గుంటూరు, నవంబర్ 27,
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును నిండు అసెంబ్లీలో అవమానించిన నలుగురిపై ఇప్పుడు టీడీపీ గురి పెట్టింది. ఆ నలుగురిని టార్గెట్ చేసింది. వారిని వచ్చే ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని ఇప్పటికే చంద్రబాబు అక్కడి నేతలకు పిలుపునిచ్చారు. వారికి అవసరమైన అర్థ, అంగబలాలను సమకూరుస్తానని హామీ ఇచ్చారు. ఆ నలుగురే కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబులు. నియోజకవర్గాల్లో 2014లో మూడింటిలో టీడీపీ గెలిచిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో గన్నవరం, కాకినాడ టౌన్, సత్తెనపల్లిలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 2014కు ముందు కూడా టీడీపీ గుడివాడలో గెలిచింది. ఈ విషయాలను గుర్తు చేస్తున్నారు. గుడివాడలో కొడాలి నానికి పోటీగా ఈసారి వంగవీటి రాధాను దించాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారు. ఇక సత్తెనపల్లిలో ఇన్ ఛార్జిని చంద్రబాబు ఇప్పటి వరకూ తేల్చలేదు. అక్కడ కోడెల శివరాం, రాయపాటి వర్గాలు పోటీ పడుతున్నాయి. అయితే కోడెల శివరాంకు ఇన్ ఛార్జి పదవి ఇవ్వకపోతే తానే కోడెలకు అన్యాయం చేశానన్న అపప్రధను చంద్రబాబు ఎదుర్కొనాల్సి ఉంటుంది. అందుకే రాయపాటిని విజయవాడ పశ్చిమానికి పంపి సత్తెన పల్లిలో ఇరు వర్గాలను కూర్చోబెట్టి రాజీ చేయాలని చంద్రబాబు భావన. అప్పుడే అంబటి రాంబాబును సులువగా ఓడించవచ్చని లెక్కలు వేస్తున్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు బలమైన నేతగా ఉన్నారు. ఆయనకు కాస్త అన్ని రకాలుగా సహకారం అందిస్తే ద్వారంపూడిని ఓడించడం పెద్ద కష్టమేదీ కాదని అంటున్నారు. ద్వారంపూడిపై నియోజకవర్గంలో వ్యతిరేకత కన్పిస్తుండటం తమకు కలసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తుంది. గన్నవరంలో గద్దె కుటుంబాన్ని బరిలోకి దింపి వంశీని ఓడించాలన్న ఆలోచన కూడా ఉంది. మొత్తం మీద ఈ నాలుగు నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలన్న టీడీపీ ఆశలు ఏమేరకు నెరవేరుతాయన్నది చూడాల్సి ఉంది.