మెగాస్టార్ చిరంజీవి. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య’. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నారు. చిరంజీవి ఇందులో ఆచార్య అనే పాత్రను పోషిస్తే.. సిద్ధ అనే మరో పవర్‌ఫుల్ పాత్రలో రామ్‌చరణ్ నటించారు. ఆదివారం(నవంబర్ 28) సిద్ధ క్యారెక్టర్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో సిద్ధ(రామ్ చరణ్) ధర్మస్థలిలో ఉంటూ అక్కడ దేవాలయానికి, అక్కడున్న ఇతరులకు అండగా ఉంటాడు అనే పాయింట్‌ను ఎలివేట్ చేస్తూనే సిద్ధకు, నీలాంబరి మధ్య ప్రేమను కూడా చక్కగా ఆవిష్కరించారు కొరటాల శివ. అదే సిద్ధ అన్యాయానికి ఎదురు తిరిగినప్పుడు ఎలా ఉంటాడు. నక్సలైట్ నాయకుడిగా ఎలా ఉంటాడు అనే అంశాలను కూడా ఈ టీజర్‌లో చూపించారు.
‘‘ధర్మస్థలికి ఆపదొస్తే.. అది జయించడానికి ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపుద్ది’’ అని సిద్ధ విలన్స్‌ను ఉద్దేశించి చెప్పే డైలాగ్ వింటుంటే పాత్రలోని ఇన్‌టెన్సిటీ అర్థమవుతుంది. ఇక టీజర్ చివరలో నీటి కొలను ఒక వైపు చిరుత పిల్ల నీళ్లు తాగుతుంటే పెద్ద చిరుత కాపాలాగా ఉంటుంది. అదే కొలనుకి మరో వైపు రామ్‌చరణ్ నీళ్లు తాగుతుంటే చిరంజీవి నిలబడి చూస్తుండటాన్ని చూపించి డైరెక్టర్‌గా తనేంటో, మాస్ పల్స్‌ను ఎలా పట్టగలనో నిరూపించారు కొరటల శివ. ఇటు ప్రేక్షకులకు, అటు మెగాభిమానుల అంచనాలను మించేలా సినిమా ఉంటుందని టీజర్ చూస్తుంటేనే అర్థమవుతుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ ‘‘టీజర్ చూస్తుంటే గూజ్ బమ్స్ వస్తుందని అందరూ అంటున్నారు. కొరటాల శివగారు ఇటు మెగాస్టార్ చిరంజీవిని, అటు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ పాత్రలను ఎంత పవర్‌ఫుల్‌గా ఇన్‌టెన్స్‌తో డిజైన్ చేశారో టీజర్‌లో తెలిసిపోతుందని అందరూ అంటుంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌కు, లాహే లాహే సాంగ్.., నీలాంబరి సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఆచార్యను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నాం’’ అన్నారు.
కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా, తిరుణ్ణావుక్కరుసు సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్, సురేశ్ సెల్వరాజ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేశారు.