కడప నవంబర్ 27,
ఆ ఎమ్మెల్యే తీరు చూసి జనం నోరెళ్లబెడుతున్నారు. మొదటి సారి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వెంటనే ఎమ్మెల్యేగా గెలవటమే కాదు….రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించిన ఘనత ఆయనకే దక్కింది. ఎన్నికల ముందేమో అందర్నీ అన్నా అని ఆప్యాయంగా పలకరించినా, ఆ ఎమ్మెల్యే మాటల్లో ఇప్పుడు ఆ మర్యాద కనపడకపోవడంతో…. అప్పుడలా.. ఇప్పుడిలా అని నేతలు గుసగుసలాడుతున్నారట. కడపజిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం రాజకీయ పరంగా రాష్ట్రంలో గుర్తింపు కలిగిన నియోజకవర్గం. రూపాయికి బొమ్మా బొరుసు ఉన్నట్లు జమ్మలమడుగు రాజకీయాలలో మాజీ మంత్రులు ఆది నారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి లు ఉండేవారు. అయితే ఇప్పుడదంతా గతం… నిన్నమొన్నటి వరకు ఆయన పేరు సరిగ్గా చాలా మంది ప్రజలకు కూడా తెలియదు. వైద్యవృత్తిలో ఉంటూ రాజకీయాలలోకి అడుగుపెట్టారు డాక్టర్ సుధీర్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ లో సీనియర్ నాయకుడిగా ఉంటూ, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర హోం మంత్రి గా చేసి ఒక వెలుగు వెలిగిన మైసూరారెడ్డి సోదరుడి కుమారుడే సుధీర్ రెడ్డి.2017 సంవత్సరంలో జమ్మలమడుగు లో రాజకీయంగా మార్పులు జరిగాయి. వైసీపీ నుంచి MLA గా గెలుపొందిన ఆదినారాయణ రెడ్డి అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ సమయంలో రాజకీయాల్లోకి ఎంటరయ్యారు సుధీర్ రెడ్డి. నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న నాయకత్వ బాధ్యతలను రాజకీయాలకు కొత్తైనా సుధీర్ రెడ్డికి అప్పగించారు జగన్. నియోజకవర్గానికి కొత్త వ్యక్తి అయిన సుధీర్ రెడ్డి వస్తూ వస్తూనే అందర్నీ అన్నా…మామా.. బాబాయ్.. తమ్ముడూ అంటూ వరుసలు కలిపేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరితో కలిసిమెలిసిపోయారు. అప్పటికే నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి జోరుమీదుండటంతో, ఎమ్మెల్యే మర్యాద పిలుపులు కలిసివచ్చి, తక్కువ కాలంలోనే జనంతో కలిసిపోయారు. కాలం కలిసిరావడంతో కడపజిల్లా లోని మెజారిటీలో ముఖ్యమంత్రి జగన్ తరువాత అధిక మెజారిటీ సుధీర్ రెడ్డి దక్కించుకున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ MLA సుధీర్ మాట తీరులో చాలా మార్పు వచ్చిందని సన్నిహితులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికలకు ముందేమో అన్నా అని ఆప్యాయంగా పలకరించిన సుధీర్ రెడ్డి ఈ మధ్య అరేయ్, ఒరేయ్ అంటూ సంభోదిస్తున్నాడని సమాచారం. కనీసం ద్వితీయ శ్రేణి నాయకులకు చిన్న చిన్న పనులు కూడా చేయటం లేదని పనుల సంగతి అటుంచితే కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదని బాధపడటం నాయకుల వంతైంది. ఇప్పటికే ఎమ్మెల్యే తీరుపై రకరకాలుగా విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా కేడర్ తో ప్రవర్తిస్తున్న తీరుకు నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎమ్మెల్యే ఎందుకిలా చేస్తున్నారో తెలియక తల పట్టుకుంటున్నారు.