ఉత్తరప్రదేశ్‌లో ఒక ఎంపీ స్థానానికి, మరో ఎమ్మెల్యే స్థానానికి జరుగుతున్న ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాజకీయ సునామీని పుట్టించిన రాష్ట్రం యూపీ. 2014 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ 90 శాతం సీట్లను సొంతం చేసుకుంది. ఆ తర్వాత కొంత విరామం అనంతరం జరిగిన యూపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లోనూ కమలం పార్టీ యూపీలో అదే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే అనంతరం జరిగి రెండు ఎంపీ సీట్ల ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీకి అనూహ్య ఓటమి ఎదురైంది.
యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా వెళ్లడంతో గోరక్‌పూర్ ఎంపీ సీటుకు, డిప్యూటీ సీఎంగా వెళ్లిన కేశవ్ ప్రసాద్ మౌర్య సీటు ఫూల్పూర్‌కు కొన్నాళ్ల కిందట ఉప ఎన్నికలు జరిగాయి. ఈ బై పోల్స్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. ఈ సీట్లలో బీఎస్పీ పోటీ చేయకుండా ఎస్పీ అభ్యర్థులకు మద్దతు పలకడంతో కమలం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ రాష్ట్రంలో సిట్టింగులు మరణించడంతో ఖైరానా ఎంపీ సీటుకు, నూర్పూర్ ఎమ్మెల్యే సీటుకు ఉప ఎన్నికలు వచ్చాయి. మరణించిన ఖైరానా ఎంపీ హుకుం సింగ్ కూతురుకు బీజేపీ టికెట్ ఖరారు చేసింది. నూర్పూర్ సీటుకు కూడా అవనిసింగ్ అనే అభ్యర్థిని ప్రకటించింది. ఈ స్థానాలపై సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ ఉప ఎన్నికల్లో ఎస్పీ-ఆర్‌ఎల్డీ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఎంపీ సీటును ఆర్ఎల్డీకి కేటాయించి ఎస్పీ, ఎమ్మెల్యే సీటును ఎస్పీకి కేటాయించింది ఆర్‌ఎల్డీ. ఇలా పొత్తుతో పోటీ చేస్తున్నాయి ఆ పార్టీ. ఈ ఉప ఎన్నికల్లో బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేయకపోవచ్చనే మాట వినిపిస్తోంది. గోరక్‌పూర్, ఫూల్పూర్ సీట్ల ఉప ఎన్నికల్లో ఎస్పీకి మద్దతు పలికినట్టుగా మాయవతి ఇక్కడ కూడా పోటీ నుంచి విరమించుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.