మహబూబాబాద్
సహజంగా ఏ బావిలో నుంచి అయిన చల్లని నీరు వస్తుంది, కానీ ఓ గ్రామంలోని ఆలయ బావిలో పగలు రాత్రి అనే తేడా లేకుండా వేడి నీరువస్తుంది... ఇలాంటి ఆశ్చర్య కరమైన అద్భుత వింత ఘటనను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముధ్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన పురాతనమైన శివాలయంలో ఉన్న బావిలో వేడి నీరు వస్తుండడంతో గ్రామస్థులు ఏదైనా ముప్పు ముంచుకువస్తుందని భయంతో గజ గజా వణుకుతూ ఆందోళన చెందుతున్నారు. ఆలయంలోని బావిలో చేద బకెట్ తో తోడుతుంటే వచ్చే నీరు పట్టుకుంటే చేతులు కాలిపోయే విధంగా నీరు ఉండడంతో ఈ వింతను చూసేందుకు గ్రామస్థులతో పాటు చుట్ట పక్కల గ్రామాల వారు ఎగబడుతున్నారు. ఈ బావి నీరు త్రాగడం వలన రోగాలు మటు మాయమవడమే కాకుండా ఆరోగ్యoగా జీవిస్తారని ప్రజల ప్రగాడ విశ్వాసం. ఊరి ప్రజలను చల్లంగా చూస్తున్న శివుడు ఆలయ బావిలో నుండి సలసల మరిగే వేడి నీరు రావడానికి ఏంటో కాల మహిమా అని చర్చించుకుంటున్నారు. గ్రామంలోని అన్ని బావుల్లో వస్తున్నచల్లని ఊటకు బదులు శివాలయంలో ఉన్న ఈ బావిలోనే వేడి ఊట నీరు వస్తుంది. దీంతో గ్రామస్తులు ఏమిటి ఈ మాయ అంటూ ఒక పక్క సంతోషం, మరో పక్క ఆందోళన చెందుతున్నారు. దీనిపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని స్థానికులతో పాటు విద్యావంతులు కోరుతున్నారు. పురావస్తు, జియోలాజికల్ శాఖల వారు ఈ గ్రామంలో ఉన్న శివాలయాన్ని సందర్శించి ఈ వేడి నీరు పై పరిశోధనలు జరిపి ప్రజల్లో భయాందోళనలు తొలగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, శితిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని ఆలయ అర్చకులు, స్థానికులు కోరుతున్నారు.