అత్యంత అరుదైన రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడు – వరదవెల్లి.
దత్తబంధువులందరికీ నమస్కారములు, దత్తాత్రేయుడు నిరాకారుడు. హద్దులు,ఎల్లలు లేనివాడు. శూన్యంలో కుడా వ్యాపించి ఉన్నవాడు. దిక్కులనే అంబరములుగా చేసుకున్నవాడు. కేవలం భక్తునుద్ధరించేందుకే రూపాలను ధరించేవాడు. నిరాకారంగా ఉండడం కుడా ఒక ఆకారమే అని చాటి చెప్పినవాడు. బాలకుడిగా వచ్చినా, ఉన్మత్తుడిగా ఉన్నా, కల్లుగీసే గౌడకులస్తుడిగా కనిపించినా, పిశాచరూపంలో ఉన్నా అవన్నీ భక్తులను ఉద్దరించడానికే! అటువంటి దత్తాత్రేయుల వారు ‘పడుకున్నపాములాగ’ ఉన్నారన్న విషయం తెలిసి, ఆక్షేత్రాన్ని దర్శించి ఎంతో ఆనందించాను. నాకు కేవలం శ్రీపాదుల వారి ఆశీస్సులతో మాత్రమే ఈ క్షేత్ర సమాచారం లభించింది, వారి ఆశీస్సుల తోనే నేనక్కడకి వెళ్ళడం జరిగింది మరియు తరువాత మన ట్రస్ట్ తరుఫున ఒక 30 మందిని కుడా వారి ఆశీస్సుల తోనే అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. వరదవెల్లి దత్తాత్రేయుని విగ్రహంలో దాగున్న పెనవేసుకున్న జంట సర్పముల ఆనవాళ్ళను చూసి ఆశ్చర్యపోయాను. అబివృద్దికి ఆమడదూరంలో ఉన్న ఒక కుగ్రామంలో, ప్రపంచంలోని ఏకైక రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడు నిఘూఢముగా ఉండడం మరింత ఆశ్చర్యపరిచింది. అక్కడి స్థలపురాణం తెలిసి ఆశ్చర్యపోవడం నావంతైంది. వెంటనే స్థానికులను, పూజారి గారిని కలిసి మన వెబ్సైట్ భక్తులందరి కోసం ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించి మీకు అందిస్తున్నాను. గురు దత్తాత్రేయుల వారి ఆశీస్సులతో ప్రపంచం లోనే అతి కొద్దిమంది దత్త భక్తులకు మాత్రమే తెలిసిన ఈ వరదవెల్లి శయన దత్తాత్రేయుడిని దర్శించి తరించండి.
*వరదవెల్లి గ్రామం ఎక్కడుంది? ఆ పేరెలా వచ్చింది*
వరదవెల్లి గ్రామం ‘తెలంగాణ’ లోని కరీంనగర్ జిల్లాలోగల బోయినపల్లి మండలంలో కరీంనగర్ – వేములవాడ రోడ్ లోని కొదురుపాక స్టేజి వద్దగలదు. వరదవెల్లి గ్రామం ‘మిడ్ మానేరు’ జలాశయం క్రింద రావడం వల్ల వరదవెల్లి గ్రామం మొత్తం దాదాపుగా నిర్వాసిత గ్రామమే. మిడ్ మానేరు జలాశయం పూర్తయితే ఈ అరుదైన దత్తక్షేత్రంతో పాటు ఊరు కుడా ఉండకపోవచ్చు. పూర్వం నుండి తరచుగా ఈ గ్రామం ముంపుకు, వరదలకు గురౌతుండడం, శ్రీరాం సాగర్ వరద కాల్వ ఈ గ్రామం గుండా వెళుతుండడం వల్ల ‘వరదవెల్లి’ అని పేరు వచ్చిందని కొంత మంది గ్రామస్తుల అభిప్రాయం. అయితే గురు దత్తాత్రేయుల వారు ‘వరద హస్తములతో’ ఇక్కడ వెలియడం వల్ల ‘వరదవెల్లి’ అనే పేరొచ్చిందన్నది చారిత్రాత్మక కథనం.
