తిరుపతి, నవంబర్ 30,
కడప జిల్లాపై ప్రకృతి వైఫరీత్యాలు పెనుప్రభావాన్ని చూపుతున్నాయి. రెండేళ్లుగా తుఫాన్ల తాకిడికి జిల్లా రైతాంగం చిగురుటాకులా వణుకుతోంది. సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాన్ల ధాటికి అన్నదాతలు అతలాకుతలవడం సహజం. కానీ మెట్ట ప్రాంతమైన కడప జిల్లాపై తుఫాన్లు దాడి చేస్తుస్తున్నాయి. రెండేళ్లుగా నివర్, జవాద్ తుఫాన్లకుతోడు అల్పపీడనాలు, అకాలవర్షాలు సైతం జత కలవడంతో జిల్లా రైతాంగం అతలాకుతల మవుతోంది. ఫలితంగా ఖరీఫ్, రబీ సీజన్లలో లక్షలాది హెక్టార్లలో వందల కోట్ల రూపాయల్లో పంట నష్టం వాటిల్లుతోంది. రెండేళ్లుగా రైతులపై దెబ్బ మీద దెబ్బ పడుతుండడంతో కోలుకోవడానికి సైతం అవకాశం లేకుండా పోతోంది. ప్రకృతి వైఫరీత్యాల వరుస దాడులకుతోడు పాలకులు ఎంఎస్‌పి అంశంలో తాత్సారాం చేస్తుండడం రైతాంగం పరిస్థితి అధోగతి పాలవుతోంది.జిల్లా వ్యవసాయ శాఖ రబీ సీజన్‌లో 1.03 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేసింది. గతేడాది సైతం దాదాపుగా ఇదే విస్తీర్ణంలో సాగు చేసిన సంగతి తెలిసిందే. ఖరీఫ్, రబీ సీజన్ల ఆరంభంలో ఆశాజనకంగా వర్షపాతం నమోదు కావడంతో రైతాంగం పంటల సాగుకు సన్నద్ధమైంది. ఆశించిన లక్ష్యం మేరకు పంటలు సాగు చేసింది. 2020 నవంబర్‌లో నివర్ తుఫాన్ ధాటికి రైతాంగం కకావికలమైంది. 1.20 లక్షల హెక్టార్లకుపైగా పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా సాగు చేస్తున్న 23 నుంచి 28 రకాల పంటల్లో వరి, పత్తి, వేరుశనగ, అరటి, బొప్పాయి, మామిడి ప్రధాన పంటలు. జిల్లాలోని 28 రకాల పంటలపైనా పెనుప్రభావాన్ని చూపించింది. ఫలితంగా జిల్లా వ్యవసాయ శాఖకు రూ.134 కోట్లు మేరకు పంట నష్టం వాటిల్లింది. జిల్లా వ్యవసాయశాఖ నివేదిక అందజేసింది. సీజన్ల ముగింపు సమయానికి పరిహారం నిధులను బాధిత రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ నెల 18, 19 తేదీల్లో కురిసిన జవాద్ తుఫాన్ ధాటికి ఖరీఫ్, రబీ సీజన్లలో 1.49 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. రూ.160 కోట్ల పంట నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇందులో వరి, పత్తి, వేరు శనగ, బుడ్డశనగ, అరటి, బొప్పాయి, మామిడి, సపోటా, చీనీ, సన్న చిమ్మ తదితర పంటల పొలాల్లో నీళ్లు నిలబడడంతో చెట్లు పాలిపోతున్నట్లు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. రాజంపేట నియోజకవర్గ పరిధిలో అన్నమయ్య, పింఛా రిజర్వాయర్లకు భారీ గండ్లు పడడం, పెన్నా పరీవాహక ప్రాంతాల పరిధిలోని గండికోట, చిత్రావతి, మైలవరం, దిగువసగిలేరు తదితర రిజర్వాయర్ల నుంచి నీటిపారుదల శాఖ భారీగా నీటిని కిందికి విడుదల చేసింది. వరద జిల్లా వ్యాప్తంగా 800 గ్రామాల్లోని పంటలను భారీగా వరద ముంచెత్తడంతో పెద్దఎత్తున నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. జిల్లా ప్రధాన ఆహార పంటలైన వరి, పత్తి, వేరుశనగ, పసుపు, టమోటా తదితర కూరగాయల పంటలపై వరద ప్రవహించింది. ఫలితంగా వరద పరీవాహక ప్రాంతాల్లో నేలకొరిగిన వరి పంటలను పరిశీలిస్తే రైతుల్లో దు:ఖం కట్టలు తెంచుకుంటోంది. జవాద్ గాయం చేసి పది రోజులు అవుతున్నప్పటికీ దక్షిణ అండమాన్‌లో లేచిన అల్పపీడనం పెనుప్రభావాన్ని చూపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా నేల కొరిగిన వరి పంట నుంచి మోసులెత్తి నాము పంట పండుతోంది. వరుస తుఫాన్లు, వరదలు, అకాల వర్షాలు, అల్ప పీడనాల తాకిడి తీవ్రతకు మోసులెత్తుతున్న వరి పంట అద్దం పడుతోంది. ఇదిలాఉండగా బ్రిటీష్ వారి హయాంలో 171 ఏళ్ల కిందట పెన్నానదిలో 2.20 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించినట్లు తెలుస్తోంది. దక్షిణ అండమాన్‌లోని లేచిన అల్పపీడనం ధాటికి 2.20 లక్షల క్యూసెక్కుల రికార్డును దాటి వరద ప్రవహించడం వరద తీవ్రతను తెలుస్తోంది. ఫలితంగా జిల్లాలోని పెన్నా, చెయ్యేరు సహా మరో నాలుగు నదులతోపాటు 13 ప్రదాన వాగులు, వంకలు తదితర పరీవాహక ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. ఫలితంగా జిల్లాలోని 1800 చెరువుల్లో 1450 చెరువులు జల కళ ను సంతరించుకోవడం, 42 చెరువులు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని పేర్కొనడంతో రైతాంగంలో ఆందోళన నెలకొంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్రాల్లోని పాలకులు పంట నష్టపోయిన రైతులకు బీమా సదుపాయం కల్పించడంతోపాటు సకాలంలో పంట నష్ట పరిహారాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందనడంలో సందేహం లేదు.