విజయవాడ, నవంబర్ 27,
మూడు రాజధానులు బిల్లు ఉపసంహరణ నిజంగా సంచలనమే. ఆందోళన చేస్తున్న రైతులు ఇది తమ విజయం అనుకున్నారు. ఈ చర్యను విపక్షాలు స్వాగతించాయి. బిల్లు ఉపసంహరణ హర్షణీయమని హర్షం వ్యక్తం చేశాయి. ఇది ఏడు వందల రోజుల పోరాట విజయం అన్నారంతా.. కానీ, ఆ ఆనందం ఎక్కువ సేపు నిలువ లేదు. ఉపసంహరణపై సీఎం వివరణతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇది మోసం అంటూ ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బిల్లు ఉపసంహరణ ఏపీ సర్కార్ వ్యూహంలో భాగం. రాజధాని వికేంద్రీకరణ అంశంపై హైకోర్టు విచారణ తుది దశలో ఉంది. దీనికి సంబంధించి న్యాయస్థానం నుంచి వస్తున్న వ్యాఖ్యలు చూస్తే తీర్పు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతికూలంగా వచ్చేలా అనిపిస్తోంది. ఈ దశలో బిల్లును ఉపసంహరించుకుంటే కోర్టులో ఎదురు దెబ్బతగలకుండా జాగ్రత్త పడవచ్చు. ఒకసారి కోర్టులో ఓడిపోతే, సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వుంటుంది. అక్కడా చుక్కెదురైతే నైతికంగా ఎదురుదెబ్బ తగిలినట్టవుతుంది. దీని నుంచి బయటపడేందుకే ఉపసంహరణ ఎత్తుగడ అని విశ్లేషకులు అనుమానిస్తున్నారు.వాస్తవానికి జగన్ ప్రభుత్వానికి కోర్టు వ్యవహారాల్లో అంత లక్ లేదు. పలు మార్లు న్యాయస్థానంలో చుక్కుదెరయింది.అనేక అంశాల్లో ఎదురుగాలి తప్పలేదు. పలు నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పుపట్టాయి. అత్యధిక సందర్భాల్లో హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో జగన్ ప్రభుత్వానిక అనుకూలత కన్నా ప్రతికూలతే కనిపించింది. ఐతే , చంద్రబాబులా తమకు న్యాయమూర్తులను మేనేజ్ చేయటం రాదంటూ వైసీపీ నాయకులు సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరోసారి కోర్టులో చుక్కెదురయ్యే ప్రమాదాన్ని జగన్ ప్రభుత్వం పసిగట్టింది. తీర్పు ఎలావుంటుందో అర్థమైనట్టు కనిపిస్తోంది. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో ఇద్దరు న్యాయమూర్తుల ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని.. అందుచేత వాటిని విచారిస్తున్న త్రిసభ్య ధర్మాసనం నుంచి వారు వైదొలగాలని రాష్ట్రప్రభుత్వం అంతకు ముందు హైకోర్టును కోరింది. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులకు అమరావతిలో ప్లాట్లు ఉన్నాయని.. వ్యాజ్యాలపై తుది తీర్పులో వారి ఆర్థిక ప్రయోజనాలతో ఇమిడి ఉన్నప్పుడు ఆటోమేటిగ్గా వారు విచారణకు అనర్హులవుతారని ప్రభుత్వం వాదించింది. ఐతే కోర్టు ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. మూడు రాజధానుల బిల్లు రాజ్యంగ బద్ధమా ..