*వరదవెల్లి గ్రామం ను ఎలా చేరుకోవాలి?*
హైదరాబాద్ నుండి వరదవెల్లి గ్రామానికి రూట్ (సికింద్రాబాద్ To వరదవెల్లి 175 కీ.మీ.)
హైదరాబాద్ నుండి వరదవెల్లి గ్రామానికి రూట్ (సికింద్రాబాద్ To వరదవెల్లి 175 కీ.మీ.)
సికింద్రాబాద్ ---->JBS---->ఆల్వాల్ ---->షామీర్ పేట్ ----> ప్రజ్ఞాపూర్ ----> శనిగరం ----> కరీంనగర్ ----> వేములవాడ జంక్షన్ ----> వేములవాడ రోడ్ ----> బావ్ పేట్ గ్రానైట్ క్వారీలు ----> NTR Tamil కాలనీ ----> వెంకట్రావు పేట ----> కొదురుపాక స్టేజ్ -----> వరదవెల్లి అడ్డ రోడ్ ---->వరదవెల్లి గ్రామం
వరదవెల్లి గ్రామం ను ఎప్పుడు దర్శించు కోవాలి?
వరదవెల్లి గ్రామం లోని అత్యంత అరుదైన రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడి గుడిని సంవత్సరంలో ఎప్పుడైనా దర్శించుకోవచ్చు. అయితే ముందుగా పుజారిగారికి ఫోన్ చేసి మాత్రమే వెళ్ళాలి. ఈ క్షేత్ర దర్శనానికి వర్షాకాలం అంత అనువైనది కాదు.
*వరదవెల్లి గ్రామం ప్రత్యేకత ఏంటి?*
అత్యంత అరుదైన రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడు ఉండడం ఈ గ్రామ ప్రత్యేకత. ఇటు వంటి క్షేత్రం ప్రపంచంలో మరెక్కడాలేదు. ఈ దత్తక్షేత్రం ప్రాంగణం లోనే దత్తాత్రేయుడు వేంకటేశ్వర స్వామి రూపంలో ‘దత్త వేంకటేశ్వర స్వామి’ గా కుడా వెలిశారు. దత్త వేంకటేశ్వర స్వామి గుడి కుడా ప్రపంచంలో ఇదొక్కటే.
*వరదవెల్లి గ్రామమును గురించిన చారిత్ర్రాత్మక వివరణ*
వరదవెల్లి గ్రామం చారిత్రాత్మకంగా ప్రసిద్ధికెక్కిన గ్రామం. నీటి నిల్వలు అధికంగా ఉంది బాగా పంటలు పండే ప్రదేశం. అప్పట్లో గుట్ట మీదగల శయన దత్తాత్రేయుడు మరియు దత్త వేంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాతే వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించేవారట. కాలక్రమేణా ఈ ఆచారం మరుగున పడిపోయింది.
వరదవెల్లి రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయ స్థలపురాణం
వరదవెల్లి రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయ స్థలపురాణం తెలుసుకోవడం కోసం కొంత కష్టపడాల్సి వచ్చింది. కాని శ్రీపాదుల వారి దయతో, ’హైందవ సంస్కృతి భరత్ కుమార్ శర్మ’ గారి ద్వారా మరియు ఇతర దత్తావధూతల నుండి సేకరించిన సమాచారం ఒక చోట క్రోడీకరించి మీకిక్కడ వరదవెల్లి రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయ స్థలపురాణంగా ఇస్తున్నాను.
