YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విద్యుత్ వినియోగదారులకు... షాక్....

విద్యుత్ వినియోగదారులకు... షాక్....

గుంటూరు, నవంబర్ 30,
సంస్కరణల అమలులో ముందున్న విద్యుత్‌శాఖ తాజాగా చేపట్టిన సర్వే వినియోగదారుల్లో ఆందోళనకు కారణమౌతోంది. 'నో యువర్‌ కస్టమర్‌'  పేరుతో నిర్వహిస్తున్న ఈ సర్వేలో సేకరిస్తున్న వివరాలే దీనికి కారణం. నిజానికి వినియోగదారులకు సంబంధించిన అన్ని రకాల వివరాలు దశాబ్దాల తరబడి విద్యుత్‌ శాఖ వద్దనే ఉన్నాయి. దీంతో కొత్తగా తెలుసుకునే వివరాలు ఏమిటన్న ప్రశ్న వినియోగదాలనుండి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం డిస్కాముల ప్రైవేటీకరణకు, స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు కోసం, లోడ్‌ సంబంధిత సంస్కరణల కోసం ఒత్తిడి చేస్తుండటం, అదనపు రుణం కోసం వాటి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిన నేపథ్యంలో ఈ సర్వే జరుగుతుండటం గమనార్హం. సర్వేలో భాగంగా ఆధార్‌ నంబర్‌ను వినియోగదారుడు తప్పనిసరిగా చెప్పాల్సి ఉంటుంది. మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు ఎలా ఉన్నప్పటికీ ఆధార్‌నంబర్‌ సేకరించడం తప్పనిసరి అని సర్వేఫారమ్‌లో సైతం పేర్కొన్నారు. దీంతో భవిష్యత్‌లో ఆధార్‌ నంబర్‌కు, మీటర్‌ కనెక్షన్‌కు ముడిపెడతారని ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఉన్న గృహాల కంటే విద్యుత్‌ మీటర్లు రెండు, మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని అధికారులు ఇప్పటికే చెబుతున్నారు. దీంతో ఆధార్‌నంబర్‌ ఆధారంగా ఒక ఇంటికి ఒకే మీటర్‌ నిబంధనను అమలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఈ దిశలో ఇప్పటికే ఆదేశాలు అందాయని, ఇప్పటికిప్పుడే కాకపోయినా స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసే సమయంలోనైనా ఈ నిబంధన అమలు చేయక తప్పదని ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు చెబుతున్నారు. యజమాని ఒక్కరే అయినా ఇంటికి రెండు మూడు మీటర్లు ఉండటంతో శ్లాబులో తక్కువ బిల్లు వస్తోంది. ఇంటికి ఒకే మీటరు పద్ధతి అమలు చేస్తే విద్యుత్‌ శాఖకు రావాల్సిన ఆదాయం పెరుగుతుందని చెప్పారు. వీలైనంత త్వరగా ఈ పద్ధతిని అమల్లోకి తీసుకురావాల్సి ఉందని వివరించారు. డిస్కమ్‌ల బకాయిలు పెరుగుతున్న నేపథ్యంలో చట్టబద్ధంగానే వాటిని పూడ్చుకోవాల్సి ఉంటుందని, అందులో భాగంగానే ఒకే మీటరు పద్ధతిని ముందుకు తెచ్చారని చెబుతున్నారు. అదే జరిగితే విద్యుత్‌ శ్లాబులు మారిపోయి, వినియోగదారులపై భారీ భారం పడే ప్రమాదం ఉంది. దీని ప్రభావం అద్దెదారులపై అధికంగా పడే అవకాశం ఉంది దీంతో తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే వినియోగించే లోడ్‌ ఆధారంగా అదనపు డిపాజిట్లు కట్టాలని, జరిమానాలు చెల్లించాలనీ గతంలోనే అధికారులు ఒత్తిడి చేశారు. ఫ్రిజ్‌ వాడుతున్నారని, ఎసి బిగించారనీ, రెండు ఫ్యాన్ల బదులు నాలుగున్నాయనీ ఇళ్లలోకి జరబడి జులుం చేసిన పరిస్థితి. వివిధ కారణాలతో అప్పుడు నిలిచిపోయినా ఇప్పుడు అందరినుండీ ఆ వివరాలు సేకరిస్తుండటంతో మళ్లీ ఆ పరిస్థితి తలెత్తవచ్చునని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.ఒకేమీటరు పద్ధతి అమల్లోకి వస్తే వినియోగం లోనూ, శ్లాబు పద్ధతిలోనూ మార్పులు రానున్నాయి. పట్టణ ప్రాంతాల్లో చిన్న ఇళ్లను చిన్నచిన్న పోర్షన్లుగా మార్చి అద్దెకు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఒక అసెస్మెంటులో మూడు మీటర్లు ఉంటే ప్రతి మీటరులోనూ 100 యూనిట్లు వినియోగిస్తే యూనిట్‌కు రూ.2.60 పైసలు పడుతుంది. ఇది ఇంటి యజమానితో పాటు, అద్దెదారులకు కూడా సౌలభ్యంగా ఉంటుంది. అయితే, ఒక ఇంటికి ఒకే మీటరు అన్న నిబంధన తీసుకువస్తే ఇది 300 యూనిట్లకు చేరుకుంటుంది. దీంతో శ్లాబ్‌ పద్దతి ప్రకారం యూనిట్‌కు రూ.6.88 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఇంటి యజమానితో పాటు అద్దెదారులకు కూడా భారంగా మారుతుంది.ఇలాంటి ఎన్నో కొత్త సమస్యలు తలెత్తవచ్చునని ప్రజలు భయపడుతున్నారు.వినియోగదారుని పేరు అడ్రస్‌ వంటి సాధారణ అంశాలతో పాటు విద్యుత్‌ కనెక్షన్‌ ఎందుకు తీసుకున్నారు? (గృహ, వాణిజ్య, వ్యవసాయ వినియోగం), కనెక్టడ్‌ లోడ్‌, కాంట్రాక్టెడ్‌ లోడ్‌, మీటరు సామర్ధ్యం వంటి వివరాలు సేకరిస్తున్నారు. చివరి బిల్లు ఎప్పుడు చెల్లించారు? సర్వీసు ప్రస్తుత స్థితి ఏమిటి? పొరుగునున్న వారి సర్వీసు నెంబర్‌ ఎంత? నిబంధనలకు విరుద్ధంగా ఒకేఇంటిలో అనేక కనెక్షన్లు ఉన్నాయా? సర్వీసుకు అన్ని రకాల అనుమతులున్నాయా? అద్దెదారులు ఉంటున్నారా? వంటి 24 ప్రశ్నలకు వినియోగ దారుల నుండి సమాధానాలు సేకరిస్తున్నారు. వీటితో పాటు భవన యజమాని ఎవరు, ఆ ఇంట్లో ఎన్ని మీటర్లు ఉన్నాయి, యజమానికి ఇతర మీటర్లు గలవారికి ఉన్న సంబంధం ఏమిటి అన్న వివరాలనూ అడుగుతున్నారు. ఒకే చోట గృహావసర మీటరు, వాణిజ్య వినియోగమీటరు ఉంటే వాటికి సంబంధించిన పూర్తి వివరాలనూ తీసుకుంటున్నారు. పైగా ఈ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలన్నీ నిజమైనవేనని దృవీకరిస్తూ వినియోగదారుని చేత సంతకం చేయించుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది.

Related Posts