న్యూఢిల్లీ నవంబర్ 26
పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఇవాళ రాజ్యాంగ దినోత్సవవేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడారు. భారత రాజ్యాంగం ఆధునిక భగవత్ గీత అన్నారు. దేశం పట్ల మన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు రాజ్యాంగం మనల్ని ప్రేరేపిస్తుందన్నారు. ప్రతి ఒక్కరం దేశం కోసం పనిచేయాలని తపిస్తే, అప్పుడు మనం ఏక్ భారత్, శ్రేష్ట భారత్‌ను నిర్మించవచ్చు అని స్పీకర్ బిర్లా తెలిపారు. ప్రధాని మోదీ కూడా మాట్లాడుతూ.. విభిన్నమైన మన దేశాన్ని.. మన రాజ్యాంగం ఏకీకృతం చేస్తుందని అన్నారు. ఎన్నో అవరోధాల తర్వాత రాజ్యాంగాన్ని రచించినట్లు ఆయన తెలిపారు. స్వతంత్య్రంగా ఉన్న రాష్ట్రాలను మన రాజ్యాంగం ఏకంగా చేసిందని ప్రధాని మోదీ అన్నారు.రాజ్యాంగ దినోత్సవం రోజున మన పార్లమెంట్‌కు సెల్యూట్ చేయాలన్నారు. ఇక్కడే అనేక మంది నేతలు తమ మేథోమథనంతో రాజ్యాంగాన్ని రచించినట్లు చెప్పారు. మహాత్మా గాంధీతో పాటు దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన ఎంతో మంది నేతలకు నివాళి అర్పిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ముంబైలో ఉగ్రదాడులు జరిగి నేటికి 14 ఏళ్లు అవుతోందని, ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు అర్పించిన సాహస సైనికులకు నివాళ్లు అర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. 1950 తర్వాత ప్రతి ఏడాది రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాల్సి ఉండె అని, రాజ్యాంగ నిర్మాణంపై ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కానీ కొందరు అలా వ్యవహరించలేదన్నారు. మన హక్కుల రక్షణ కోసం మన విధులు ఏంటో తెలుసుకోవాలన్నారు.కాగా రాజ్యాంగ దినోత్సవ సంబరాలకు విపక్షాలు డుమ్మా కొట్టాయి. 14 ప్రతిపక్షాలు పార్టీలు ఆ వేడుకలకు హాజరుకాలేదు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు ఈ వేడుకల్లో పాల్గొనలేదు. ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడంలేదని కాంగ్రెస్ నేత మానిక్ ఠాకూర్ ఆరోపించారు. సోమవారం నుంచి శీతాకాల సమావేశలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని 14 పార్టీలు డిసైడ్ అయినట్లు కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే వెల్లడించారు.