ముంబై, నవంబర్ 27,
దేశమంతటా నేచురల్ గ్యాస్ వాడకం ఊపందుకుందని, 2030 నాటికి దీనికి డిమాండ్ మూడు రెట్లు పెరుగుతుందని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. అప్పటికి డిమాండ్ 55 కోట్ల ‘స్టాండర్డ్ క్యూబిట్ మీటర్స్ పర్ డే’గా రికార్డు అవుతుందని తెలిపింది. ప్రస్తుతం ఇది 174 ఎంఎంఎస్‌సీఎండీలుగా ఉంది. ఆయిల్, స్టీల్ వంటి ఇండస్ట్రీలు భారీగా నేచురల్ గ్యాస్‌ను వాడుతుండటమే ఇందుకు కారణమని గెయిల్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ ఈఎస్ రంగనాథన్ చెప్పారు. ‘ఎనర్జీ వరల్డ్ గ్యాస్ కాన్‌క్లేవ్’ పేరుతో నిర్వహించిన వర్చువల్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ 2070 నాటికి నెట్ కార్బన్ ఎమిషన్స్ సున్నాకు తీసుకురావాలని ఇండియా టార్గెట్ పెట్టుకుంది కాబట్టి నేచురల్ గ్యాస్ వంటి ఎనర్జీల వాడకాన్ని పెంచుతారని అన్నారు. నేచురల్ గ్యాస్ వంటి ఇంధనాలు అతితక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయని రంగనాథన్ వివరించారు. ‘‘కాలుష్యం ఎక్కువ విడుదల చేసే బొగ్గు వాడకాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మనదేశ ఇంధన అవసరాలను తీర్చడానికి క్లీన్ ఎనర్జీల వాడకాన్ని పెంచాలని కోరుకుంటోంది. ఫలితంగా నేచురల్ గ్యాస్‌తోపాటు బ్లూ హైడ్రోజన్, అమ్మోనియా వంటి క్లీన్ ఎనర్జీలకు డిమాండ్ పెరుగుతుంది. కాలుష్యకారక ఇంధనాల వాడకం తగ్గుతుంది కాబట్టి నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్‌ను మనం చేరుకోవచ్చు’’ అని ఆయన వివరించారు.ముఖ్యమైన ఇంధనాల్లో నేచురల్ గ్యాస్ వాటాను 2030 నాటికి 15 శాతానికి పెంచాలనే టార్గెట్‌తో ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రస్తుతం నేచురల్ గ్యాస్ వాటా 6.2 శాతం మాత్రమే ఉంది. ఇప్పటి ఎనర్జీ డిమాండ్‌లో క్లీన్ ఫ్యూయల్స్ వాటా రెండుశాతం కంటే తక్కువగానే ఉంది. ఏ రకంగా చూసినా నేచురల్ గ్యాస్‌కు డిమాండ్ పెరిగితీరుతుందని రంగనాథన్ అన్నారు. నగరాల్లో ఇండ్లకు, ఆటోమొబైల్స్ నేచురల్ గ్యాస్ సరఫరా చేసే సిటీ గ్యాస్ నెట్‌వర్క్‌లకు డిమాండ్ కరోనా ముందుస్థాయిలకు చేరుకుందని వెల్లడించారు. ఇది ఇక ముందు మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రస్తుతం నేచురల్ గ్యాస్ వాడకం 174 ఎంఎంఎస్‌సీఎండీలుగా ఉంది. దీనిని ఎక్కువగా ఎరువుల తయారీ ఫ్యాక్టరీలు, సిటీ గ్యాస్ నెట్‌వర్క్‌లు, కరెంటు తయారీ యూనిట్లు వాడుతున్నాయి. మొత్తం డిమాండ్‌లో 49 శాతం మనదేశంలోనే తయారవుతోంది. మిగతా దానిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని గెయిల్ తెలియజేసింది. దిగుమతులను తగ్గించడానికి తయారీని భారీగా పెంచుతున్నారు. గత మూడు నెలల్లో ప్రొడక్షన్ 20 శాతం వరకు పెరిగింది. ఎగుమతులు కూడా ఏటా 40 మిలియన్ టన్నుల మేర పెరుగుతున్నాయి. ‘‘మనదేశంలో రిన్యువబుల్ ఎనర్జీ సెక్టార్‌కు మంచి భవిష్యత్ ఉంది. దీనివల్ల గెయిల్ వంటి కంపెనీలకూ మేలు జరుగుతుంది. నేచురల్ గ్యాస్ చాలా తక్కువ కార్బన్స్‌ను విడుదల చేస్తుంది కాబట్టి సోలార్, విండ్ పవర్ వంటి రిన్యువబుల్ ఎనర్జీలు అందుబాటులో లేని ప్రాంతాల్లో నేచురల్ గ్యాస్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే నేచురల్ గ్యాస్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంచాలంటే గ్యాస్ పైప్‌లైన్లు, టెర్మినళ్లను నిర్మించాలి. వీటికోసం రాబోయే 5–8 ఏళ్లలో రూ.1.6 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయి’’ అని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో స్టీల్, ఆయిల్ రిఫైనరీలు, లాంగ్‌హాల్ ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్ల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంటుందని గెయిల్ తెలిపింది. రాబోయే ఎనిమిదేళ్లలో సిటీ గ్యాస్‌కు డిమాండ్ 140 ఎంఎంఎస్‌సీఎండీలకు పెరుగుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఇది 14 ఎంఎంఎస్‌సీఎండీలు మాత్రమే ఉంది.