కాదా అన్నది కోర్టు ముందున్న వ్యవహారం. ఇందులో న్యాయపరమైన అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా శాసనమండలి ఆమోదం పొందిందా? లేదా? అన్నది వాటిలో ఒకటి. ఈ బిల్లు తెచ్చేనాటికి మండలిలో వైసీపీకి సరిపడా బలం లేదు. అందుకే టీడీపీ తెలివిగా దానిని సెలెక్ట్ కమిటీకి పంపింది. అయితే అది కమిటీకి వెళ్లిందా లేదా అన్న గందరగోళం ఇంకా అలాగే ఉంది. దాంతో పాటు ఇందులో లెజిటిమేట్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. అంటే ప్రభుత్వం, ప్రజలకు మధ్య ఒప్పంద ప్రయోజనాలు. రాజధానిగా అమరావతిపై రైతులతో ప్రభుత్వం అలాంటి ఒప్పందమే చేసుకుంది. కాబట్టి ఈ లెజిటిమేట్ ఎక్స్‌పెక్టేషన్ కూడా విచారణలో కీలకం అయ్యే అవకాశం ఉంది.రాజధాని నిర్మాణం కోసం అమరావతి ప్రాంత రైతులు ముప్పయ్ వేల ఎకరాల భూమిని ఇచ్చారు. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే కోర్టులో నిలవకపోవచ్చు. లీగల్ గ్రౌండ్స్ మీద వీగిపోతే సుప్రీం కోర్టుకు వెళ్లినా ప్రయోజనం ఉండదు. ఇదంతా చూసి కోర్టులో వీగిపోతామనే అనుమానంతోనే బిల్లును ఉపసంహరించుకున్నట్టు అర్థమవుతుంది. ఐతే, ఉపసంహరించినంత మాత్రాన మూడు రాజధానుల ఆలోచలనకు జగన్ ప్రభుత్వం దూరం అయిందనుకోవటం తప్పు. న్యాయ నిపుణులతో చర్చించి, విస్తృత స్థాయిలోఅభిప్రాయసేకరణ జరిపి మరింత సమగ్రమైన ,మెరుగైన బిల్లు తీసుకువచ్చే అవకాశం ఉంది. అందువల్ల రైతుల ఆందోళనకు, ఐకాసీ యాత్రకు తెలుగుదేశం నిరసనలకు జగన్మోహన్ రెడ్డి భయపడ్డారనుకుంటే పొరపాటే అవుతుంది.బిల్లు ఉపసంహరణ అవకాశాన్ని జగన్ తన రాజకీయ ప్రయోజనాలకు కు అనుకూలంగా మార్చుకోవచ్చు. రాజకీయంగా సానుకూలత వచ్చే వరకు దీనిపై కాలయాపన చేయవచ్చు. మళ్లీ తనకు సరైన సమయం అనుకున్నప్పుడు దీనిని తిరిగి తెరమీదకు తీసుకురావచ్చు. అంటే, జగన్ ఇప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేసినట్టు అనిపించినా.. రెండు అడుగులు ముందుకు వేసే వ్యూహంతో వెళుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది.మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణకు, మోడీ తీసుకున్న మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు కొంత పోలిక కనిపిస్తోంది. ఈ రెండు నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకున్నవే. రెండు సందర్బాలలోనూ రైతులే అందోళనకారులు. ఉపసంహరణ సమయంలో ఇద్దరి ప్రకటన దాదాపు ఒకేలా ఉన్నాయి. నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనం చేస్తాయనే చివరకు అన్నారు. జగన్ ప్రకటన కూడా దాదాపు అలాగే ఉంది. దీనిని బట్టి నరేంద్ర మోడీ నిర్ణయం నుంచి జగన్ స్పూర్తి పొందినట్టు అనిపిస్తోంది. అయితే, మోడీ నిర్ణయంలో తక్షణ రాజకీయ ప్రయోజనాలు దాగున్నాయి. కానీ జగన్ కు ఆ పరిస్థితి లేదు. వ్యూహంలో మాత్రమే సారూప్యత ఉంది.