారు..నదియా జిల్లాలోని కరీంపూర్-రానాఘాట్ ప్రాంతంలో ఏప్రిల్ చివరి వారంలో ఇరు పార్టీల నేతలు కలిసి తృణమూల్‌కు వ్యతిరేక ర్యాలీ చేపట్టారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తృణమూల్ హింసపై నిరసన వ్యక్తంచేశారు. ఇరు పార్టీల నేతలు తమ తమ జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీ చేశారు. గ్రామ స్థాయిలో సీట్ల సర్దుబాటు కోసమే తాము కలిశామని, గ్రామాల్లో ఓట్ల విభజన జరగకుండా గట్టి పోటీ ఇవ్వాలనే ఇలా చేశాము, తమ పార్టీ సిద్ధాంతాలకు దీనికి సంబంధం లేదని సీపీఎం నదియా జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యడు సుమిత్ అన్నారు. నదియాలో తాము తృణమూల్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నామని పశ్చిమ్ బంగ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా పేర్కొన్నారు. తృణమూల్‌కు వ్యతిరేకంగా తాము ర్యాలీకి పిలుపునివ్వగా సీపీఎం కూడా తమతో కలిసిందని చెప్పారు.