ఐపీఎల్ 2018 సీజన్‌లో ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్‌ల టైమింగ్స్ మారనున్నాయి. ఏప్రిల్ 7న ఆరంభమైన ఈ టోర్నీలో చాలా మ్యాచ్‌లు స్లో ఓవర్ రేట్ కారణంగా దాదాపు రాత్రి 12 గంటలకి ముగుస్తున్నాయి. దీంతో.. కనీసం ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్‌లను ఒక గంట ముందుకు జరిపి అభిమానులకి ఉపశమనం కలిగించాలని ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే.. రాత్రి 8 గంటలకి ఆరంభమవ్వాల్సిన మ్యాచ్‌ని 7 గంటలకే ప్రారంభిస్తారు. స్టేడియానికి వచ్చి మ్యాచ్‌ని వీక్షించే అభిమానులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని ఈ టైమింగ్ మార్పు నిర్ణయం తీసుకున్నట్లు రాజీవ్ శుక్లా వెల్లడించారు.
ముంబయిలోని వాంఖడే వేదికగా మే 22న క్వాలిఫయర్ -1, మే 27న ఫైనల్ జరగనుండగా.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మే 23న ఎలిమినేటర్, 25న క్వాలిఫయర్ - 2 మ్యాచ్‌లు జరగనున్నాయి. తాజా మార్పుతో ఈ మ్యాచ్‌లు అన్నీ రాత్రి 7 గంటలకే ప్రారంభంకానున్నాయి. టోర్నీలో ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ 16 పాయింట్లతో దాదాపు ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ (14 పాయింట్లు) రేసులో తర్వాత స్థానంలో ఉంది.