దాదాపు 900 సంవత్సరాల క్రితం దేశాటనలో భాగంగా శ్రీవేంకటాచార్యులు అనే ఒక కుర్ర వైష్ణవ అవధూత (ఈయననే వెంకావధూత అనేవారు) వేములవాడకు వచ్చి అక్కడనుండి వరదవెల్లికి వచ్చి అక్కడ గల గుట్ట మీద శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రంహం కోసం 12 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేసారు. వెంకావధూత వేంకటేశ్వర స్వామి వారి భక్తుడే కాకుండా శ్రీ గురు దత్తాత్రేయుల వారి భక్తులు కుడా. వారి తపస్సుకు మెచ్చిన వేంకటేశ్వర స్వామి వెంకావధూత కోరిక మేరకు ‘దత్తవెంకటేశ్వర స్వామిగా’ దర్శనమిచ్చారు. దత్తవెంకటేశ్వర స్వామి దర్శనంతో పులకించిపోయిన వెంకావధూత తదుపరి కుడా అక్కడే ఉండి శ్రీ గురు దత్తాత్రేయుల వారి కోసం ఘోర తపస్సు చేసారు. ఆవిధంగా 28 సంవత్సరాలు దత్త దర్శనం కోసం నిరంతరం తపించారు. ఆఖరికి ఒకానొక గురువారం ఉదయం సూర్యోదయ సమయంలో శ్రీ దత్తాత్రేయుల వారు ఏఖముఖుడిగా ప్రత్యక్షమై వెంకావధూత భక్తి శ్రద్ధలకు మెచ్చి ఏంకావాలో కోరుకోమన్నారు.
*ఈ సందర్భంగా శ్రీ గురు దత్తాత్రేయుల వారికి వెంకావధూత కు మధ్యలో జరిగిన సంభాషణ:*
శ్రీ దత్తాత్రేయుల వారు: లోగడ నేను దత్తవెంకటేశ్వర స్వామిగా దర్శనం ఇచ్చినా ఇంకా పట్టువీడలేదేం? ఏదిఏమైనా నీ గురు భక్తి మాకు నచ్చింది…ఏంకావాలో కోరుకో వేంకటాచార్య!
*వెంకావధూత:*
మహాప్రభో..దేవాదిదేవా…గురు సార్వభౌమా..”దయచేసి నన్ను మీలో ఐక్యం చేసుకోండి” అదే నా కోరిక.
శ్రీ దత్తాత్రేయుల వారు: నేను మహా సముద్రం వంటి వాడను. దానిలోకి ఒక కడవడు నీళ్ళు పోయడం వల్ల కడవడు నీరు వృధా అవుతుందే తప్ప ఉపయోగం లేదు. కాబట్టి నువ్వు నాలో ఐక్యం కావడం వల్ల నీకు నష్టమే తప్ప ఉపయోగం లేదు. బాగా ఆలోచించు. మరో కోరికేదైనా ఉంటే కోరుకోవచ్చు.
వెంకావధూత: క్షమించండి గురుదేవా నాకు ఆకోరిక తప్ప మరో కోరిక – ఆలోచన లేదు.
శ్రీ దత్తాత్రేయుల వారు: కాని నువ్విప్పుడే… ఈరోజు సూర్యోదయం నుండే ‘రాహు మహర్దశ’ లోకి వచ్చావు. రాహువు ఛాయాగ్రహం. మిగతా గ్రహాలూ నేరుగా ఖర్మ ఫలాలను అనుభవించేట్టుగా చేస్తే ఈ రాహుగ్రహం మాత్రం దొంగదెబ్బ తీసి ఖర్మ ఫలాలను అనుభవించేట్టుగా చేస్తాడు. నీ జన్మానుసారం నువ్వు రాహువిచ్చే భాదలకు లోనుకాక తప్పదు. అటుపిమ్మట మాత్రమే నేను నిన్ను ఐక్యం చేసుకోగలను.