మూడు రాజధానుల విషయంలో అనేక అపోహలు, అనుమానాలు, న్యాయపరమైన చిక్కులు వచ్చాయి. పైగా అమరావతి చుట్టే ప్రతిపక్షాల రాజకీయం నడుస్తోంది. కొద్ది రోజులు ఈ అంశాన్ని కోల్ట్‌స్టోరేజ్ లో పెడితే తాత్కాలికంగానైనా ప్రతిపక్షాలను నిరాయుధలను చేయవచ్చు అన్న వ్యూహం కూడా ఇందులో ఉంది. అంతేకాదు, అమరావతి వల్ల ప్రభావితం అయ్యే ప్రాంతాలలో తమపట్ల అసంతృప్తిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో ఉత్తరాంద్ర, రాయలసీమలో వైసీపీ ఎదురుదాడి చేయవచ్చు.ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయనే అనే భావన తీసుకురావచ్చు. తద్వారా విపక్షాలను ఇరుకున పెట్టే అవకాశం ఉంది.వాస్తవానికి అమరావతి సెంటిమెంట్ యావత్ రాష్ట్ర ప్రజల నిర్ణయానికి ప్రాతిపదిక కాదు. ఈ విషయం ఇప్పటికే స్పష్టంగా తెలిసింది. బద్వేల్, తిరుపతిలో వైసీపీ ఘన విజయాలే అందుకు ఉదాహరణ. రాష్ట్రం అంతా అమరావతి సెంటిమెంట్ ఉంటే వైసీపీ అభ్యర్థులు ఎలా గెలుస్తారు? కాబట్టి భవిష్యత్‌లో అయినా డీసెంట్రలైజేషన్ అనేది స్పష్టం. అమరావతి రైతులతో చర్చలు జరిగే అవకాశం ఉందా అన్నది తెలియాల్సి వుంది. ఉపసంహరణపై ప్రభుత్వం కోర్టుకు అఫిడవిట్ సమర్పించనుంది. ఈ సందర్భంలో హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసే అవకాశం ఉండవచ్చు.ఒకసారి కోర్టు వ్యవహారం ముగిశాక మరొకసారి రాజధాని వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సారి శాసన మండలిలో కూడా వైసీపీకి మెజారిటీ ఉంది. అందువల్ల బిల్లు ప్రవేశపెడితే సెలెక్ట్ కమిటీకి పంపాలనే ప్రతిపాదన కూడా రాదు. నిజానికి గత ప్రభుత్వానికి గానీ ఇప్పటి ప్రభుత్వానికి గానీ రాజధాని నిర్మాణం ముఖ్యం కాదు. ఈ మొత్తం వ్యవహారన్ని చూస్తే రాజధాని అంశాన్ని రాజకీయంగా వాడుకోవటమే వారికి ముఖ్యమని అర్థమవుతోంది. నిజానికి మూడు రాజధానుల బిల్లు వెనక నిజంగా ఉన్నది పాలనా వికేంద్రీకరణా? లేదంటే చంద్రబాబు అమరావతి కలను భగ్నం చేయటమా? అంటే ఎవరికి తోచినట్టు వారు అర్థం చేసుకోవచ్చు.సీఎం జగన్ తిరిగి మూడ రాజధానుల బిల్లు తెస్తామని అన్నారు. కానీ ఎప్పుడు తెస్తారో చెప్పలేదు. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా సాధ్యమైనంత వరకు సాగతీసే అవకాశం వుంది. అయితే దీనిపై కోర్టు ఏమైనా ఆదేశాలు ఇస్తుందో చూడాల్సి వుంది. ప్రభుత్వం సమర్పించే అఫిడవిట్‌ను బట్టి న్యాయస్థానం ఎలా స్పందిస్తుంతో తెలుస్తుంది.ఏదేమైనా, ఈ పంచాయితీ ఇప్పట్లో సమసిపోయేలా అనిపించట్లేదు. మూడు రాజధానుల వ్యతిరేక ఉద్యమం కొనసాగే అవకాశం ఉంది. అమరావతిని ఏకైక రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నిరసనలు చేపట్టాయి.