హైదరాబాద్, నవంబర్ 27,
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ఏర్పడింది. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి వుంది. మొత్తం 102 నామినేషన్లు దాఖలయ్యాయి. చెదురుమదురు ఘటనలు మినహా నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక పరిశీలన, ఉపసంహరణ మిగిలింది. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లను టీఆర్‌ఎస్ మద్దతుదారులు చించివేయడంతో రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. నామినేషన్ల గడువు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ మెదక్, ఖమ్మంలలో తన అభ్యర్థులను నిలిపింది.కరీంనగర్ మాజీ మేయర్, టీఆర్‌ఎస్ నేత రవీందర్‌సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం విశేషం. చాలాకాలం నుంచి పార్టీని నమ్ముకుని వున్నానని, కానీ తనకు అవకాశం ఇవ్వలేదని రవీందర్ సింగ్ నామినేషన్ వేశారు. బుధవారం నామినేషన్ల పరిశీలన జరగనుండగా.. 26 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. డిసెంబరు 10న ఎన్నికలు జరగనున్నాయి. 14న ఫలితాలు ప్రకటిస్తారు. అధికార పార్టీ నేతలు గెలుపుపై ధీమాతో వుండగా విపక్షాలు మాత్రం పోటీలో వున్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థినిగా ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్ వేశారు. అయితే ఆయనకు మద్దతిచ్చిన వారిపై ఇద్దరు ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో వివాదం ఏర్పడింది.రంగారెడ్డి జిల్లాలో 2 స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా ప్రస్తుత ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి నామినేషన్ వేశారు. మరో స్వతంత్ర అభ్యర్థి సైతం దాఖలు చేశారు. కరీంనగర్‌లో రెండు స్థానాలకు 27 మంది నామినేషన్లు వేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా ప్రస్తుత ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు, మాజీ మంత్రి ఎల్.రమణ బరిలో నిలిచారు. తనకు కీలక పదవి ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్న మాజీ మేయర్ రవీందర్‌సింగ్ అధిష్ఠానం ఆదేశాలను ధిక్కరించి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మరో 24 మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.మహబూబ్‌నగర్‌లో 2 స్థానాలకు 10 మంది నామినేషన్లు వేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా ప్రస్తుత ఎమ్మెల్సీలు కూచికుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మరో ఎనిమిది మంది స్వతంత్రులు నామినేషన్లు దాఖలుచేశారు. ఖమ్మంలో ఒక స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తాతా మధుసూదన్, కాంగ్రెస్ తరఫున రాయల నాగేశ్వరరావులతో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మెదక్‌లో ఒక స్థానానికి ఏడుగురు నామినేషన్లు వేశారు. వీరిలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా డాక్టర్ యాదవరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థినిగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మలతో పాటు అయిదుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక స్థానానికి 11 మంది నామినేషన్లు వేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డితో పాటు మరో 10 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వరంగల్‌లో ఒక స్థానానికి 14 నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మరో 13 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒక స్థానానికి 24 నామినేషన్లు దాఖలయ్యాయి. వీరిలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా దండె విఠల్, మరో 23 మంది స్వతంత్రులు ఉన్నారు. నామినేషన్లు ఉప సంహరణ అనంతరం బరిలో ఎవరెవరు నిలుస్తారనేది తేలనుంది. అన్ని స్థానాల్లో తమదే విజయం అనే ధీమాతో వున్నారు టీఆర్‌ఎస్ అభ్యర్ధులు. మరి పెద్దల సభలో ఎవరు అడుగు పెడతారో చూడాలి.