YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

జీవన రహదారి

జీవన రహదారి
నది నిర్విరామంగా ప్రవహిస్తుంది. ఎడతెగకుండా, కనిపించకుండా కాలం కదులుతూ ఉంటుంది. రహదారీ అంతే. అది ఎక్కడా ఆగదు. పిల్లకాలవలు, వాగులు నదిలో కలిసినట్లు, కాలిబాటలు రహదారిపైకి చేరుకుంటాయి. రహదారిది ఒక సుదీర్ఘ ప్రయాణం. అది పగలు ఊపిరి తీసుకోనివ్వదు. రాత్రినీ నిద్రపోనివ్వదు. దారి పొడవునా ఎన్నో హెచ్చరికలు చేస్తుంది. అప్రమత్తత, జాగరూకతల్ని ఎరుక చేస్తుంది. కారడవిలో ఒంటరి (రోడ్డు)గా ఉన్నప్పటికీ సహజత్వాన్ని కోల్పోక నిబ్బరంగా ఉంటుంది. నల్లని తారు రోడ్డు వంకర్లుపోతూ పొడవాటి కొండచిలువలా భ్రమింపజేస్తుంది. కట్టెల మోపులు ఎత్తుకుని రోడ్డుపై నడిచే కష్టజీవుల బాధల బరువెంతో తెలిపేందుకు మూల మలుపుల వద్ద  రోడ్డు ఓ పక్క వంగిపోయి కవితాత్మక దృశ్యమానంతో మానవత్వాన్ని తట్టి లేపుతుంది. వానల్లో నిండా తడుస్తుంది. రోడ్డుపైన గుంతల గాయాలెన్ని ఉన్నా రహదారి ఆగిపోదు. భగభగ మండే ఎండల్లో ఎండుతూ నిప్పులా కాలుతుంది. ఎండమావుల ఒయాసిస్సుల్ని రోడ్డు తన వీపు మీద చల్లుకుంటూ సేదదీరుతుంది. జీవితమంటే కష్టసుఖాల మిశ్రమమని, ఓర్చుకుంటేనే బతుకు పయనం సాఫీగా సాగుతుందని చెప్పకనే చెబుతుంది. దట్టమైన అడవుల్లోకి చొచ్చుకుపోతూ వంక తిరిగిన చోట కొంత దూరం నుంచి చూస్తే ఒక దారి (లేదు) ఆగిపోయిందనే భావన కలుగుతుంది. కానీ, ఆ చివరి వరకూ వెళ్ళి చూస్తే అక్కణ్నుంచి రోడ్డు ఇంకా ఎంతో ముందుకు సాగిపోతూనే ఉందనే విషయం తెలుస్తుంది. ఈ దృశ్యం తెలిపే జీవిత సత్యం ఏమంటే, బతుకు పయనంలో ఒక బాధ కలగగానే జీవితం ముగిసిపోయిందని అనుకోకూడదు. ప్రతికూల వైఖరితో బతుకు చాలించకూడదు. ఎదురైన సమస్య దగ్గరకు వెళ్ళి చూడాలి. ఆయా పరిస్థితుల్ని బట్టి దాని గురించి దూరంగా ఉండి ఆలోచించడంకన్నా సమీపంగా వెళ్ళి చూడటం, గమనించడం ఎంతో మేలు. అప్పుడు నిజమేమిటో బోధపడుతుంది. సానుకూల దృక్పథ యోచనలోంచి జీవితం ఇంకా ఎంతో ఉందనే వాస్తవం తెలుస్తుంది. తాత్విక పునాదులపై మొలిచే కవిత్వ పరిభాషలో జీవితాన్ని రహదారితో పోలుస్తారు. ఆ జీవన రహదారిపై ప్రతీ మనిషీ ఒక బాటసారి. మనిషి జీవితానికి రహదారికి చాలా దగ్గరి సంబంధం ఉంది. అసలు మనిషి కోసమే కదా బాట ఏర్పడేది. అందుచేత దాని లక్ష్యం అంతా కూడా మనిషిని గమ్యం చేర్చేందుకే. దారి లేకుండా మనిషి మనుగడ అనూహ్యం. ఇంటి గుమ్మం దాటింది మొదలు మళ్ళీ ఇంటి గడప తొక్కేవరకూ దారే కదా మనిషికి తోడూ నీడా. ఒక మనిషికి జన్మనిచ్చిన వాళ్లు, ఆ మనిషికి పుట్టిన వాళ్లూ అతడితో కొంత కాలం ఉండి వీడిపోతారు. కానీ, జీవితకాలం మనిషితో ఉండేది ఒక్క ‘దారి’ మాత్రమే. అంతిమ యాత్రలోనూ కడసారి దారి చూపుతుంది. శ్మశానం దాకా సాగనంపుతుంది. అంతిమ సంస్కారాలు ముగించి అందరూ వెళ్ళిపోయినా చితిమంటలారేదాకా అక్కడే నిలిచి ఉండే చివరి ఆత్మీయుడు ‘బాట’ ఒక్కటే. మనిషి ఎంతదూరం పయనించాలన్నా ప్రతీ బాటా సహకరిస్తుందే గానీ అడ్డు చెప్పదు.  జీవితమూ అంతే. అది అన్ని దిశ, దశల్లోనూ అనేక మార్గాలున్న రహదారి. దానిపై సానుకూల దృక్పథంలో చేసుకునేవాళ్లకు చేసుకున్నంత ‘దారి’ దొరుకుతుంది. బతుకు బాట కనిపిస్తుంది.

Related Posts