వెంకావధూత: గురుదేవా నా జన్మకుండలి ప్రకారం ఇవ్వాళే నేను ‘రాహు మహర్దశ’ లోకి వచ్చాను. రాహువు నీచ సాంగత్యాన్ని ఇస్తాడు. అప్పుడు నేను మీలో ఐక్యం కావడానికి అర్హుడను కానేమో! అందుకే దయచేసి నన్ను మీలో ఐక్యం చేసుకోండి.
శ్రీ దత్తాత్రేయుల వారు: సరే అయితే నీ ఇష్టం…కాని రాహువు ఇచ్చే ఫలితాలను అనుభవించాకే అది సాధ్యం..కాబట్టి రాహువును పిలిపిద్దాం… రాహువుని రావలసిందిగా కాలభైరవుల ద్వారా కబురు పెడతారు.
అప్పుడు శ్రీ దత్తాత్రేయుల వారికి మరియు రాహువు కు మధ్య జరిగిన సంభాషణ:
రాహువు: గురుదేవా పాహిమాం..తమరి ఆజ్ఞ…
శ్రీ దత్తాత్రేయుల వారు: రాహు మహాశయా ఈ వెంకటాచార్యులు యొక్క ఖర్మలను అతి త్వరగా అనుభవించేట్టుగా చేసి పునీతుడను చెయ్యి.
రాహువు: గురుదేవా మీముందు నా శక్తి పనిచేయదు. ఇక్కడ నేను ఆశక్తుడను. మీ సమక్షంలో, సద్గురువుల సమక్షంలో నేను ఒక సాధారణ జీవిని మాత్రమే. నా శక్తులన్నీ ఇప్పుడు మీలోనే నిక్షిప్త మై ఉన్నాయి. ప్రస్తుతం ఆ పని చేయగల సమర్ధులు మీరే! క్షమించండి.
శ్రీ దత్తాత్రేయుల వారు: సరే అయితే నేనే రాహురూపం లోకి మారి. శయన సర్పరూపుడిగా ఆ పని చేస్తాను. నా త్రిముర్త్యాత్మకతకు చిహ్నంగా ఈ క్షేత్రం లో మూడు నింబవృక్షాలు కుడా ఆవిర్భవించి, అరుదైన దత్తక్షేత్రంగా కీర్తికెక్కుతుంది. ఇక్కడకి దర్శనానికి వచ్చే భక్తులను రాహువు రూపంలో ఉన్న నేను త్వరగా ఉద్ధరిస్తాను. ఈ క్షేత్రం లో గల నా రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయ విగ్రహానికున్న ‘వరద హస్తాలు’ భక్తులనెల్లవేళలా కాపాడతాయి.
వెంకావధూత: గురుదేవా శరణం శరణం.. ధన్యుడను.
అంతట శ్రీ దత్తాత్రేయుల వారు రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడు గా మారి వెంకావధూత ఖర్మలను త్వరగా అనుభవించేట్టుగా చేసి వెంకావధూతను వారిలోకి ఐక్యం చేసుకుంటారు. ఆ విధంగా కేవలం భక్తులను ఉద్ధరించడానికి మరో రూపం లోకి మారి అత్యంత అరుదైన రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడు – వరదవెల్లి దత్తాత్రేయుడు గా యేర్పడ్డాడు. ముందు చెప్పుకున్నట్లుగా రూపమే లేని గురు దత్తాత్రేయుడు ఇక్కడ చిత్రంగా ఉండి పూజలందుకుంటున్నారు. ప్రతి దత్త భక్తుడూ వెను వెంటనే దర్శించవలసిన క్షేత్రమిది.
వరదవెల్లి [రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడు] దత్త క్షేత్రం ఫోటోలు
వరదవెల్లి రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రే యుడిని ఎవరు దర్శించుకోవాలి ?
ప్రపంచం లోనే అతి అరుదైన, వింతైన ఈ వరదవెల్లి రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడిని అందరూ దత్త భక్తులు దర్శించుకోవచ్చు. అలాగే ఈ క్రింది వారు మాత్రం తక్షణ ఉపశమనంకోసం తప్పక దర్శించుకోవాలి.
