3 వ్యవసాయ చట్టాలు రద్దు
న్యూఢిల్లీ, నవంబర్ 29,
వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లుకు రెండు సభలు ఆమోదం తెలిపాయి. మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.విపక్షాల ఆందోళన మధ్యనే సాగు చట్టాల రద్దు బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం మూజువాణి ఓటు బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్టుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. తర్వాత విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో లోక్‌సభను స్పీకర్ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.పార్లమెంటు సమావేశాలు మొదలైన తొలిరోజే కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రవేశపెట్టారు. అయితే ఆ సమయంలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. బిల్లుపై చర్చ నిర్వహించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో లోక్‌సభ రసభసగా మారింది. ఈ బిల్లుపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ డిమాండ్ చేశారు. ఇక, తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు వెల్‌లోకి దూసుకువెళ్లిన నిరసన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ధాన్యం కొనుగోలుపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు.కాగా, సాగు చట్టాలపై చర్చ లేకుండా మూడు వ్యవసాయ చట్టాల రద్దు చేయడంతో విపక్షాలు గందరగోళం సృష్టించాయి. మూజువాణి ఓటుతోనే బిల్లుకు ఓకే చెప్పేశారు. దీంతో విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చారు. అయితే చర్చను చేపట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పిన స్పీకర్ బిర్లా..
ఇటు రాజ్యసభలో..
వివాదాస్పద సాగు చట్టాల రద్దు బిల్లుకు రాజ్యసభ కూడా సోమవారం ఆమోదం తెలిపింది. అంతకుముందు ఈ బిల్లును లోక్‌సభ మూజువాణీ ఓటుతో ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదమే మిగిలింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం లభించడంతో, దీనిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపిస్తారు.
వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు ఓ సంవత్సరం నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నవంబరు 19న జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ చట్టాలను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు.. రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్ స్పందిస్తూ, ఈ మూడు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన 750 మంది రైతులకు ఇది నివాళి అని పేర్కొన్నారు. ఈ చట్టాలను రద్దు చేసినప్పటికీ, వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) సమస్య పెండింగ్‌లోనే ఉందని, అందువల్ల తమ నిరసనలు కొనసాగుతాయని చెప్పారు.