జగన్ సర్కార్ కు ఎల్ఐసీ షాక్
విజయవాడ, నవంబర్ 29,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) షాకిచ్చింది. ఏపీ ప్రభుత్వ అభయహస్తం పథకంతో ఇక మీదట తమ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని LIC బహిరంగ ప్రకటన జారీచేసింది. ఈ పథకం కింద తమ వద్ద ఉన్న రూ.2,000 కోట్ల నిధిని (ప్రీమియం కింద లబ్ధిదారులు చెల్లించిన సొమ్ము) ప్రభుత్వం విత్‌డ్రా చేయడంతో మా ఒప్పందం రద్దయ్యిందని ఆ ప్రకటనలో పేర్కొంది.అభయహస్తం పథకం కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థతో 27 అక్టోబరు 2009లో ఎల్ఐసీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఈ ఒప్పందం 3 నవంబరు 2021న రద్దయినట్టు ఎల్ఐసీ తన ప్రకటనలో తెలిపింది.అవగాహన ఒప్పందం రద్దుకావడంతో ఎల్ఐసీ ఆఫ్ ఇండియా వద్ద ఉన్న నిధులను అభయహస్తం పథకం నోడల్ ఏజెన్సీ ఎస్ఈఆర్సీకి బదిలీ చేశాం..మాస్టర్ పాలసీ నెంబరు 514888, అభయహస్తం పథకం కింద మా అన్ని కర్తవ్యాలు, బాధ్యతలు నుంచి వైదొలగాం.. ఇకపై అభయహస్తం పథకంతో ఎల్ఐసీకి ఎటువంటి సంబంధం లేదు.. ఇకపై లబ్దిదారుల గత క్లైయిమ్‌లు, పెండింగ్‌లో ఉన్న క్లైయిమ్‌లు, భవిష్యత్తులో క్లైయిమ్‌లన్నింటినీ పరిష్కరించే బాధ్యత గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థదే’ అంటూ బహిరంగ ప్రకటనలో వెల్లడించింది.స్వయం సహాయక సంఘాల్లో సభ్యులు ఎవరైతే అభయహస్తం పథకంలో వారి కాంట్రిబ్యూషన్ చెల్లించి 60 ఏళ్లు వయస్సు నిండితే ఈ పెన్షన్‌కు అర్హులుగా నిర్ధారించారు. అయితే వీరిలో ఎవరైనా వితంతు, వికలాంగ, ఒంటరి, వృద్ధాప్య పింఛన్ పొందుతుంటే దానికి అదనంగా ఈ అభయహస్తం పింఛన్ కూడా అందుకుంటారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. 18–59 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన స్వయం సహాయక సంఘాల సభ్యులు రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ.365లు చెల్లిస్తే అంతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. అలా క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించిన వారికి 60 ఏళ్లు నిండిన తర్వాత రూ.500 నుంచి రూ.3వేల వరకు ప్రతి నెలా పింఛన్ రూపంలో అందించాలన్నది ఈ పథకం ఉద్దేశం.