న్యూఢిల్లీ నవంబర్ 26
ఒక పార్టీని తరతరాలు ఒకే కుటుంబం ఏలితే, ఆ పార్టీలో ఉన్న వ్యవస్థలన్నీ ఒకే కుటుంబం వద్ద ఉంటే, అది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు సంకటంగా మారుతుందని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని తప్పుపట్టిన ఆయన.. పార్టీ ఫర్ ద ఫ్యామిలీ.. పార్టీ బై ద ఫ్యామిలీ అన్నట్లుగా మారిందన్నారు. ఈ అంశంపై అంతకన్నా ఎక్కువగా చెప్పడం తనకు ఇబ్బందిగా ఉందన్నారు. ఒకే పార్టీ దేశాన్ని పాలించడం కానీ, ఒక పార్టీ వ్యవస్థ మొత్తం ఒకే కుటుంబం చేతుల్లో ఉండడం సరికాదన్నారు. ఒక జాతీయ పార్టీ తరతరాలు ఒకే కుటుంబం చేతుల్లో ఉంటే, అది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సమస్యగా మారుతుందని ఆయన అన్నారు.కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాజకీయ పార్టీలను గమనిస్తే.. ఇలాంటి ధోరణి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అన్నారు. రాజ్యాంగం చెప్తున్న దానికి ఇది విరుద్ధమన్నారు. కుటుంబాల చేతుల్లో ఉండే పార్టీల గురించి ప్రస్తావిస్తూ.. ఒక కుటుంబం నుంచి పార్టీలోకి ఎక్కువ మంది రావద్దు అన్న ఆంక్షలు ఏవీ లేవన్నారు. యోగ్యులైన వారు ఒకే కుటుంబంలో ఎందరు ఉన్నా.. ప్రజల దీవనెలు ఉంటే.. వారంతా పార్టీలో సేవ చేయవచ్చు అన్నారు.