ముఖ్యమంత్రితో కేంద్ర బృందం భేటీ
వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన వివరాలు తెలిపిన బృందం
అమరావతి
భారీ వర్షాలు, వరద నష్టంపై కేంద్ర బృందంతో క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. కేంద్ర బృందం సభ్యులు కునాల్ సత్యార్ధి, అభయ్ కుమార్, డాక్టర్ కే.మనోహరన్, శ్రీనివాసు బైరి, శివాని శర్మ, శ్రవణ్ కుమార్ సింగ్, అనిల్కుమార్ సింగ్లు హాజరు అయ్యారు. కునాల్ సత్యార్ధిమాట్లాడుతూ మూ రోజులపాటు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాం. వీలైనన్ని గ్రామాలను, వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలనూ పరిశీలించాం. కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లింది. ఆ గ్రామాలను కూడా పరిశీలించాం. పశువులు చనిపోయాయి, రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు.. ల్లాంటి మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయి. అధికారులు మాకు మంచి సహకారాన్ని అందించారు. మా పర్యటనల్లో వివిధ రాజకీయ ప్రనిధులను, మీడియా ప్రతినిధులను కలుసుకున్నాం. సంప్రదాయంగా వరదలు వచ్చే ప్రాంతం కాదు. అలాంటి ప్రాంతంలో ఊహించని రీతిలో వర్షాలు పడ్డాయి. కరువు ప్రాంతంలో అతి భారీవర్షాలు కురిశాయి. ఈ స్థాయిలో వరదను నియంత్రించగలిగే రిజర్వాయర్లు, డ్యాంలు కూడా ఈ ప్రాంతంలో లేవు. ఉన్న డ్యాంలు, రిజర్వాయర్లు కూడా ఈస్థాయి వరదలను ఊహించి నిర్మించినవి కావు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన చోట... నష్టం అపారంగా ఉంది. చిత్తూరులో జిల్లాలో కొంత భాగం, నెల్లూరులో కూడా వరదల ప్రభావం అధికంగా ఉంది. కడప జిల్లాలో మౌలికసదుపాయాల నిర్మాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఇలాంటి విపత్తు హృదయవిదారకరం. నష్టం అంచనాలకోసం మీరు ఆయా ప్రాంతాల్లో పర్యటించినందుకు ధన్యవాదాలు. ఉదారంగా, మానవతా పరంగా స్పందించాలని కోరుతున్నా. పంపించిన నష్టం వివరాల్లో ఎలాంటి పెంపూ లేదు. నష్టం అంచనాల తయారీకి క్షేత్రస్థాయిలో మాకు సమర్థవంతమైన వ్యవస్థఉంది. ప్రతి గ్రామంలో ఆర్బీకే ఉంది, ప్రతి రైతు పంటకూడా ఇ–క్రాప్ అయ్యింది. సోషల్ఆడిట్కూడా చేయించాం. ఇ– క్రాప్కు సంబంధించి రశీదుకూడా రైతుకు ఇచ్చాం. నష్టంపోయిన పంటలకు సంబంధించి కచ్చితమైన, నిర్దారించబడ్డ లెక్కలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో నష్టానికి సంబంధించి వాస్తవ వివరాలను మీకు అందించామని అన్నారు. కోవిడ్ నియంత్రణా చర్యలకోసం వినియోగించినందువల్ల ఎస్టీఆర్ఎఫ్ నిధులు నిండుకున్నాయని మా ఆర్థిక శాఖ కార్యదర్శి మీకు వివరించారు. పనులు చేయాలంటే నిధులు అవసరం, వెంటనే అడహాక్ ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని కోరుతున్నాం. కేంద్ర బృందం చేసిన సూచనలనూ పరిగణలోకి తీసుకుంటామని అన్నారు.
చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పురపాలక,పట్టణాభివృద్ది శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, జలవనరుల శాఖ స్సెషల్ సీఎస్ డాక్టర్ కేఎస్.జవహర్ రెడ్డి, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్.రావత్, రవాణా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ.కృష్ణబాబు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్ కమిషనర్ కోన శశిధర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్, విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కే.కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు కుడా ఈ కార్యక్రమానికి హాజరుఅయ్యారు.