రాజమండ్రి, నవంబర్ 29,
ఇద్దరూ ప్రభావితం చేయగల నేతలే. ఇద్దరికీ ప్రత్యక్ష రాజకీయాల్లో అనుభవం ఉంది. ప్రజాసమస్యలు వారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. క్షేత్రస్థాయిలో వారికి ప్రజల మూడ్ తెలుసు. అలాంటి నేతలు ఇప్పుడు చెరొక వైపుగా నిలవడం ఏపీ రాజకీయా్ల్లో చర్చగా మారింది. వారే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. కాపు రిజర్వేషన్ పోరాట ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ఇద్దరూ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నేతలే కావడం గమనార్హం. ముందుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి చెప్పుకుందాం. ఆయన బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారు. పెద్దగా కుల ఓట్లను ఆకర్షించే శక్తి లేదు. అలాగని ప్రజలను ప్రభావం చేయలేరని కాదు. ఉండవల్లి మాటలంటే అనేకమందికి గురి. ప్రధానంగా మేధావులు, తటస్థులలో ఆయన ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారన్న పేరుంది. ప్రజల మూడ్ తెలుసుకునే మాట్లాడతారని కూడా అంటారు. ప్రతి అంశంపై పూర్తి స్థాయిలో అథ్యయనం చేసిన తర్వాతనే ఏదైనా విమర్శలు చేస్తారు. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులుండటంతో వారి చేత ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని మరీ చెబుతారు. కొద్ది కాలంగా ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలపై ఆయన జగన్ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఇరుకున పెడుతూ ఉన్నారు. ఒక రకంగా పరోక్షంగా ఆయన చంద్రబాబుకు సహకారం అందిస్తున్నట్లే లెక్క. నేరుగా మద్దతివ్వకపోయినా చంద్రబాబు పట్ల ప్రజల్లో సానుకూలత నెలకొనేలా ఆయన కామెంట్స్ ఉన్నాయి. కాపుల్లో ఇక కాపు రిజర్వేషన్ పోరాట సమితి ముద్రగడ పద్మనాభం పూర్తిగా చంద్రబాబుకు యాంటీగా కనపడుతున్నారు. ఈయన కాపు సామాజికవర్గంలో బలమైన నేత. ఆయన ఆ కులాన్ని ప్రభావం చేయగలరు. కేవలం కులం నేతగానే ఆయన గుర్తించబడుతున్నారు. ఆయన చంద్రబాబును నిత్యం ఇబ్బందుల్లోకి నెట్టేందుకే ప్రయత్నిస్తారు. జగన్ కు నేరుగా మద్దతివ్వకపోయినా పరోక్షంగా ఆయనకు సహకరిం అందిస్తున్నట్లే లెక్క. చంద్రబాబు టార్గెట్.... కాపు రిజర్వేషన్ ఉద్యమం నుంచి తప్పుకున్న ముద్రగడ పద్మనాభం చంద్రబాబు అధికారంలోకి రావాలని మాత్రం కోరుకోవడం లేదు. ఆయన వల్ల తమ సామాజికవర్గం బాగుపడదన్నది ముద్రగడ అభిప్రాయం. జగన్ వల్ల సాధ్యమవుతుందా? అంటే దానికి సమాధానం లేదు. అది అంతే. చంద్రబాబుపై ఎప్పుడూ నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. సో... ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. చెరో వైపు పరోక్షంగా నిలిచారు.