నెల్లూరు
27వ రోజు నెల్లూరు పట్టణంలోని జెట్టి శేషరెడ్డి ఫంక్షన్ హాల్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అంబాపురంలోని శాలివాహన ఫంక్షన్ హాల్ వరకూ 12కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగింది. ఒక రాష్ట్రం- ఒకే రాజధాని అంటూ అమరావతి రైతులు 27వరోజు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. నెల్లూరులో రాత్రి బసచేసిన జెట్టి శేషరెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద వెంకటేశ్వర స్వామికి పూజలు చేసిన తర్వాత.. ఈరోజు పాదయాత్ర ప్రారంభించారు. అంబాపురంలోని శాలివాహన ఫంక్షన్ హాల్ వరకూ ఇవాళ 12 కిలోమీటర్ల మేర నడవనున్నారు. జగన్ ఇచ్చే మంత్రి పదవులకు ఆశపడి.. తమను అవమానించొద్దని.. మహిళలు వైకాపా ఎమ్మెల్యేలకు సూచించారు.
దారి పొడవునా వివిధ వర్గాలు, సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. నెల్లూరు చేనేత సమాఖ్య ప్రతినిధులు మహిళలతో కలిసి నడిచారు. నేతన్నలు పాదయాత్ర చేస్తున్న మహిళలకు చీరలు పెట్టారు. కోవూరు ప్రాంతంలోని వరద ముంపు ప్రాంతాల మీదుగా వెళ్తున్న రైతులు..ఆ చీరల్ని అక్కడ నిరాశ్రయులకు పంచిపెట్టి మానవత్వం చాటారు. సాధారణంగా ఒక పార్టీ అనుచరులు కదిలితే ప్రత్యర్థి పక్షాలు ఆ కార్యక్రమానికి దూరంగా ఉంటారు. రైతుల పాదయాత్రలో అవేమీ కనిపించలేదు. వైకాపా మినహా అన్ని పార్టీల నేతలూ యాత్రలో స్వచ్ఛందంగాపాల్గొంటున్నారు విరాళాలు అందజేయడంలోనూ ఇదే ఉత్సాహం కనబర్చారు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి... రైతులకు రెండు రోజులపాటు వసతి, ఆహారం అందజేయడంతో పాటు రూ.2లక్షల విరాళం అందజేశారు. అదే గ్రామానికి పెల్లకూరు శ్రీనివాసులరెడ్డి రూ.2లక్షల అందజేశారు. ఉదయగిరి సమీపంలోని కమ్మవారిపాళెం గ్రామస్థులు 32వేలు, నెల్లూరులో కె.పెంచలనాయుడు మిత్రమండలి రూ. 60వేలు, మాధవరావు మిత్ర బృందం రూ. 20వేలు విరాళం అందించింది.