వరదవెల్లి దత్తక్షేత్రాన్ని తక్షణ ఉపశమనం కోసం దర్శించుకోవలసినవారు
వరదవెల్లి దత్తక్షేత్రాన్ని తక్షణ ఉపశమనం కోసం దర్శించుకోవలసినవారు
1. తొందరగా తెమలని కోర్ట్ కేసులు ఉన్నవారు
2. వయసు పెరిగినా ఉద్యోగంలో సెటిల్ అవ్వనివారు
3. రాహు మహర్దశలో ఉన్నవారు
4. భర్త ఒక చోట ఉద్యోగంలో భార్య,పిల్లలు మరొక చోట ఉన్నవారు లేదా భార్య ఒక చోట ఉద్యోగంలో భర్త,పిల్లలు మరొక చోట ఉన్నవారు
5. ఉద్యోగ బదిలీలు కావాలనుకునేవారు
6. ఆఫీస్ పాలిటిక్స్ లో పైచేయి/విజయం సాధించాలనుకునే వారు
7. దొంగతనం మొదలైన అభాండాలు మీదపడ్డవారు
8. తరచుగా అబార్షన్లు/సంతన నష్టం కలిగినవారు
ఏమేమి తీసుకెళ్ళాలి?
వరదవెల్లి రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడిని దర్శించుకునే వారు అభిషేక సామగ్రిని, నల్ల వస్త్రాన్నితీసుకెళ్ళాలి. అలాగే అక్కడ గల దత్త వెంకటేశ్వర స్వామి వారికి పూ సామాగ్రి మరియు పట్టు వస్త్రాన్ని తీసుకెళ్ళాలి.
ఆశ్చర్యపరిచే ప్రత్యక్ష నిదర్శనాలు
1. దత్తాత్రేయుడు పడుకుని రాహు రూపంలో ఉండడం
2. దత్తత్రేయునికి ప్రతీకగా నేటికి ఉన్న వందల ఏళ్ళనాటి నింబవృక్షాలు
3. వరదవెల్లి రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడిని ఫోటో తీసినప్పుడు విగ్రహం లో దాగిఉన్న జంట సర్పాల ఆనవాళ్ళు కనిపించడం
4. దత్తాత్రేయుడు వెంకటేశ్వర స్వామి రూపంలో 'దత్త వెంకటేశ్వరస్వామి' గా పిలవబడడం
5. ఇటువంటి అతి అరుదైన క్షేత్రం త్వరలో నదీగర్భంలో కలియనుండడం
6. క్షేత్రానికి 3 వైపులా నీరు ఉండడం
వరదవెల్లి క్షేత్ర నిర్వాహకుల సమాచారం
Sri ChandraMouli Sharma - Varadavelli Dattakshetram Pujari (శ్రీ చంద్రమౌళి శర్మ - వరదవెల్లి దత్త క్షేత్రం పూజారి) - 09959092933
Sri Lakshmana Rao (శ్రీ లక్ష్మణ రావు) - 09441135530
వరదవెల్లి దత్త క్షేత్రం పోస్టల్ అడ్రస్
Postal Address of Varadavelli Datta Kshetram (వరదవెల్లి దత్త క్షేత్రం పోస్టల్ అడ్రస్)
Varadavelli Village
Via: Kodurupaka
Boinpally Mandal
Karimnagar Dist. - 505524
వరదవెల్లి కి దగ్గర లోగల ఇతర దర్శనీయ ప్రదేశాలు
*షామీర్ పెట్ దగ్గరగల రత్నాలయం
*శనిగరం స్టాప్ దగ్గరగల అనంతసాగరం జ్ఞాన సరస్వతి దేవాలయం
*వరదవెల్లి కి 20 KM దూరం లో గల వేములవాడ దేవాలయం.